Agriculture Laws: అయిపోలేదు.. ఇంకా ఉంది.. వ్యవసాయ చట్టాలు మళ్లీ తెస్తాం .. కేంద్రమంత్రి కీలక ప్రకటన !
ఉపసంహరించిన వ్యవసాయ చట్టాలను మళ్లీ తీసుకు వస్తామని కేంద్రమంత్రి తోమర్ ప్రకటించారు. రైతులు ఆందోళనలు విరమించి వెళ్లిపోయిన తర్వాత వ్యూహాత్మకంగా ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది.
కేంద్ర ప్రభుత్వం అత్యంత వివాదాస్పద వ్యవసాయ చట్టాల విషయంలో మరో వివాదాస్పద నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ వ్యసాయ చట్టాలను మళ్లీ తీసుకు వస్తామని ప్రకటించారు. మహారాష్ట్రలో అగ్రో విజన్ ఎక్స్‌పోలో పాల్గొన్న వ్యవసాయం మంత్రి సాగు చట్టాల్ని మళ్లీ తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ప్రకటించారు. క అడుగు ముందుకు వేశామంటే.. మూడు అడుగులు ముందుకు వేస్తామని ఆయన తేల్చి చెప్పారు.
Also Read: ఐటీఆర్ ఫైల్ చేయండి.. బుల్లెట్టు గెలవండి! మరో రూ.లక్ష కూడా పొందొచ్చు.. కేంద్రం ఆఫర్!!
చర్చకు కూడా నోచుకోకుండా చట్టాలు వివాదాస్పదం అయ్యాయి. అందుకే కేంద్రం వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. అందుకే కొన్ని మార్పులు చేసి మళ్లీ వ్యవసాయ చట్టాలు తీసుకొస్తామని ఆయన చెప్పారు. దాదాపు ఏడాదిపాటు సాగిన రైతు ఉద్యమం కారణంగా ఇటీవలే కేంద్రం వెనక్కి తగ్గింది. వ్యవసాయ చట్టాల్ని వెనక్కి తీసుకుంంది. సాగు చట్టాల ఉపసంహరణకు కేబినెట్ ఆమోదం తెలపగా.. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే ఆమోదం, వెనువెంటనే సాగు చట్టాల రద్దు బిల్లుపై రాష్ట్రపతి ముద్ర పడింది.
Also Read: రాజస్థాన్ లో కూలిన ఐఏఎఫ్ మిగ్-21 ఎయిర్ క్రాఫ్ట్... పైలట్ ఆచూకీ కోసం గాలింపు
కేంద్ర ప్రభుత్వంపై నమ్మకం లేక చట్టాలను వెనక్కి తీుసకున్నా రైతులు ఆందోళన విరమించలేదు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత సహా అనేక అంశాలపై తమ పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు. వారు అడిగిన డిమాండ్లన్నింటినీ రాత పూర్వకంగా అంగీకారం తెలిపిన కేంద్రం.. వారితో నిరసన మాన్పించగలిగింది. ఇటీవలే ఢిల్లీ సరిహద్దుల నుంచి రైతులందరూ వెనుదిరిగారు. స్వగ్రామాలకు వెళ్లిపోయారు. ఇలాంటి సమయంలో కేంద్ర మంత్రి మళ్లీ చట్టాలు తెస్తామని ప్రకటించడం.. రైతుల్ని కించ పరచడమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఏ రూపంలో వ్యవసాయ చట్టాలు తీసుకు వచ్చినా మళ్లీ రైతుల్లో తీవ్ర ఆగ్రహం వెల్లువెత్తడం ఖాయమన్న అభిప్రాయం ఉంది. వరుసగా రాష్ట్రాల ఎన్నికలు ఉండటం.. వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకూ అదే పరిస్థితి ఉండటంతో.. ఈ టర్మ్‌లో మళ్లీ వ్యవసాయ చట్టాల గురించి ఆలోచించరని..మళ్లీ మూడోసారి అధికారం చేపడితే తీసుకు వస్తారని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.
Also Read: డెల్టా మరణమృదంగం - రైతు చట్టాల ఉపసంహరణ.. ! 2021లో భారత్‌కు మరపురాని మైలురాళ్లు ఎన్నో..