Lucknow News: పిలవని పెళ్లి భోజనానికి వెళ్లి లక్నో యూనివర్శిటీ విద్యార్థుల రచ్చ- ఎవరి తరపువాళ్లు అని అడిగినందుకు బంధువులపై దాడి
UP University Students Latest News: పిలవని పేరంటానికి వచ్చి రచ్చ రచ్చ చేశారు ప్రతిష్టాత్మక లక్నో యూనివర్సిటీ విద్యార్థులు. వివాహ విందును ఆరగించేందుకు వచ్చి రగడ సృష్టించారు..
Lucknow Latest News Today: పిలవని పేరంటానికి వెళ్లకూడదు అంటారు. పోనీ వెళ్లినా.. పని ముగించుకుని సైలెంట్‌గా వచ్చేయాలి. కానీ, ఉత్తరప్రదేశ్(UP) రాజధాని లక్నో(Lucknow)లోని ప్రతిష్టాత్మక లక్నో యూనివర్సిటీ విద్యార్థులు మాత్రం పిలవని విందుకు వెళ్లడమే కాదు.. అక్కడ నానా రచ్చ చేసేశారు. వారు చేసిన రచ్చ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది.
విందు-వివాదం!
తరచుగా సినిమా(Movies)ల్లో చూపించినట్టు.. పిలవని పెళ్లిళ్ల(Marriages)కు, ముక్కుమొహం తెలియని వారు చేసుకునే వేడుకలకు కొందరు వెళ్తుంటారు. అక్కడి షడ్రశోపేతమైన విందు (Banquet)ను ఆరగించి లొట్టలేసుకుంటూ బయటకు వస్తారు. పెద్ద పెద్ద ఫంక్షన్ హాళ్లలో జరిగే వేడుకల్లో ఇది సర్వసాధారణం. ఇలానే.. యూపీ రాజధాని లక్నో లోని ఐటీ సెంటర్ వద్ద ఉన్న ఓ ఫంక్షన్ హాల్లో వివాహ వేడుక జరిగింది. అయితే.. ఈ వేడుకలో వడ్డించే పదార్థాలను ఆరగించేందుకు.. లక్నో యూనివర్సిటీకి చెందిన కొందరు విద్యార్థులు కూడా వచ్చారు. అయితే, వారు రావడమైతే వచ్చారు కానీ...వారి వద్ద ఎలాంటి ఆహ్వాన పత్రికలు లేవు. ఇదే పెను వివాదానికి దారి తీసింది.
సహజంగానే.. మీరు ఎవరి తాలూకా? అనే ప్రశ్నలు వినిపించాయి. దీనికి విద్యార్థులు(Students) ఏదో ఒక రకంగా మేనేజ్ చేసుకుని ఉండాల్సింది. కానీ.. వారు ఎదురు తిరిగారు. మమ్మల్నే ప్రశ్నిస్తారా? అంటూ నిలదీశారు. ఇది కాస్తా వివాదానికి.. ఘర్షణలకు దారి తీసింది. యూనివర్సిటీ(University) విద్యార్థులు రచ్చ సృష్టించి విధ్వంసానికి పాల్పడ్డారు. అంతేకాదు.. వివాహానికి హాజరైన అతిథులపైనా చేయి చేసుకున్నారు. ఇది తీవ్ర ఘర్షణగా మారి.. కాల్పులు, బాంబు దాడులకు కూడా దారి తీసినట్టు తెలిసింది.
అసలు ఏం జరిగింది?
సోమవారం రాత్రి 11 గంటల సమయం. యూపీలోని లక్నోలో ఉన్న రామదిన్(Ramdin) ఫంక్షన్ హాల్లో బాజా భజంత్రీలు మోగుతున్నాయి. పెళ్లి సందడిలో బంధువులు, మిత్రులు షడ్రసోపేతమైన విందును ఆరగిస్తున్నారు. వంటకాల సువాసనలు పరిసర ప్రాంతాల్లో ఘుమఘుమలాడుతున్నాయి. ఈ సమయంలో అనూహ్యంగా సమీపంలోని లక్నో యూనివర్సిటీకి చెందిన కొందరు విద్యార్థులు ఎలాంటి ఆహ్వానం లేకపోయినా.. వేడుకకు వచ్చి విందును ఆరగించేందుకు రెడీ అయ్యారు. ఈ విషయాన్ని గుర్తించిన పెళ్లి కుమార్తె తరఫు బంధువులు.. వారిని ప్రశ్నించారు. ఎవరు పిలిచారని.. గద్దించారు. ఈ పరిణామంతో విద్యార్థులు తొలుత సైలెంట్‌గా తమ హాస్టల్‌కు వెళ్లిపోయారు.
కానీ, కొద్దిసేపటి తర్వాత.. తమ స్నేహితులను 100 మందిని తీసుకుని వివాహ వేడుక జరుగుతున్న ప్రాంతానికి వచ్చారు. ఇక, అక్కడకు చేరుకోగానే.. రచ్చ చేయడం ప్రారంభించారు. ఫుడ్ కౌంటర్ల(Food counters)ను పడగొట్టారు, కుర్చీలు విసిరేశారు. పలు వాహనాల అద్దాలను పగులగొట్టారు. అయితే.. విద్యార్థులను అడ్డుకునేందుకు కొందరు అతిథులు(Guest) ప్రయత్నించగా.. వారిని కూడా ఈడ్చి ఈడ్చి కొట్టారు. దీంతో వివాద వేడుక కాస్తా వివాదంగా మారిపోయింది. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. అంతేకాదు.. పెళ్లి ఊరేగింపులపై కూడా విద్యార్తులు రాళ్లు రువ్వడంతోపాటు ఎదురుగా వచ్చిన వారిని కొట్టారు. ఈ ఘటనపై పెండ్లి కుమారుడి తండ్రి స్పందిస్తూ.. తమపై విద్యార్థులు బాంబులు వేశారని పేర్కొన్నారు. ఈ అలజడితో తమ వేడక అంతా నాశనం అయిపోయిందన్నారు.
లాఠీ చార్జ్!
ఈ వివాదంపై సమాచారం అందుకున్న లక్నో సెంట్రల్ జోన్ పోలీసులు(Police) రంగంలోకి దిగి.. అలజడి సృష్టించిన విద్యార్థులపై లాఠీ చార్జీ చేశారు. విద్యార్థులను తరిమితరిమి కొట్టారు. కొంతమంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు.. విద్యార్థుల దాడిలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. విద్యార్థులు పిలవని పేరంటానికి వచ్చిన మాట వాస్తవమేనని.. అలజడి కూడా సృష్టించారని తెలిపారు. అయితే.. బాంబులు, తుపాకీ కాల్పులు వంటి ఘటన లకు పాల్పడలేదన్నారు. అరెస్టు చేసిన విద్యార్థులపై చట్టపరమైన చర్యలు చేపడతామన్నారు.
Also Read: సిగరెట్లు, కూల్‌డ్రింక్స్, బట్టల రేట్లు పెంపు! - కొత్త ఏడాదిలో పన్ను పోటు