Israel-Hamas War: ఇంతకింత చెల్లిస్తాం- హమాస్‌కు ఇజ్రాయిల్ ప్రధాని హెచ్చరిక
Israel-Hamas War: తాము యుద్ధాన్ని ప్రారంభించలేదని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు అన్నారు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య భీకర యుద్ధం సాగుతున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
Israel-Hamas War: తాము యుద్ధాన్ని ప్రారంభించలేదని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు అన్నారు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య భీకర యుద్ధం సాగుతున్న నేపథ్యంలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. తమ దేశం యుద్ధాన్ని ప్రారంభించలేదని, కానీ పూర్తి చేసేది మాత్రం తామేనని అన్నారు. తాము ఈ యుద్ధాన్ని కోరుకోలేదని చెప్పిన బెంజిమన్, ఇది అత్యంత క్రూరమైన చర్యగా అభివర్ణించారు. బలవంతంగా, క్రూరమైన రీతిలో తమ దేశంపై యుద్ధం ప్రయోగించబడిందన్నారు.
ఇజ్రాయెల్‌పై దాడి చేయడం ద్వారా హమాస్ చారిత్రక తప్పిదం చేసిందని, ఈ విషయాన్ని వారికి అర్థం అయ్యేలా చేస్తామని నెతన్యాహు తీవ్రంగా హెచ్చరించారు. ఒకప్పుడు, యూదు ప్రజలు దేశం లేని వారని, ప్రజల ప్రాణాలకు రక్షణ లేదన్నారు. దీనికి తగిన మూల్యం హమాస్ చెల్లించేలా చేస్తామన్నారు. హమాస్, ఇతర శత్రు దేశాలు రాబోయే దశాబ్దాల పాటు జ్ఞాపకం ఉంచుకునేలా ఇజ్రాయెల్ గుణపాఠాన్ని చెబుతుందన్నారు. అమాయక ఇజ్రాయెల్ ప్రజలపై హమాస్ జరిపిన క్రూరమైన దాడులు మనసును కలవరపెడుతున్నాయని ఇజ్రాయెల్ ప్రధాని అన్నారు. ఇళ్లలో కుటుంబాలను వధించారరని, ఆరుబయట వందలాది మంది యువకులను ఊచకోత కోశారని, అనేక మంది స్త్రీలు, పిల్లలు, వృద్ధులను, కిడ్నాప్ చేసి కాల్చివేశారని, ఉరితీశారని ఆవేదన వ్యక్తం చేశారు.
హమాస్, ISIS ఒక్కటేనని నెతన్యాహు అన్నారు. ISISని ఓడించడానికి దేశాలన్నీ ఐక్యమైనట్లే, హమాస్‌ను ఓడించడానికి మరోసారి ఏకం కావాలసిన అవసరం ఉందన్నారు. మిత్రదేశాలు ఇజ్రాయెల్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు. అలాగే యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇజ్రాయెల్‌కు మద్దతు తెలిపిన దేశాలకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు బిడెన్ ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలిచారని, ఆయనకు కృతజ్ఞతలు చెప్పారు. ఇజ్రాయెల్‌కు అండగా నిలబడి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ప్రజలు, కాంగ్రెస్‌కు నేను కృతజ్ఞతలు చెప్పారు. హమాస్‌తో ఇజ్రాయెల్ పోరాడుతున్నది కేవలం తన ప్రజల కోసమే కాదని, అనాగరికతకు వ్యతిరేకంగా నిలబడే ప్రతి దేశం కోసం అని ఆయన నొక్కి చెప్పారు. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ గెలుస్తుందని, ఇజ్రాయెల్ గెలిచినప్పుడు, మొత్తం నాగరిక ప్రపంచం గెలుస్తుందన్నారు.
గాజా స్ట్రిప్‌ను పరిపాలిస్తున్న హమాస్ ఉగ్రవాదులు శనివారం ఉదయం వేల రాకెట్లను ఇజ్రాయెల్‌పై ప్రయోగించారు. అంతేకాకుండా సరిహద్దులు దాటి ఇజ్రాయెల్‌లోకి చొరబడి వందల మందిని కిడ్నాప్ చేశారు. ఆటవికంగా, అత్యంత కిరాతకంగా హత్యలు చేస్తున్నారు. 1948 ఇజ్రాయెల్ స్వాతంత్ర్య సమరాన్ని గుర్తుకు తెచ్చే విధంగా ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధం ప్రారంభమైంది. ఈ హింసాకాండలో ఇజ్రాయెల్, హమాస్ రెండు వైపుల నుంచి 1600 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గాయపడ్డారు. పౌరుల ప్రాణాలను రక్షించేందుకు హింస, దాడులకు ముగింపు పలకాలని ఇజ్రాయెల్ అంతర్జాతీయ మద్దతు కోరుతోంది.
ఇజ్రాయెల్‌కు అండగా ఉంటాం : అమెరికా
అగ్రరాజ్యం అమెరికా ఇజ్రాయెల్‌కు మద్దతునిస్తోంది. తాము అన్ని విధాలుగా ఇజ్రాయెల్‌కు మద్దతుగా ఉంటామని ఇప్పటికే అమెరికా ప్రకటించింది. ఇజ్రాయెల్‌పై జరిగిన దాడిలో అమెరికన్ పౌరులు కూడా మరణించినట్లు ఆదివారం యూఎస్ వెల్లడించారు. దాడుల్లో మరణించిన, కనిపించకుండా పోయిన అమెరికన్ పౌరుల జాబితాను ధృవీకరించడానికి ప్రయత్నిస్తున్నామని యూఎస్ విదేశాంగ శాఖ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ తెలిపారు. ఇజ్రాయెల్‌కు యుద్ధంలో సాయం అందించేందుకు అమెరికా నుంచి యుద్ధనౌకలను, యుద్ధవిమానాలను పంపించాలని అధ్యక్షుడు జో బైడెన్ ఆదివారం అధికారులను ఆదేశించారు. తమ మిత్రదేశమైన ఇజ్రాయెల్‌కు వాషింగ్టన్ నుంచి అచంచలమైన మద్దతు ఉంటుందని ఆయన స్పష్టంచేశారు.