JC vs Palle: ఉమ్మడి అనంతపురంలో జేసీX పల్లె- టీడీపీలో భగ్గుమన్న విభేదాలు
ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీలో విభేదాలు ఇంకా సమసిపోలేదు. లీడర్లు బయటకు రావడం లేదని నిత్యం విమర్శలు చేసే జేసీ ప్రభాకర్‌రెడ్డిపై పల్లె వర్గీయులు భగ్గుమంటున్నారు.
ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీలో మరోసారి విభేదాలు భగ్గుమంటున్నాయి. ఈ మధ్య కాలంలో జిల్లా టీడీపీ నేతలపై విమర్శలు చేస్తున్న జేసీ ప్రభాకర్‌రెడ్డిపై పల్లె రఘునాథ్ రెడ్డి వర్గీయులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ప్రభుత్వంపై పోరాడాల్సిన టైంలో ఇలా సొంత పార్టీ నేతలపైనే విమర్శలు చేసుకోవడం అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది.
సత్య సాయి జిల్లా కొత్తచెరువులో ఉద్రిక్తత నెలకొంది. జేసీ ప్రభాకర్ రెడ్డిపై సొంత పార్టీ నేతలే భగ్గుమంటున్నారు. ప్రభాకర్‌రెడ్డి పర్యటనను అడ్డుకునేందుకు వైరి వర్గీయులు సిద్ధమవుతున్నారు. ఇరు వర్గీయుల మధ్య ఎలాంటి ఉద్రిక్తత తలెత్తకుండా పోలీసులు భారీగా మోహరించారు.
ఉజ్వల్ ఫౌండేషన్‌లో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్న జేసీ ప్రభాకర్ రెడ్డి... కొత్త చెరువులో పర్యటిస్తున్నారు. అక్కడ జరిగే అక్రమాలను పరిశీలించనున్నారు. ఈ పర్యటన అడ్డుకునేందుకు పల్లె రఘునాథ్ రెడ్డి వర్గీయులు సిద్ధమయ్యారు. ఆయన్ని కొత్త చెరువులో అడుగుపెట్టనీయబోమంటున్నారు.
మొదటి నుంచి ఇక్కడ జేసీ, పల్లె వర్గీయుల మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయి. సమయం చిక్కినప్పుడుల్లా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉన్నారు. పలుమార్లు అధిష్ఠానం పిలిచి మాట్లాడినా విభేదాలు మాత్రం సమసిపోలేదు.
ఇవాళ(శుక్రవారం) కూడా ప్రెస్‌మీట్ పెట్టిన జేసీ ప్రభాకర్‌రెడ్డి... వైఎస్‌ఆర్‌సీపీతోపాటు సొంతపార్టీ నేతలపై విమర్శలు చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీ ఒకటే పడవలో పరుగెడుతున్నాయని ఎద్దేవా చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. రెండు పార్టీలకు కార్యకర్తలు లేరని విమర్శలు చేశారు. రెండు పార్టీలు కార్యకర్తను విస్మరించారన్నారు.
చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలకు టికెట్లు రావన్న జేసీ ప్రభాకర్‌రెడ్డి.... అది తెలిసే గడప గడపకువెళ్లి జగనన్నను దీవించండి అని అడుగుతున్నారని ఆరోపించారు. చంద్రబాబును ముసలోడన్న వైసీపీ లీడర్ల కామెంట్స్‌కి కూడా ఘాటైన కౌంటర్ ఇచ్చారు జేసీ ప్రభాకర్‌రెడ్డి. ముసలోడైన బసిరెడ్డి మేలు అనేది రాయలసీమలో సామెత అని గుర్తు చేశారు ప్రభాకర్‌రెడ్డి. అలాంటి కామెంట్స్ చేసిన వాళ్ల వయసు సంగతేంటని ప్రశ్నించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముసలోడైనా చంద్రబాబు నాయకత్వాన్నే కోరుకుంటున్నారని ఆభిప్రాయపడ్డారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ లీడర్లు మూడేళ్ల పాటు ఇంట్లో కూర్చున్నారని ఆరోపించారు జేసీ ప్రభాకర్‌రెడ్డి. తాను మాట్లడితే జిల్లాలోని 14 మంది టీడీపీ నాయకులు విమర్శలు చేశారన్నారు. వాళ్లకు తానే టార్గెట్ అన్న జేసీ ప్రభాకర్‌రెడ్డి... జగన్‌పై ఎవరూ విమర్శించే సాహసం చేయం విమర్శించారు. వీళ్లందరికీ జగన్ అంటే భయమన్న జేసీ... తామకే టికెట్లు కావాలంటూ మాట్లాడుతారన్నారు. తమను నాయకుల్ని చూసి టీడీపీ కార్యకర్తలు బయటకు రారన్న ప్రభాకర్‌రెడ్డి... చంద్రబాబును చూసే రావాలన్నారు. ఇన్నిరోజులు టిడిపి కార్యకర్తలు త్యాగం చేసి నాయకులను గద్దెనెక్కించారు... ఇప్పుడు నాయకులు త్యాగం చేయాలన్నారు. టిడిపి నాయకులు త్యాగం చేయడానికి సిద్దంగా ఉండండని పిలుపునిచ్చారు. ఆ త్యాగాలతో చంద్రబాబును సీఎంగా చేద్దామన్నారు.