Telangana MIM Plan : మజ్లిస్ కూడా దూరమైతే బీఆర్ఎస్‌కు గండమేనా ? అసదుద్దీన్‌ను కేసీఆర్ బుజ్జగిస్తారా ?
మజ్లిస్ కూడా దూరమైతే బీఆర్ఎస్‌కు మరిన్ని కష్టాలు తప్పవా ?యాభై స్థానాల్లో మజ్లిస్ పోటీ చేస్తే ఎవరికి లాస్ ?అసదుద్దీన్ తో మిత్రబంధం తెగిపోతుందా ?అసదుద్దీన్‌ను కేసీఆర్ బుజ్జగిస్తారా ?
![Telangana MIM Plan : మజ్లిస్ కూడా దూరమైతే బీఆర్ఎస్‌కు గండమేనా ? అసదుద్దీన్‌ను కేసీఆర్ బుజ్జగిస్తారా ? BRS will face more difficulties if Majlis also goes away? Telangana MIM Plan : మజ్లిస్ కూడా దూరమైతే బీఆర్ఎస్‌కు గండమేనా ? అసదుద్దీన్‌ను కేసీఆర్ బుజ్జగిస్తారా ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/28/679232738ae418f339ad9259f7e487b81687967979469228_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Telangana MIM Plan : తెలంగాణ రాజకీయాల్లో మజ్లిస్ పాత్ర చాలా కీలకం. ఆ పార్టీకి కనీసం ఏడు స్థానాలు గ్యారంటీగా వస్తాయి. అంతే కాదు ఆ పార్టీ తాను అనుకున్న పార్టీకి ఇతర నియోజకవర్గాల్లో ఓట్లు వేయించగలదు. కానీ ఇప్పుడు అసదుద్దీన్.. తమ బలం ఏంటో చూపిస్తామని అంటున్నారు. బీఆర్‌ఎస్, మజ్లిస్ పార్టీల మధ్య పొత్తులు లేదా స్నేహపూర్వక పోటీలు ఉండవని తేలిపోయింది. ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లి బడ్జెట్ సమావేశాల్లో ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ వచ్చే ఎన్నికల్లో కనీసం 15 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుని శాసనసభకు వస్తామని సవాల్ చేశారు. దానికి కొనసాగింపుగా అసదుద్దీన్ కూడా రాష్ట్రంలో ప్రత్యా మ్నాయ పార్టీగా మజ్లిస్‌ను తీర్చిదిద్దుతామని ప్రకటించారు.
అసదుద్దీన్ సహకరించకపోతే బీఆర్ఎస్‌కు ఇబ్బందే !
మజ్లిస్ పార్టీ పోటీ చేసిన నియోజకవర్గాలు తప్ప మిగతా సెగ్మెంట్లలో మజ్లిస్ ఓట్లతో పాటు ముస్లిం మైనారిటీల ఓట్లు కూడా బీఆర్‌ఎస్‌కే పడేవి. మారిన రాజకీయ పరిస్థితుల్లో మజ్లిస్ దూరం కావడం ద్వారా బీఆర్‌ఎస్‌కు పెద్ద దెబ్బగా రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. రాజకీయాల్లో వన్ ప్లస్ వన్ ఎప్పుడూ రెండు కాకపోవచ్చు. ఒక్కో సారి ఇరవై అవుతుంది.. ఇంకో సారి జీవో కావొచ్చు. మనది మెజార్టీ ప్రజాస్వామ్యం. ఒక్క ఓటుతో గెలిచిన వారు ఉన్నారు. ఆ ఒక్క ఓటు ఎన్ని వేల ఓట్లతో సమానమో చెప్పాల్సిన పని లేదు. ఇటీవల మునుగోడు ఉపఎన్నికల్లో కమ్యూనిస్టులు బహిరంగ మద్దతు ప్రకటించారు. ప్రతీ సారి వారికి ఎన్ని ఓట్లు వస్తాయో ఆ తేడాతోనే బీఆర్ఎస్ గెలిచింది. అక్కడే రాజకీయ పార్టీల మధ్య పొత్తులు లేదా అవగాహనలు ఎంత కీలక పాత్ర పోషిస్తాయో చెప్పాల్సిన పని లేదు.
