Wagner Chief Death: వాగ్నర్ చీఫ్ మరణంపై ఆశ్యర్యం ఏం లేదు - బైడెన్, అది ఆలస్యమైందన్న మస్క్
Wagner Chief Death: వాగ్నర్ చీఫ్ మరణంపై ఆశ్యర్యపోలేదన్న బైడెన్.. ఆలస్యమైందన్న మస్క్
Wagner Chief Death: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై గతంలో తిరుగుబాటు చేసిన వాగ్నర్ గ్రూప్ చీఫ్ యెవ్‌గెనీ ప్రిగోజిన్ విమాన ప్రమాదంలో మరణించినట్లు రష్యా వెల్లడించింది. ఆయన ప్రయాణిస్తున్న విమానం అకస్మాత్తుగా కూలిపోవడం వల్ల ప్రిగోజిన్‌తో పాటు మరో పది మంది వరకు మృతిచెందారు. అయితే ఈ ప్రమాదంపై అమెరికా అధ్యక్షుడు బైడెన్, టెస్లా, ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ స్పందించారు. అయితే ఇప్పటికే ప్రిగోజిన్ మరణంపై ప్రపంచవ్యాప్తంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఇప్పుడు బైడెన్, మస్క్‌ల స్పందన కూడా అదే విధంగా ఉంది.
ఈ ప్రమాదంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మీడియాతో మాట్లాడుతూ తాను పెద్దగా ఆశ్చర్యపోలేదని అని అన్నారు. వాస్తవంగా అక్కడ ఏం జరిగిందో ఆ విషయాలు తనకు తెలియవని, కాకపోతే ఈ ఘటన తననేమీ ఆశ్చర్యానికి గురిచేయలేదని వెల్లడించారు. రష్యాలో పుతిన్ ఉండగా ఇలాంటివి జరగకుండా ఎలా ఉంటాయని అర్థం వచ్చేలా బైడెన్ మాట్లాడారు.
టెస్లా సీఈఓ అయిన ఎలాన్ మస్క్ కూడా ప్రిగోజిన్ మృతిపై ఇదే విధంగా స్పందించారు. ఓ ఎక్స్ యూజర్ మరీ ఎక్కువ సమయం పట్టలేదని ట్వీట్ చేయగా, తాను అనుకున్న దాని కంటే ఆలస్యమైందని పేర్కొన్నారు. ఇదో సైకలాజికల్ ఆపరేషన్ అయ్యే అవకాశాలు కూడా కొద్దిగా ఉన్నాయని మస్క్ చెప్పుకొచ్చారు.
ప్రిగోజిన్ ప్రైవేట్ జెట్ విమానం మాస్కో నుంచి సెయింట్‌పీటర్స్ బర్గ్ వెళ్తుండగా కూలిపోయిందని, అందులో ప్రైవేట్ సైన్యం వాగ్నర్ అధినేత యెవ్‌గెనీ ప్రిగోజిన్ ప్రయాణిస్తుండా ప్రమాదం చోటుచేసుకుందని పలు మీడియా సంస్థలు రిపోర్ట్ చేశాయి. విమానంలో పది మంది ఉండగా, అందులో ముగ్గురు సిబ్బంది ఉన్నారని, దురదృష్టవశాత్తు విమానంలోని వారంతా చనిపోయారని రష్యా ఎమర్జెన్సీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
రష్యా సైన్యం గత రెండేళ్ల నుంచి ఉక్రెయిన్‌పై దాడులు చేస్తున్న సంగతి తెలిసింది. ఉక్రెయిన్‌పై రష్యా చేపడుతున్న ఈ సైనిక చర్యలో రష్యా ఆర్మీకి ప్రైవేట్ సైన్యం వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్ మద్దతిచ్చారు. అయితే ఈ ఏడాది జూన్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై ప్రిగోజిన్ తిరుగుబాటు చేశారు. ప్రభుత్వం చర్యలను తీవ్రంగా ఖండించారు. పుతిన్‌ను రష్యా అధ్యక్ష పీఠం నుంచి తప్పించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. దీంతో రష్యాకు ఎదురుదెబ్బ తగిలినట్లైంది. కానీ తర్వాత ప్రిగోజిన్ తాను తిరుగుబాటు చేయడం లేదని, కేవలం న్యాయ పోరాటం మాత్రమే చేస్తున్నానని వెనక్కి తగ్గారు. దేశంలో అంతర్గత రక్తపాతాన్ని తాను కోరుకోవడం లేదని ప్రిగోజిన్ వెల్లడించి తన బలగాలను వెనక్కి తీసుకున్నారు. బెలారస్ అధ్యక్షుడు లుకషెంకో జోక్యం చేసుకుని సర్ది చెప్పడంతో ప్రిగోజిన్ బలగాలు వెనక్కి తగ్గాయి.
వాగ్నర్ గ్రూప్ తమపై తిరుగుబాటు చేయడంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ అప్పట్లో తీవ్రంగా స్పందించారు. ప్రిగోజిన్ వెన్నుపోటు పొడిచారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికే రష్యా మిలిటరీ వాగ్నర్ గ్రూప్‌పై ఉగ్రవాద ముద్ర వేసింది. తమపై తిరగుబాటు ఆపితేనే వాగ్నర్ సైనికుల రక్షణకు హామీ ఇస్తామని రష్యా అప్పుడు వెల్లడించింది. కానీ వెనక్కి తగ్గని ప్రిగోజిన్ రోస్తోవ్‌లోని రష్యా మిలిటరీ హెడ్‌క్వార్టర్స్‌ను అధీనంలోకి తీసుకున్నారు. తర్వాత జరిగిన చర్చలతో ఆయన శాంతించారు.