Omicron: థర్డ్ వేవ్ ఒమిక్రాన్ రూపంలోనే రాబోతోందా? ఈ వేరియంట్‌ను తట్టుకోవాలంటే బూస్టర్ డోస్ అవసరమా.. అధ్యయనంలో ఏముంది!
కరోనా థర్డ్ వేవ్ ఒమిక్రాన్ రూపంలోనే రాబోతోందా. యూకేలో ప్రజలు మాత్రం ఇదే నమ్ముతున్నారు.
ఒమిక్రాన్ దక్షిణాఫ్రికాలో బయటపడి మెల్లగా ప్రపంచమంతా పాకుతోంది. మనదేశంలో కూడా కొన్ని కేసులు బయటపడ్డాయి. అసలే మూడో వేవ్ భయంతో అల్లాడుతున్న ప్రజలకు ఒమిక్రాన్ మరింత ఆందోళనకు గురిచేస్తోంది. బ్రిటన్ అయితే ఒక అడుగు ముందుకేసి తమ దేశంలో డిసెంబర్ మధ్యనాటికి ఒమిక్రాన్ ఎక్కువమందికి సోకి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుందన్న అనుమానాన్ని ఇప్పటికే వ్యక్త పరిచింది. ఇది మరో వేవ్ రూపంలో విరుచుకుపడినా ఆశ్చర్యపోనక్కర్లేదంటూ అక్కడి అధికారులు భావిస్తున్నారు.
బూస్టర్ డోస్ అవసరం
ఒమిక్రాన్ ను తట్టుకోవాలంటే బూస్టర్ డోస్ అవసరమని యూకేలోని ఒక అధ్యయనం ప్రాథమికంగా నిర్ధారించింది. డెల్టా స్ట్రెయిన్ తో పోలిస్తే ఒమిక్రాన్ రోగలక్షణ సంక్రమణ అధికంగా ఉన్నట్టు గుర్తించింది. దీంతో రెండు డోసులు వేసుకున్న వారు కూడా బూస్టర్ డోస్ తీసుకోవాల్సిన అవసరం ఉందని తేల్చింది. బూస్టర్ డోస్ వల్ల రక్షణ 75శాతం వరకు పెరుగుతుందని వెల్లడించింది.
రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ ఒమిక్రాన్ సోకదని ధీమా పడకూడదని అంటున్నారు యూకే అధ్యయనకర్తలు. రెండో డోసు వేయించుకుని కొన్ని నెలలు గడిచిన వారిలో ఒమిక్రాన్ వేరియంట్ సోకే ప్రమాదం ఎక్కువ ఉందని యూకే హెల్త్ సెక్యూరిటీ ఇమ్యునైజేషన్ హెడ్ మేరీ రామ్సే వివరించారు.
ఇప్పటికే బ్రిటన్లో బూస్టర్ డోస్ వేయించుకోమని ప్రభుత్వం ప్రచారం వేగవంతం చేసింది. ఒమిక్రాన్... డెల్టా కంటే చాలా వేగంగా వ్యాప్తి చెందుతోందని అది మూడో వేవ్ రూపంలో మారకముందే బూస్టర్ డోస్ లు వేసుకోమని కోరుతోంది అక్కడి ప్రభుత్వం.
కేవలం ఈ అధ్యయనం బ్రిటన్ కు మాత్రమే వర్తిస్తుందని భావించకూడదు. ఒమిక్రాన్ వేరియంట్ వేళ ఇది అన్ని దేశాలు పరిగణించాల్సిన అంశం. మనదేశంలో కూడా బూస్టర్ డోస్ పై ఇప్పటికే చర్చలు, పరిశోధనలు సాగుతున్నాయి.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Read Also: డయాబెటిస్ ఉన్నవారు నారింజ పండ్లు తినకూడదా?
Read Also: మీ హక్కులు మీకు తెలుసా? మీ స్వేచ్ఛని లాక్కునే హక్కు ఈ భూమ్మీద ఎవరికీ లేదు
Read Also: పిల్లల్లో టైప్1 డయాబెటిస్... ఎలా గుర్తించాలి? ఏం చేయాలి?
Read Also: వారానికి రెండు సార్లు... బ్రేక్‌ఫాస్ట్‌లో కట్టెపొంగలి, చలికాలానికి పర్‌ఫెక్ట్ వంటకం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి