Israel's NSO Update: పెగాసస్ స్పైవేర్ వివాదం.. స్పందించిన ఇజ్రాయెల్ సంస్థ.. బ్లాక్ చేస్తూ ప్రభుత్వాలకు షాక్
ప్రభుత్వ అధికారులు, కీలక వ్యవహారాలు చూసుకునే వ్యక్తులు, జడ్జీలు తరహా వారిపై నిఘా కోసం ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌వో పెగాసస్ స్పైవేర్ దుర్వినియోగం అవుతుందని నివేదికలు వస్తున్నాయి.
ఇజ్రాయెల్‌లో రూపొందిన పెగాసస్ స్పైవేర్ భారత్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలలో ప్రకంపనలు రేపుతోంది. ముఖ్యంగా మన దేశంలో ప్రధాన పార్టీల విపక్షనేతలు స్పైవేర్ హ్యాకింగ్ బారిన పడినట్లు ఒక్కొక్కరిగా బయటకు వచ్చి ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో ‘పెగాసస్’స్పైవేర్ సాఫ్ట్‌వేర్ దుర్వినియోగం కావడంపై దాని తయారీసంస్థ ఎన్‌ఎస్‌వో గ్రూప్ తమ సర్వర్స్‌ను బ్లాక్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశ ప్రభుత్వాలు స్పైవేర్‌ను వినియోగించకుండా వీలులేకుండా తాత్కాలికంగా బ్లాక్ చేయాల్సి వచ్చింది. ఈ విషయాన్ని అమెరికా మీడియా రిపోర్ట్ చేసింది.
ఎన్‌ఎస్‌వో సంస్థ రూపొందించిన పెగాసస్ సాఫ్ట్‌వేర్ ఈ విధంగా దుర్వినియోగం అవుతున్నట్లు కథనాలు రావడంతో సంస్థ ఎట్టకేలకు స్పందించింది. ప్రభుత్వ సంస్థలకు తాత్కాలికంగా స్పైవేర్ సర్వర్స్‌ను బ్లాక్ చేసి మరింత దుప్ప్రచారం జరగకుండా నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. కొన్ని దేశాల ప్రభుత్వాలు అసాంఘిక కార్యకలాపాలు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా స్పైవేర్ సాప్ట్‌వేర్ వినియోగిస్తున్నాయని తెలిసిందే. ఉగ్రవాదాన్ని కట్టడి చేయడానికి కూడా ఈ సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తున్నారు. కానీ జర్నలిస్టులు, ప్రతిపక్ష నేతల వ్యక్తిగత వివరాలపై నిఘా, వారి వ్యూహాలు, అంతర్గత వ్యవహారాలపై ప్రభుత్వాలు నిఘా పెడుతున్నాయని సంచలన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రభుత్వ అధికారులు, కీలక వ్యవహారాలు చూసుకునే వ్యక్తులు, జడ్జీలు తరహా వారిపై నిఘా కోసం ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌వో పెగాసస్ స్పైవేర్ దుర్వినియోగం అవుతుందని అమ్నెస్టీ ఇంటర్నేషనల్, నేషనల్ పబ్లిక్ రేడియో (ఎన్‌పీఆర్) నివేదికలు బహిర్గతం చేశాయి. వ్యక్తిగత సమాచారం విషయంలో భద్రతపై ఆందోళన నేపథ్యంలోనే తాత్కాలికంగా సమాచారం తెలియకుండా సర్వర్స్ బ్లాక్ చేసినట్లు ఎన్‌పీఆర్‌కు కంపెనీ ఉద్యోగులు తెలిపారు. అయితే ఏ దేశానికి చెందిన ప్రభుత్వ సంస్థలను బ్లాక్ చేశారన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు. మొదటగా పెగాసస్ స్పైవేర్ దుర్వినియోగంపై రిపోర్ట్ వస్తే చర్యలు తీసుకునేందుకు సంస్థ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
మరోవైపు ఇజ్రాయెల్ ప్రభుత్వంపై రోజురోజుకూ ఒత్తిడి పెరిగిపోతోంది. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాలు, నేతల ముఖ్యమైన సమాచారం మీ దేశ ప్రభుత్వం చేతుల్లోకి వెళ్తుందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎన్‌ఎస్‌వో ఇదివరకే ఐదు ప్రభుత్వాలను బ్లాక్ చేసింది. వీటిలో మెక్సికో, సౌదీ అరేబియా, దుబాయ్ దేశాలున్నాయని తెలుస్తోంది. దాదాపు 50 సంస్థలకు స్పైవేర్ సాఫ్ట్‌వేర్ సహకారం అందిస్తుంది.
పెగాసస్ స్పైవేర్ వివాదంపై దాఖలైన వ్యాజ్యంపై ఈ గురువారం సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఎన్.రామ్, శశికుమార్ సహా సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్, లాయర్ ఎం.ఎల్.శర్మ దాఖలు చేసిన వ్యాజ్యంపై ద్విసభ్య ధర్మాసనం వాదనలు విననుంది. దీనిపై ప్రధాన ప్రతిపక్షాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.