Prathipati Pulla Rao: 151 సీట్లు ఇస్తే రాష్ట్రాన్ని ఏం చేశారు? సీఎం జగన్‌కు ప్రత్తిపాటి సూటి ప్రశ్న
Prathipati Pulla Rao: ఓటమి ఖాయమయ్యే సీఎం జగన్ మతిమరిచి మాట్లాడుతున్నారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రత్తిపాటి పుల్లారావు ధ్వజమెత్తారు.
Prathipati Pulla Rao: ఓటమి ఖాయమయ్యే సీఎం జగన్ మతిమరిచి మాట్లాడుతున్నారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు ధ్వజమెత్తారు. సీఎం జగన్ 52 నెలల పాలనలో రాష్ట్రంలో ఏ ఇల్లు సంతోషంగా ఉందో, ఏ ఊరు ప్రశాంతంగా ఉందో కనీసం సమాధానం చెప్పగలరా అని ఆయన ప్రశ్నించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు నమ్మి 151 సీట్లు ఇస్తే రాష్ట్రాన్ని నడిబజారు పాల్జేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇదే జగన్ చెబుతున్న పేదలకు - పెత్తందార్లకు మధ్య యుద్ధం అంటే ఏమిటో కూడా ప్రజలందరికీ తెలిసి వచ్చిందన్నారు. ఒకవైపు రాష్ట్రంలో పేదల రక్తమాంసాలు దోచుకుతింటున్న వ్యక్తికి మరొకవైపు ఆ పేదల గురించి మాట్లాడే కనీసం నైతిక హక్కు ఉందా అని ఆయన ఎద్దేవా చేశారు.
ఫిబ్రవరిలో వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోతో ప్రజల ముందుకు వెళ్తామని అంటున్న జగన్ కనీసం అప్పటికైనా గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలుపై సమాధానం చెప్పాలని ప్రత్తిపాటి డిమాండ్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి నెల గడుస్తున్నా కనీసం కోర్టుల్లో కనీసం ఒక్క ఆధారం చూపించలేకపోతున్న జగన్ సర్కారుపై రానున్న రోజుల్లో తిరుగుబాటు మరింత ఉద్ధృతం కావడం ఖాయమన్నారు. పాలనా దక్షకుడు, మచ్చలేని రాజకీయ యోధుడు చంద్రబాబును దొంగ కేసులతో జైల్లో పెట్టింది కాక ఆయనేమైనా విప్లవకారుడా అంటున్న వైసీపీ బ్యాచ్ త్వరలో పలాయనం చిత్తగించడం తప్పదని ప్రత్తిపాటి జోస్యం చెప్పారు.
జగన్ వాస్తవాలు తెలుసుకోవాలి
జగన్ ఇప్పటికైనా వైనాట్ 175 వంటి భ్రమల నుంచి వాస్తవాలు తెలుసుకోవాలని ప్రతిపాటి హితవు పలికారు. తమ అధినేత చంద్రబాబు బయటకు వస్తే వైసీపీ నేతలకు అసలైన సినిమా ఉంటుందన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ చిలకలూరిపేటలో ప్రత్తిపాటి ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు చేపడుతున్న దీక్షలు, నిరసనలు 27వ రోజు కొనసాగాయి. సోమవారం ముస్లిం మహిళలు, పార్టీ నాయకులతో కలిసి ప్రత్తిపాటి దీక్షలో కూర్చున్నారు. నియోజకవర్గం జనసేన నాయకులు, కార్యకర్తలు దీక్షా శిబిరంలో పాల్గొని సంఘీభావం తెలిపారు. సాయంత్రం దీక్ష ముగింపు సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడారు. అవినీతి పునాదులపై పుట్టిన వైసీపీ కొవ్వొత్తి లాంటిది అయితే తెలుగువాడి ఆత్మగౌరవంతో పుట్టిన టీడీపీ అఖండ జ్యోతి లాంటిదని నిత్యం వెలుగుతూనే ఉంటుందన్నారు. వ్యవస్థలన్నీ జగన్ వైపు ఉంటే ఐదు కోట్ల ఆంధ్రులు చంద్రబాబు వైపు ఉన్నారన్నారు.
టీడీపీ, జనసేన పొత్తుతో వైసీపీ నేతల్లో గుబులు
టీడీపీ, జనసేన పొత్తుతో వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని ప్రత్తిపాటి అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నాయకుల ఆటకట్టిస్తామని స్పష్టం చేశారు. టీడీపీ శ్రేణులు నూతనోత్సాహంతో పనిచేస్తూ, వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయానికి కృషి చేయాలని ప్రత్తిపాటి పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమన్నారు. జనసేన గుంటూరు జిల్లా కార్యదర్శి తోట రజారమేష్, తెలుగుదేశం పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి పటాన్ సమద్ ఖాన్, గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి షేక్ సుభాని, టీడీపీ, జనసేన నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.