Rajasthan Aircraft Crash: రాజస్థాన్ లో కూలిన ఐఏఎఫ్ మిగ్-21 ఎయిర్ క్రాఫ్ట్... పైలట్ ఆచూకీ కోసం గాలింపు
రాజస్థాన్ జైసల్మేర్ సమీపంలో ఐఏఎఫ్ పైటర్ ఎయిర్ క్రాఫ్ట్ మిగ్-21 కూలిపోయింది. శిక్షణా సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పైలట్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
రాజస్థాన్ లోని జైసల్మేర్ సమీపంలో శుక్రవారం రాత్రి భారత వైమానిక దళానికి చెందిన మిగ్-21 యుద్ధ విమానం కూలిపోయింది. విమానం పైలట్ కోసం గాలిస్తున్నారని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది. రాజస్థాన్ రాష్ట్రంలోని సామ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డెసర్ట్ నేషనల్ పార్క్ ప్రాంతంలో మిగ్-21 యుద్ధ విమానం కూలిపోయిందని జైసల్మేర్ ఎస్పీ అజయ్ సింగ్ తెలిపారు.
"ఇవాళ రాత్రి 8:30 గంటల ప్రాంతంలో ఎయిర్ పోర్స్ కు చెందిన MiG-21 విమానం శిక్షణా సమయంలో పశ్చిమ సెక్టార్‌లో ఎగురుతూ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంపై విచారణకు ఆదేశించాం" అని భారత వైమానిక దళం ట్వీట్ చేసింది.
This evening, around 8:30 pm, a MiG-21 aircraft of IAF met with a flying accident in the western sector during a training sortie. Further details are awaited.
— Indian Air Force (@IAF_MCC) December 24, 2021
An inquiry is being ordered.
ఇటీవల ప్రమాదంలో మాజీ సీడీఎస్ మృతి
తమిళనాడులో ఐఏఎఫ్ హెలికాప్టర్ ప్రమాదంలో మాజీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, అతని భార్య మధులికా రావత్, బ్రిగేడియర్ లఖ్వీందర్ సింగ్ లిద్దర్ మరో 11 మంది మరణించారు. ఆ ప్రమాదం జరిగిన కొన్ని వారాల తర్వాత ఈ సంఘటన జరిగింది. కోయంబత్తూరులోని సూలూర్ ఎయిర్ బేస్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే తమిళనాడులోని కూనూర్ సమీపంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎంఐ-17వీ-5 హెలికాప్టర్ కూలిపోయింది. గత రెండేళ్లలో ఏడు ఐఏఎఫ్ విమానాలు కూలిపోయాయని ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో తెలిపింది. ఇటీవల మధ్యప్రదేశ్‌లో కూలిన మిరాజ్ 2000తో సహా గత రెండేళ్లలో వైమానిక దళానికి చెందిన మొత్తం ఏడు విమానాలు కూలిపోయాయని కేంద్ర రక్షణశాఖ సహాయ మంత్రి అజయ్ భట్ లోక్‌సభలో తెలిపారు.
విమాన ప్రమాదాల్లో 31 మంది మృతి
2017 మార్చి నుంచి ఇప్పటివరకు 15 మిలిటరీ హెలికాప్టర్ ప్రమాదాల్లో 31 మంది మరణించారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. భారత సైన్యం, భారత వైమానిక దళానికి చెందిన ఏడు హెలికాప్టర్లు ప్రమాదానికి గురయ్యాయని రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ తెలిపారు. ప్రమాదాలకు గురైన 15 హెలికాప్టర్లలో నాలుగు అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ (ALH), నాలుగు చీతా, రెండు ALH (వెపన్ సిస్టమ్ ఇంటిగ్రేటెడ్) వెర్షన్‌లు, మూడు Mi-17V5, ఒక Mi-17 చేతక్ ఉన్నాయి.