Ranil Wickremesinghe Profile: వకీల్‌సాబ్ టు ప్రెసిడెంట్-శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే జర్నీ ఇదే
Ranil Wickremesinghe Profile: శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన రణిల్ విక్రమసింఘేకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ఆర్థిక స్థిరత్వం సాధించటంలో ఆయన కీలక పాత్ర పోషిస్తారని అంచనా వేస్తున్నారు.
Ranil Wickremesinghe Profile:
న్యాయవాది నుంచి దేశాధ్యక్షుడిగా..
శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు రణిల్ విక్రమసింఘే. గొటబయ రాజపక్స దేశం నుంచి పరారయ్యాక తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్న ఆయన ఇప్పుడు శాశ్వత అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం శ్రీలంకలో ఆర్థిక, రాజకీయ సంక్షోభం నడుస్తోంది. ప్రజలు దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడు దేశాన్ని ఈ సంక్షోభం నుంచి గట్టెక్కించాల్సిన బరువైన బాధ్యత...రణిల్ విక్రమసింఘేపై పడింది. అయితే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న విక్రమసింఘే..ఈ ఛాలెంజ్‌ను అధిగమిస్తారని విశ్లేషకులు అంటున్నారు. పైగా, అవినీతి ఆరోపణలు ఏమీ లేకపోవటమూ కలిసొస్తుందన్నది ఓ విశ్లేషణ. 1977లో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన రణిల్ విక్రమసింఘే, ఇప్పటికే ఆరు సార్లు శ్రీలంకకు ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. రాజకీయాల్లో రాక ముందు ఆయన న్యాయవాదిగా పని చేశారు. 1993లో అప్పటి శ్రీలంక ప్రధాని రణసింఘే ప్రేమదాస హత్యకు గురయ్యారు. ఆ సమయంలో రణిల్ విక్రమసింఘే ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు.
అవినీతి లేని నేతగా..
ప్రధానిగానే కాకుండా, ప్రతిపక్ష నేతగానూ మంచి పేరే సంపాదించుకున్నారు రణిల్ విక్రమసింఘే. ఆర్థిక స్థిరత్వం ఎలా సాధించాలో తెలిసిన వ్యూహకర్తగానూ ఆయనకు పేరుంది. 2001లో శ్రీలంకలో ఆర్థిక మాంద్యం తీవ్రంగా ఉన్న సమయంలో, తనదైన విధానాలతో ఆ పరిస్థితుల నుంచి బయట పడేశారు రణిల్. "క్లీన్ పొలిటీషియన్"గానే ఇప్పటి వరకూ కొనసాగారు. అయితే 2015లో ప్రధానిగా ఉన్న సమయంలో రణిల్ విక్రమసింఘే, రాజపక్స కుటుంబానికి అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. రాజపక్సే కుటుంబం అవినీతికి పాల్పడినా, ఆ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యంతో రణిల్ విక్రమసింఘే వెనకేసుకొచ్చారన్న విమర్శలున్నాయి. 2019లో ప్రధాని పదవి నుంచి తప్పుకునే కాలానికి, దేశ ప్రజల్లో ఆయనపై తీవ్ర అసంతప్తి వ్యక్తమైంది. ఆ ఏడాదిలోనే ఈస్టర్ దాడులు జరిగాయి. ఈ విషయంలో ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోలేదని, దేశ భద్రతపై దృష్టి పెట్టలేదని విమర్శలు వచ్చాయి. ఈ ఫలితంగానే 2020లో పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయారు రణిల్.
ఆ సమయంలో చరిష్మా దెబ్బతింది..
లిస్ట్ సిస్టమ్ ద్వారా పార్లమెంట్‌లోకి అడుగు పెట్టిన ఆయన..ఈ ఏడాది మే లో కేర్‌టేకర్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు తీసుకున్నారు. మధ్యవర్తిత్వం వహించటంలో రణిల్‌కు మించిన వారు లేరని శ్రీలంక రాజకీయ నేతలు చెబుతారు. ఆయన నేతృత్వం వహించే యునైటెడ్ నేషనల్ పార్టీలో చీలికలు వచ్చి 2020లో రాజకీయంగా సమస్యలు ఎదుర్కొన్నారు. ఆ పార్టీలోని సీనియర్ నేతలంతా బయటకు వచ్చేశారు. వీళ్లంతా కలిసి కొత్త పార్టీ పెట్టుకున్నారు. గత అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన హయాంలో చేసిన కొన్ని పనుల వల్ల రణిల్ విక్రమసింఘే చరిష్మా కాస్త దెబ్బతింది.
Also Read: Cheerameenu Fishes: చీరమీను చేపలు వచ్చేసాయోచ్, మీరు ఎప్పుడైనా తిన్నారా?