Warangal TRS : ఉమ్మడి వరంగల్ టీఆర్ఎస్ నేతల ఆధిపత్య పోరాటం - అయోమయంలో క్యాడర్ !
ఉమ్మడి వరంగల్ జిల్లా టీఆర్ఎస్ ముఖ్య నేతల మధ్య అధిపత్య పోరాటం జరుగుతోంది. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలను కూడా ఎవరికి వారే చేపడుతున్నారు.
ఉమ్మడి వరంగల్ టీఆర్ఎస్ నేతలందరూ ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉన్నారు. సొంత రాజకీయాలు చేసుకుంటున్నారు కానీ పార్టీని పట్టించుకోవడం లేదు. రైతు నిరసన దీక్షల్లో నేతల మధ్య అధిపత్యపోరు బహిర్గతమైంది. కేటీఆర్ వరంగల్ పర్యటనకు వస్తూండటంతో ఎవరికి వారు బలప్రదర్శనకు సిద్ధమయ్యారు. దీంతో కేటీఆర్ టూర్ సక్సెస్ అవుతుందా లేకపోతే గందరగోళంగా మారుతుందా అని ఆ పార్టీ నేతలు టెన్షన్‌కు గు రవుతున్నారు.
పార్టీ కార్యక్రమాలు ఎవరికి వారే చేస్తున్న వరంగల్ నేతలు !
టీఆర్ ఎస్ పార్టీ చేపడుతున్న కార్యక్రమాల్లో నేతల మద్య చెలరేగిన వర్గవిభేదాలు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్నాయి. వరి ధాన్యం కొనుగోలు అంశంపై తెలంగాణ ముఖ్మమంత్రి కేసిఆర్ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలోని నేతలు రైతు నిరసన దీక్షలు చేపట్టారు. రైతుల భాగస్వామ్యంతో ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని ప్రజాప్రతినిధులందరికీ అదేశాలు జారీ చేశాయగా స్థానిక నేతలే మాత్రం సమన్వయం లేకుండా కార్యక్రమాలను ఎవరికి వారే అన్ని తీరులో నిర్వ హించారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో నిర్వహించిన రైతు దీక్ష నిరసన సభలో ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు సహకరించక పోగా మహబూబాబాద్ నిర్వహించిన సభలో ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎంపి కవితల మద్య వార్ మరోసారి బహిర్గతమైంది. కవిత చేతిలో మైక్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ లాగేసుకోవడం వివాదాస్పదమయింది.
మంత్రి ఎర్రబెల్లికి దూరంగా ఎమ్మెల్యే నన్నపనేని !
వరంగల్ జిల్లాలోని ఓ సిటీ గ్రౌండ్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి నిరసన సభకు మంత్రి దయాకర్ రావు ,ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, పెద్ది సుదర్శన్ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి హజరయ్యారు.. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఈ నిరసన సభకు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ దూరంగా ఉండిపోయారు . మంత్రి దయాకర్ రావుతో ఉన్న విభేదాలతో ఎమ్మెల్యే నరేందర్ వేదిక మీదికి రాలేదు. దయాకర్ రావు సోదరుడు ప్రదీప్ రావు తూర్పు నియోజకవర్గంపై దృష్టి సారిస్తుండటమే విభేదాలకు కారణమని కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు.. ఆ క్రమంలో ఎమ్మెల్యే అనుచర వర్గం సైతం మంత్రి మాట్లాడినంత సేపు దూరంగా ఉన్నారు . మంత్రి దయాకర్ రావు సభ నుండి వెళ్ళిన కొద్ది సేపటికే నరేందర్ ఆయన అనుచర వర్గంతో అట్టహాసంగా సభకు చేరుకోవడం చర్చకు దారితీసింది. ఇప్పటికే మాజీ రాజ్యసభ సభ్యురాలు, ప్రస్తుత వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయి... దీంతో ఎవరికి వారే రాజకీయాలు చేస్తున్నారు. ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటూ అధికార పార్టీకి సమస్యలు తెచ్చిపెడుతున్నారు . ఎమ్మెల్యే అనుచరులైన కార్పొరేటర్లకు మేయర్ పనులు ఇవ్వడం లేదని బహిరంగంగా ఆరోపిస్తోంది నరేందర్ వర్గం. అంతే కాదు వారి ప్రాంతాల్లో ప్రారంభోత్సవాలు ఉన్నా సమాచారం ఇవ్వడం లేదనే చర్చ సాగుతోంది.
మహబూబాబాద్‌లోనూ అదే రచ్చ !
మరోవైపు మహబూబాబాద్ లో ఆ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షురాలు, ఎంపీ మాలోతు కవితకు, ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు మధ్య అధిపత్యపోరు నిరసన సభ వేదికపైనే బయటపడింది. జిల్లా కేంద్రం లో జరుగుతున్న రైతుల నిరసన సభకు అధ్యక్షత వహించడం కోసం ఎమ్మెల్యే శంకర్ నాయక్ , కవిత చేతుల నుంచి మైక్ లాక్కున్నారు . తన నియోజకవర్గంలో జరుగుతున్న సభకు తానే అధ్యక్షత వహిస్తానని తేల్చి చెప్పారు. మంత్రి సత్యవతిరాథోడ్ మాట్లాడేప్పుడు ఎంపీ కవిత పేరు ప్రస్తావించాలని ఎమ్మెల్యే రెడ్యానాయక్ సూచించడంతో ఆమె ఎటకారంగా అందరూ సూచిస్తున్నారు కాబట్టి చెబుతున్నా అంటూ కవిత పేరు ఉచ్చరించారు . ఇలా వర్గ విభేదాలు నిరసన వేదిక సాక్షిగా బహిర్గతం అవుతుండటం చర్చనీయాంశంగా మారుతోంది.
కేటీఆర్ టూర్‌తో టీఆర్ఎస్ టెన్షన్ !
టీఆర్ఎస్ నేత మద్య రాజకీయాలు బగ్గుమంటున్న ఈ సందర్బంలోనే మంత్రి కేటీఆర్ జిల్లాలో పర్యటన చేపట్టారు. ఏప్రెల్ 20 ఈ బుధవారం వరంగల్, హనుమకొండ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాన చేపట్టనున్నారు. అనంతరం హనుమకొండలోని హయగ్రీవాచారి గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఈ సభ కార్యక్రమానికి దాదాపుగా 25 వేల మంది కార్యకర్తలను తరలించాలని పార్టీ అధిష్టానం నుంచి ప్రజాప్రతినిధులకు ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో సభ కార్యక్రమాల నిర్వహణ, జన సమీకరణ పనిలో టీఆర్ ఎస్ నేతలు నిమగ్నమయ్యారు. అయితే నేతల మధ్య వర్గపోరు నెలకొనడంతో పార్టీ కార్యక్రమాలకు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ దూరంగా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాలను ప్రకటించేందుకు నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యనేతలందరూ పాల్గొనగా ఎమ్మెల్యే నన్నపనేని మాత్రం హాజరుకాలేదు. సభకు సంబంధించిన ఏర్పాట్లలో కూడా చురుకుగా పాల్గొనకపోవడంపై నన్నపనేని అందరూ కలిసి దూరం పెడుతున్నారనే వాధనలు వినిపిస్తున్నాయి.