Telangana News: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం - జనవరి 1న సెలవు ప్రకటన
New Year Holiday: న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న తెలంగాణ ప్రభుత్వం సాధారణ సెలవు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగుల సెలవుల జాబితాలో మార్పులు చేసింది.
Telangana Government Declared January 1st as Holiday: తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) గుడ్ న్యూస్ చెప్పింది. న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ సెలవుల జాబితాలో మార్పులు చేసింది. అలాగే, జనవరి 1న సెలవు నేపథ్యంలో ఫిబ్రవరిలో రెండో శనివారం సెలవును రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఉద్యోగులు ఈ మార్పును గమనించాలని సూచించింది. డిసెంబర్ 31న న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొనే ఉద్యోగులకు సౌలభ్యం కలిగేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
వేడుకలపై ఆంక్షలు
మరోవైపు, న్యూ ఇయర్ వేడుకలపై ఇప్పటికే పోలీసులు ఆంక్షలు విధించారు. ఈవెంట్లకు ముందస్తు అనుమతి తప్పనిసరి అని నిబంధనలు మీరితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డిసెంబర్ 31న అర్ధరాత్రి ఒంటి గంట వరకూ మాత్రమే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు అనుమతి ఇచ్చారు. నగరంలో పబ్స్, క్లబ్స్, బార్లు, రెస్టారెంట్లు, హోటళ్లు అర్ధరాత్రి ఒంటి గంటలోపు మూసెయ్యాలని ఆదేశించారు. పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేయాలని, పబ్స్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు తప్పనిసరి అని సూచించారు. వేడుకలు నిర్వహించే వారు భద్రతా చర్యలు చేపట్టాలని, మ్యూజిక్ ఇతర శబ్దాలు 45 డెసిబుల్స్ కంటే ఎక్కువ రాకుండా చూసుకోవాలని చెప్పారు. సామర్థ్యానికి మించి పాసులు ఇవ్వొద్దని పేర్కొన్నారు. అలాగే, ఆ రోజు నగరంలో ట్రాఫిక్ సమస్యలు లేకుండా చర్యలు చేపట్టనున్నారు. మద్యం సేవించి వాహనం నడపకూడదని, డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే రూ.10 వేల ఫైన్, 6 నెలల జైలు శిక్ష విధించేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. అవసరమైతే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని పేర్కొన్నారు.