TAPAS Drone: ఇండియన్ ఆర్మీలోకి పవర్‌ఫుల్ తపస్ డ్రోన్, ఆ ఈవెంట్‌లో గ్రాండ్ ఎంట్రీ
TAPAS Drone: ఇండియన్ ఆర్మీలోకి త్వరలోనే తపస్ డ్రోన్ అందుబాటులోకి రానుంది.
TAPAS Drone:
తపస్ డ్రోన్
భారత రక్షణ రంగాన్ని మరింత పటిష్ఠం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త ఆయుధాలను సమీకరిస్తోంది. ఫైటర్ జెట్‌లు, యుద్ధ నౌకలు దేశీయంగా తయారు చేసుకుంటూ అగ్రరాజ్యాలకు సవాల్ విసురుతోంది. ఈ క్రమంలోనే కొత్త డ్రోన్‌లనూ తయారు చేసింది భారత్. మానవరహిత వెహికిల్ (UAV) లను వచ్చే వారం నుంచి రక్షణ రంగంలోకి దింపనున్నారు. వచ్చే వారం బెంగళూరులో ఏరో ఇండియా కార్యక్రమం జరగనుంది. ఆ ఈవెంట్‌లోనే తపస్ డ్రోన్‌లు (Tapas BH-201) గాల్లో విన్యాసాలు చేయనున్నాయి. ఈ డ్రోన్‌లను DRDO తయారు చేసింది. ఈ డ్రోన్‌తో పాటు దాదాపు 180 ఎయిర్ క్రాఫ్ట్‌లో గాల్లో ఎగరనున్నాయి. అయితే...ఈ కార్యక్రమంలో డ్రోన్ షో హైలైట్ అవుతుందని చెబుతున్నారు అధికారులు. తపస్‌తో పాటు మరో డ్రోన్ ఘటక్ కూడా సిద్ధమవుతోంది. ఈ ఏడాది జూన్, జులై నాటికి అందుబాటులోకి రానుంది. Tapas అంటే Tactical Airborne Platform for Aerial Surveillance. కేవలం సరిహద్దులపై నిఘా పెట్టడమే కాదు. అవసరమైనప్పుడు శత్రువులపై దాడి చేసేందుకూ ఇవి సిద్ధంగా ఉంటాయి. 2016 నుంచి వీటి తయారీ మొదలైంది. అయితే...ఇప్పటి వరకూ వీటిని ఇండియన్ ఆర్మీలో చేర్చలేదు. బెంగళూరు ఈవెంట్ తరవాత ఈ డ్రోన్‌లను ఇండియన్ ఆర్మీలో చేర్చనున్నారు.
ఫీచర్లు ఇవే..
. 28 వేల అడుగుల ఎత్తులో 18 గంటలకు పైగా చక్కర్లు కొట్టగలిగే సామర్థ్యం ఉంది.
. ఇది మీడియమ్ ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ డ్రోన్ (MALE)
. టేకాఫ్, ల్యాండింగ్ అంతా మానవ రహితంగానే జరుగుతాయి.
. గతంలో ఈ డ్రోన్ రుస్తుమ్-2గా వ్యవహరించేవారు. అయితే మార్పులు చేర్పులు చేసి ఇప్పుడు తపస్ పేరుతో పవర్‌ఫుల్‌గా తయారు చేశారు.
. ఏకధాటిన వెయ్యి కిలోమీటర్ల వరకూ ప్రయాణించగలదు.
. పగలు మాత్రమే కాదు. రాత్రి కూడా నిఘా పెడుతుంది తపస్ డ్రోన్.
యుద్ధ వ్యూహాలు మారిపోతున్నాయి. పెద్ద ట్యాంకులతోనే కాదు. చిన్న చిన్న పరికరాలతోనూ దాడులు చేసే సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. అలాంటి వాటిలో డ్రోన్‌లు కీలకమైనవి. భారత్, పాక్ సరిహద్దు ప్రాంతాల్లో పదేపదే డ్రోన్‌ల కలకలం రేగుతోంది. దీనిపై భారత్ వ్యూహం మార్చింది. శత్రుదేశం నుంచి వచ్చే డ్రోన్‌ల ఆట కట్టించేందుకు కొత్త వ్యూహంతో ముందుకొచ్చింది. గద్దలకు ప్రత్యేక ట్రైనింగ్ ఇచ్చి ఆ డ్రోన్‌లను గాల్లోనే ధ్వంసం చేయనున్నారు. ఇప్పటికే నెదర్లాండ్స్, ఫ్రాన్స్ ఈ వ్యూహాన్ని అనుసరిస్తుండగా..ఇప్పుడా జాబితాలో భారత్ కూడా చేరింది. భారత్, అమెరికా జాయింట్ మిలిటరీ ఎక్సర్‌సైజ్ "యుద్ధ్ అభ్యాస్"లో భాగంగా...ఉత్తరాఖండ్‌లో గతేడాది ఈ శిక్షణ కొనసాగింది. దాదాపు 15 రోజుల పాటు ఈ విన్యాసాలు జరిగాయి. సైన్య వ్యూహాలను ఇరు దేశాలూ ఇచ్చి పుచ్చుకుంటాయి. విపత్కర పరిస్థితుల్లో ఎలా స్పందించాలి..? అనేదీ ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటారు. సరిహద్దు ప్రాంతాల నుంచి డ్రోన్‌లు వస్తుంటే..వాటిని ముందుగానే పసిగట్టే విధంగా గద్దలకు ట్రైనింగ్ ఇచ్చారు. భారత్, పాకిస్థాన్ మధ్య దాదాపు 3 వేల కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ఉంది. గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్ము...ఈ సరిహద్దుకి దగ్గరగా ఉంటాయి. ఈ ప్రాంతాల్లో ఇటీవలి కాలంలో డ్రోన్‌లు తరచుగా కనిపించాయి. డ్రగ్స్‌ను పెద్ద ఎత్తున సరఫరా చేస్తూ ఇవి కంటపడ్డాయి. బీఎస్‌ఫ్ బలగాలు వీటిని గుర్తించి నిర్వీర్యం చేశారు. అయితే...తరచూ ఇదే సమస్య ఎదురవుతుండటం వల్ల పూర్తి స్థాయిలో దీనికి పరిష్కారం కోసం పక్షులను రంగంలోకి దింపారు.