BMC Election Results 2026: ముంబై మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం, ఫలితాల ప్రకటనలో జాప్యం.. కారణం ఇదే
BMC Election Result: ముంబై మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. గత ఎన్నికల మాదిరిగానే అన్ని వార్డుల ఓట్లూ ఒకేసారి లెక్కించకపోవడంతో జాప్యం జరుగుతుంది.

ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు (జనవరి 16న) 10 గంటలకు ప్రారంభమైంది. అయితే ఫలితాల ప్రకటన కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. జనవరి 15న ముంబైలో 2017 తరహాలోనే 227 ఎన్నికల వార్డులలో ఒకేసారి ఓట్ల లెక్కింపు కాకుండా, దశల వారీగా లెక్కింపు జరగడం వల్ల శుక్రవారం ఉదయం లెక్కింపు ప్రారంభమైనప్పటికీ ఫలితాల ప్రకటన ఆలస్యం కావచ్చని సివిక్ అధికారులు తెలిపారు.
బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) మహానగరంలోని 23 కేంద్రాలలో ఉదయం 10 గంటలకు లెక్కింపు ప్రారంభించింది. గత ఎన్నికల మాదిరిగా కాకుండా, అన్ని వార్డుల లెక్కింపు ఒకేసారి ప్రారంభం కాలేదు. ఒకసారి రెండు వార్డుల ఓట్లను లెక్కిస్తారు. అంటే, ఉదయం 10 గంటలకు 227 వార్డులకు బదులుగా కేవలం 46 వార్డుల లెక్కింపు మాత్రమే చేపట్టారు.
ఒకేసారి రెండు వార్డుల ఓట్ల లెక్కింపు
అధికారుల ప్రకారం, ఓట్ల లెక్కింపు ప్రక్రియ మార్పుల కారణంగా, గత ఎన్నికలకు భిన్నంగా, ప్రక్రియ ప్రారంభమైన వెంటనే 227 సీట్ల ట్రెండ్స్ అందుబాటులో ఉండవు. అన్ని సీట్ల ఫలితాలు చాలా ఆలస్యంగా ప్రకటించే అవకాశం ఉందని ఓ ప్రకటనలో తెలిపారు. గత వారం సివిక్ హెడ్ క్వార్టర్స్‌లో జరిగిన సమావేశంలో, BMC అధికారులు మాట్లాడుతూ.. "ఒకేసారి రెండు వార్డుల ఓట్లను లెక్కింపు చేయడం వల్ల ప్రక్రియ వేగవంతం అవుతుంది. ఎందుకంటే అందుబాటులో ఉన్న సిబ్బంది ఆ రెండు వార్డులపై మాత్రమే పనిచేస్తాయి" అన్నారు.
ఫైనల్ ఫలితాలు ప్రకటించడంలో ఆలస్యం - గగ్రాణి
మున్సిపల్ కమీషనర్ భూషణ్ గగ్రాణి ఫలితాల ప్రకటనపై మీడియాతో మాట్లాడారు. అన్ని సీట్ల తుది ఫలితాలను ప్రకటించడంలో ఆలస్యం కావచ్చని, ఓట్ల లెక్కింపు ప్రక్రియలో దాదాపు ఒక గంట ఆలస్యం కావచ్చని తెలిపారు. సాధారణం కంటే ఒక గంట ఎక్కువ సమయం పట్టవచ్చు అన్నారు. మున్సిపల్ కమీషనర్ గగ్రాణి జనవరి 15న బీఎంసీ ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను సమీక్షించారు. తగిన భద్రత, ట్రాఫిక్ నిర్వహణ, శాంతిభద్రతల చర్యలు తీసుకున్నామని చెప్పారు.
2,299 మంది అధికారులు, సిబ్బంది నియామకం
ముంబై మునిసిపల్ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 2,299 మంది అధికారులు, సిబ్బందిని నియమించారు. ఇందులో 759 మంది సూపర్‌వైజర్లు, 770 మంది అసిస్టెంట్లు ఉండగా, 770 మంది క్లాస్ IV ఉద్యోగులు ఉన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను సజావుగా నిర్వహించడానికి సిబ్బందికి ముందే శిక్షణ ఇచ్చారు. ఖచ్చితత్వంతో పాటు పారదర్శకతను నిర్ధారించడానికి ఫలితాలను కంప్యూటరైజ్డ్ సిస్టమ్‌ను ఉపయోగించి లెక్కించి ఫలితాలు వెల్లడిస్తామని BMC తెలిపింది. ముంబై మునిసిపల్ కార్పొరేషన్ 227 సీట్ల కోసం 1,700 మంది అభ్యర్థులు పోటీ చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. నేటి సాయంత్రానికి పూర్తి ఫలితాలు రానున్నాయి.






















