Monkey B Virus: చైనాలో మరో కొత్త వైరస్.. పేరు మంకీ బీ.. మరణాల రేటు ఎక్కువే..
కరోనా మహమ్మారితో ప్రపంచమంతా అల్లాడుతున్న వేళ చైనాలో 'మంకీ బీ' అనే మరో ప్రమాదకర వైరస్ వెలుగు చూసింది. ఈ వైరస్ వల్ల తమ దేశంలో ఓ వ్యక్తి మరణించాడని చైనా అధికారిక వార్తా సంస్థ గ్లోబల్ టైమ్స్ తెలిపింది.
కరోనా మహమ్మారితో ప్రపంచమంతా అల్లాడుతున్న వేళ చైనాలో మంకీ బీ (Monkey B virus) అనే మరో ప్రమాదకర వైరస్ వెలుగు చూసింది. ఈ వైరస్ వల్ల తమ దేశంలో ఓ వ్యక్తి మరణించాడని చైనా అధికారిక వార్తా సంస్థ గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. బీజింగ్‌కు చెందిన పశు వైద్యుడు (53) మంకీ బీ వైరస్ సోకి మరణించాడని తెలిపింది.
ఈయన జంతువులపై పరిశోధనలు చేస్తుంటారని చెప్పింది. తన పరిశోధనల్లో భాగంగా రెండు చనిపోయిన కోతుల శరీరాలను పరీక్షించారని వివరించింది. అనంతరం అనారోగ్యం బారిన పడ్డారని.. వాంతి, వికారం వంటి లక్షణాలతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ మరణించాడని పేర్కొంది. మరణించిన అనంతరం అతని నమూనాలను వైద్య పరీక్షలకు పంపగా.. మంకీ బీ వైరస్ పాజిటివ్ అని నిర్ధారణ అయిందని వైద్యులు తెలిపారు. చైనాలో మునుపెన్నడూ ఈ వైరస్ సోకిన దాఖలాలు లేవని.. ఇదే మొదటి కేసు అని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది.
ఎప్పుడు గుర్తించారు..
1932లో మొట్టమొదటి సారిగా ఈ వైరస్‌ను గుర్తించారు. దీనినే హెర్పస్ బీ వైరస్ (BV) అని కూడా పిలుస్తారు. ఇది చాలా అరుదైన ఇన్‌ఫెక్షన్. మకాక్ జాతి కోతులు, చింపాజీలు (chimpanzees ), కాపుచిన్ కోతులు (capuchin monkeys) ద్వారా ఇది వ్యాపిస్తుంది.
ఎలా వ్యాపిస్తుంది?
ఈ వ్యాధి సోకిన కోతుల విసర్జితాల (లాలాజలం, మల, మూత్రాలు) ద్వారా ఇది వ్యాపిస్తుంది. అలాగే వ్యాధితో బాధపడుతున్న కోతి కరిచినా లేదా మనం దానిని నేరుగా తాకినా కూడా ఇది సోకుతుంది. కోతులు తాకిన వస్తువులు, ప్రదేశాల ఉపరితలంపై ఈ వైరస్ కొన్ని గంటలపాటు జీవించి ఉంటుంది. వీటిని తాకినా కూడా మంకీ బీ వైరస్ వస్తుంది.
లక్షణాలు ఇవే..
మంకీ బీ వైరస్ సోకిన వారిలో జ్వరం, విపరీతమైన చలి, తలనొప్పి, అలసట, శరీరం మరియు కండరాల నొప్పులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో పాటు న్యూరోలాజికల్ లక్షణాలు (Neurological symptoms) ఉంటాయని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. వైరస్ సోకిన నెలలోపు ఎప్పుడైనా ఈ లక్షణాలు కనిపించవచ్చని చెప్పింది. ఒక్కోసారి మూడు నుంచి ఏడు రోజుల్లోపు కూడా లక్షణాలు కనిపిస్తాయని పేర్కొంది.
మరణాల రేటు ఎక్కువే..
సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) ప్రకారం.. 1932 నుంచి ఇప్పటివరకు ఈ వైరస్ 50 మందికి సోకగా, 21 మంది మరణించారు. అయితే ఈ వైరస్ మనుషులకు వ్యాపించడం చాలా అరుదని.. ఒకవేళ మనుషులకు సోకితే అది నాడీ వ్యవస్థ, మెదడు, వెన్నుపూసలపై ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ వైరస్ సోకిన వారిలో మరణాల రేటు 70 నుంచి 80 శాతం వరకు ఉంటుందని పేర్కొన్నారు.
మనిషి నుంచి మనిషికి వ్యాపిస్తుందా?
ఈ వ్యాధితో మరణించిన వైద్యుడి సన్నిహితులకు ఎలాంటి వ్యాధి లక్షణాలు కనిపించలేదని గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. వారందరూ సురక్షితంగానే ఉన్నట్లు తెలిపింది. ఈ వైరస్ మనిషి నుంచి మనిషికి వ్యాపిస్తుందా? లేదా? అనే దానిపై స్పష్టమైన ఆధారాలు లేవు.
చికిత్స ఉందా?
ప్రస్తుతానికి మంకీ బీ వైరస్‌కు ఎలాంటి టీకాలు అందుబాటులో లేవు. యాంటీ వైరస్ మందులను మాత్రమే చికిత్సగా ఉపయోగిస్తున్నారు. కోతి కరిచినా లేదా గాయపరిచనా వ్యక్తి వెంటనే ఆ ప్రాంతాన్ని సబ్బు, నీళ్లతో బాగా శుభ్రం చేయాలి. దీనినే fluid therapy అంటారు. కోతి కరిచిన లేదా గాయపరిచన వ్యక్తి వైరస్ క్యారియర్‌గా మారే ప్రమాదం ఉంది. కాబట్టి వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి.