UP Polls: ఎన్నికలకు ముందు అఖిలేశ్ యాదవ్‌కు బూస్ట్.. పార్టీలో పెరిగిన చేరికలు
సమాజ్‌వాదీ పార్టీలోకి ఇటీవల చేరికలు పెరిగాయి. తాజాగా ఇద్దరు ఎమ్మెల్యేలు అఖిలేశ్ యాదవ్ పార్టీలోకి చేరారు.
2022 ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సమాజ్‌వాదీ పార్టీకి బూస్ట్ వచ్చింది. భాజపా, బీఎస్పీ పార్టీల నుంచి చెరో ఎమ్మెల్యే ఈరోజు సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా, ఎస్పీ మధ్య తీవ్ర పోటీ నెలకొనే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి సమయంలో అధికార భాజపా నుంచి ఎమ్మెల్యే సమాజ్‌వాదీ పార్టీలో చేరడం కలిసొచ్చే అవకాశమని అభిప్రాయపడుతున్నారు.
ఉత్తర్‌ప్రదేశ్ లఖ్‌నవూలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో అఖిలేశ్ యాదవ్ సమక్షంలో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. వీరితో పాటు ఉత్తర్‌ప్రదేశ్ శాసన మండలి మాజీ ఛైర్మన్ గణేశ్ శంకర్ పాండే కూడా ఎస్పీలో చేరారు. వీరితో పాటు పెద్ద సంఖ్యలో బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందినవారు ఎస్పీ కండువా కప్పుకున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాకు ప్రజలు బుద్ధి చెబుతారని అఖిలేశ్ యాదవ్ అన్నారు.
భాజపాకు సాధారణ మెజార్టీ - అఖిలేష్ గట్టిపోటీ
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఐదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ వ్యతిరేకతను ఎదుర్కొంటున్నప్పటికీ అది అధికారం చేజారిపోయేంత స్థితిలో లేదని ఏబీపీ- సీఓటర్ సర్వేలో తేలింది. సమాజ్ వాదీ పార్టీ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నప్పటికీ భాజపాకు క్లియర్ అడ్వాంటేజ్ కనిపిస్తోంది. యూపీ అతి పెద్ద రాష్ట్రం. అయినప్పటికీ అన్ని రీజియన్లలోనూ భాజపా ముందడుగు వేస్తోంది. కొన్ని చోట్ల సమాజ్ వాదీ పార్టీ గట్టి పోటీ ఇస్తోంది. అయినా భాజపా పైచేయి సాధించబోతోందని తేలింది.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే భాజపాకు 212 - 224 సీట్ల మధ్య లభించే అవకాశం ఉంది. యూపీలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 403. 40 శాతం ఓట్లు భాజపా ఖాతాలో పడే అవకాశం ఉంది. ఈ కారణంగా భాజపాకు సాధారణ మెజార్టీ రావడం ఖాయంగా కనిపిస్తోంది. గట్టి పోటీ ఇస్తున్న సమాజ్ వాదీ పార్టీ 151 నుంచి 163 స్థానాలు లభించే అవకాశం ఉంది. ఆ పార్టీ మిత్రపక్షాలతో కలిసి 34 శాతం ఓట్లను కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.