Balineni YSRCP : వైఎస్ఆర్‌సీపీలో బాలినేని అసంతృప్తిగా ఉన్నారా ? హైదరాబాద్‌లో అనుచరులతో సమావేశం !
వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్‌పై బాలినేని శ్రీనివాసరెడ్డి అసంతృప్తిగా ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. రాజకీయంగా ప్రాధాన్యత తగ్గిపోవడంతో తదుపరి వ్యూహంపై అనుచరులతో మంతనాలు జరుపుతున్నారు.
Balineni YSRCP : వైఎస్ఆర్‌సీపీ కీలక నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సొంత పార్టీపై అసంతృప్తితో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మంత్రి పదవి నుంచి తప్పించిన సమయంలో ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మూడు రోజుల పాటు ఆయనను సజ్జల రామకృష్ణారెడ్డి బుజ్జగించారు. అప్పుడే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తారన్న ప్రచారం జరిగింది. కానీ సీఎం జగన్‌తో భేటీ తర్వాత బాలినేని మనసు మార్చుకున్నారు. పార్టీ బాధ్యతలు తీసుకున్నారు. అయితే ఇటీవల మళ్లీ పలు రకాలుగా అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఆయన హైదరాబాద్‌లో అనుచరులతో సమావేశం కావడం ఒంగోలు రాజకీయాల్లో కాక రేపుతోంది.
మంత్రి పదవి నుంచి తప్పించడంతో అసంతృప్తిగా బాలినేని
బాలినేని శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి, వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమీప బంధువు. అయితే ఆయన తల్లి తరపు బంధువు. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి సమీప బంధువే. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి మధ్య సఖ్యత లేదు. రాజకీయంగా ఆధిపత్య పోరాటం ఉంటుంది. సీఎం జగన్ తన మంత్రి పదవిని తొలగించడమే కాకుండా వైవీ సుబ్బారెడ్డి మాటలకే ప్రాధాన్యం ఇస్తున్నారన్న అసంతృప్తిలో ఆయన ఉన్నారన్న ప్రచారం ఉంది. కొంత కాలం పాటు గడప గడుప మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చురుకుగా నిర్వహించిన ఆయన ఇప్పుడు పెద్దగా పట్టించుకోవడం లేదు.
ప్రకాశం జిల్లా రాజకీయాల్లో వైవీ సుబ్బారెడ్డి డామినేషన్
కొద్ది రోజులుగా ఆయన పవన్ కల్యాణ్ విషయంలో సాఫ్ట్ గా వ్యవహరిస్తున్నారు. తనపై పవన్ పార్టీ సానభూతిపరులకు చెందిన ఓ టీవీ చానల్‌లో వచ్చిన కథనాల విషయంలో.. పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని పవన్ కల్యాణ్ స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. వెంటనే బాలినేని కేసులను ఉపసంహరించుకున్నారు. తర్వాత వారి మధ్య బాండింగ్ కనిపిస్తోంది. చేనేత దినోత్సవం సందర్భంగా... చేనేత వస్త్రాలు ధరించాని పవన్ చాలెంజ్ చేస్తే బాలినేని ధరించి మరీ ఫోటో పెట్టి చూపించారు.
Twitter వేదికగా చేనేత దినోత్సవం సందర్బంగా చేనేత దుస్తులు ధరించి ఫొటోలు దిగాలంటూ పవన్‌కళ్యాణ్ గారు చేసిన చేనేత సవాల్ ను స్వీకరించాను ధన్యవాదాలు 🙏🏽
— Balineni Srinivasa Reddy (@balineni_vasu) August 7, 2022
నేను చిత్తశుద్ధితో చేనేతమంత్రిగా YSR గారి ప్రభుత్వంలో పని చేశాను.ఆ నాడు YSR గారు 300కోట్ల రూపాయల చేనేతల కోసం రుణమాఫీ చేశారు.
(1/2) https://t.co/mJ2mEPOqG1 pic.twitter.com/Ll6IwrA2M8
ఇటీవల పవన్‌కల్యాణ్‌తో సన్నిహితంగా మెలుగుతున్న బాలినేని
అయితే అంత మాత్రాన ఆయన జనసేనలోకి వెళ్తారని అనుకోవడంలేదు. కానీ వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్‌పై ఒత్తిడి పెంచేందుకు ఆయన ఈ వ్యూహం అవలంభిస్తున్నారని ఆ పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. వైఎస్ఆర్‌సీపీ ప్రాధాన్యత కోసం ఆయన ఇలా చేస్తున్నారన్న వాదన వినిపిస్దోంది. అయితే ఈ అంశంపై బాలినేని ఇంకా ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు.