War Updates: పశ్చిమాసియా అంతటా అదే ఉద్రిక్తత - పేలుతున్న క్షిపణులు - ఏం జరిగితే యుద్ధం ముగుస్తుంది?
Iran War: ఇరాన్ ను సర్వనాశనం చేసేదాకా యుద్ధం ఆపబోమని అమెరికా, ఇజ్రాయెల్ చెబుతున్నాయి. కానీ ఇరాన్ మాత్రం భయపడకుండా ఎదురుదాడి చేస్తూనే ఉంది.

Missiles are raining down on WestAsia: ఇరాన్, ఇజ్రాయెల్ , అమెరికా మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్నాయి. పశ్చిమాసియా యుద్ధ క్షేత్రంగా మారిపోయింది. ఇజ్రాయెల్ సైన్యం ఇరాన్‌పై భారీ వైమానిక దాడులను కొనసాగిస్తోంది. ఇరాన్‌లోని వందలాది క్షిపణి ప్రయోగ కేంద్రాలను, రాడార్ వ్యవస్థలను , వైమానిక రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ముఖ్యంగా టెహ్రాన్ సమీపంలోని పర్చిన్ మిలిటరీ కాంప్లెక్స్‌పై ఇజ్రాయెల్ రెండోసారి దాడి చేసింది. ప్రతిస్పందనగా, ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ , మధ్య ఇజ్రాయెల్ లక్ష్యంగా క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడుల వల్ల టెల్ అవీవ్‌లో పేలుళ్లు సంభవించినప్పటికీ, ప్రాణనష్టం జరగలేదని ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయి. అయితే, గత 24 గంటల్లో ఇజ్రాయెల్‌లో వివిధ సంఘటనల వల్ల దాదాపు 140 మంది గాయపడి ఆసుపత్రుల్లో చేరినట్లు సమాచారం.
అమెరికా జోక్యంతో మరిన్ని దాడులు
అమెరికా తన సైనిక చర్యలను ఇరాన్‌పై మరింత ఉధృతం చేసింది. ఇరాన్ లోపల ఉన్న కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లపై అమెరికా బాంబుల వర్షం కురిపించింది. అయితే, అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్‌సెత్ మాట్లాడుతూ.. తాము లక్ష్యాలను విస్తరించడం లేదని, నిర్దేశిత లక్ష్యాలకే పరిమితమయ్యామని పేర్కొన్నారు. తాజా లెక్కల ప్రకారం, ఈ యుద్ధం మొదలైనప్పటి నుండి ఇరాన్‌లో మరణాల సంఖ్య 1,000 మార్కును దాటింది. రెడ్ క్రెసెంట్ నివేదికల ప్రకారం దాదాపు 1,500 మంది వరకు మరణించి ఉండవచ్చని అంచనా. లెబనాన్‌లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో గత 24 గంటల్లో 100 మందికి పైగా మరణించారు.
గల్ఫ్ దేశాలపై దాడులు
ఈ యుద్ధం ఇరాన్-ఇజ్రాయెల్ మధ్యనే కాకుండా గల్ఫ్ దేశాలకూ విస్తరించడం ఆందోళన కలిగిస్తోంది. ఇరాన్ గల్ఫ్ దేశాలపైకీ క్షిపణులు ప్రయోగిస్తోంది. రాజధాని మనామాలోని రెండు హోటళ్లు ఒక నివాస భవనంపై ఇరాన్ దాడి చేసినట్లు బహ్రెయిన్ ప్రకటించింది. ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ లక్ష్యంగా వచ్చిన మూడు బాలిస్టిక్ క్షిపణులను సౌదీ అడ్డుకుంది. అల్-ఉదీద్ అనే అమెరికా అతిపెద్ద సైనిక స్థావరంపై జరిగిన డ్రోన్ దాడిని ఖతార్ వైమానిక దళం అడ్డుకుంది. ఇరాన్ డ్రోన్లు , క్షిపణులను అడ్డుకున్నట్లు యూఏఈ వెల్లడించింది. అయితే, ఇరాన్ దాడుల కారణంగా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం తరహాలో సాగుతుందా?
పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రరూపం దాల్చింది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగం ఇరాన్‌లోని పాఠశాలపై జరిగిన దాడులపై త్వరితగతిన విచారణ జరపాలని అమెరికాను కోరింది. చమురు ధరలు పెరిగే అవకాశం ఉండటంతో ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ మొదటి రోజునే దాడుల్లో చనిపోయారు. అయినా ఇంకా దాడులు ఆగడం లేదు. రష్యా, ఉక్రెయిన్ తరహాలో సుదీర్ఘంగా సాగుతుందా అన్న ఆందోళన పలువురిలో వ్యక్తమవుతోంది.
ట్రెండింగ్ వార్తలు






