ఎన్నికల రాజకీయాల్లో పరస్పర సహకారంతో బీఆర్ఎస్, మజ్లిస్
తెలంగాణ రాజకీయాల్లో అటు బీఆర్ఎస్, ఇటు మజ్లిస్ పొత్తులు పెట్టుకోవు. కానీ రెండు పార్టీలు పరస్పరం సహకరించుకుంటాయి. అధికారికంగా పొత్తు పెట్టుకోరు తప్ప.. అన్నివిధాలుగా సహకరించుకుంటారు. గత ఎన్నికల్లో కేసీఆర్ కు మజ్లిస్ పరోక్ష సహకారం ఎంతో లబించింది. ఎనిమిది చోట్ల తప్ప మజ్లిస్ ఇతర చోట్ల పోటీ చేయలేదు. అన్ని చోట్లా బీఆర్ఎస్‌కు మద్దతు ఇవ్వాలని పరోక్షంగా తమ వర్గానికి సంకేతాలు పంపింది. దీంతో ముస్లిం వర్గం ఎక్కువ ఉన్న చోట్ల బీఆర్ఎస్ విజయం సులువు అయింది. అయితే ఇటీవలి కాలంలో తమ పార్టీని విస్తరించాలనుకుంటున్న మజ్లిస్... మరికొన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధయింది. రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్,బోధన్, నిజామాబాద్ లాంటి చోట్ల అభ్యర్థుల్ని నిలబెట్టాలని నిర్ణయించుకుంది. యాభై చోట్ల పోటీ చేస్తే బీఆర్ఎస్‌కు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి.
మజ్లిస్ బలపడే అవకాశం వస్తే కేసీఆర్‌ను ఓవైసీ లెక్క చేయరు !
మజ్లిస్ పార్టీని జాతీయ స్థాయిలో విస్తరించడానికి అసదుద్దీన్ ఓవైసీ ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఆయన పోటీ చేస్తున్నారు. ఓట్ల శాతాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలోనూ ఆయన పట్టు పెంచుకోవాలని చూడకుండా ఉండరు. రాజకీయాల్లో ఎవరికైనా అంతిమ లక్ష్యం తాము బలపడటమే. పరస్పర ప్రయోజనాలు ఉన్నప్పుడే.. సహకారం తీసుకుంటారు. ఒక పార్టీకే ప్రయోజనం కల్పించే సహకారాలు రాజకీయాల్లో నిలబడవు. అందుకే పరస్పర ప్రయోజనం ఉంటేనే మజ్లిస్ సహకారానికి ఒప్పుకుంటుంది. బీఆర్ఎస్ సహకారం ఉన్నా లేకున్నా.. మజ్లిస్ సులువుగా ఏడు చోట్ల విజయం సాధించే అవకాశం ఉంది. అంతకు మించిన ప్రయోజనం ఉంటే తప్ప సహకారం ఇవ్వరు. మరి మజ్లిస్ కు మరో నాలుగైదు సీట్లలో అయినా గెలుపొందేందుకు బీఆర్ఎస్ సహకరిస్తుందా అన్నది ఇక్కడ కీలకం. అలాంటి చాన్స్ ఉండకపోవచ్చని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.
అసదుద్దీన్ తాను త్యాగం చేయడానికి ఎప్పుడూ ముందుకురారు. తన అవసరం ఉందని ఇతర పార్టీలు అనుకుంటే... గరిష్టంగా ప్రయోజనం పొందే ప్రయత్నం చేస్తారు. అందుకే.. ఇప్పుడు అసద్ ప్రకటనతో ముందు ముందు బీఆర్ఎస్‌కు క్లిష్ట పరిస్థితులు ఏర్పడవచ్చని చెబుతున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)