Cheerameenu Fishes: చీరమీను చేపలు వచ్చేసాయోచ్, మీరు ఎప్పుడైనా తిన్నారా?
Cheerameenu Fishes: చూడటానికి చాలా చిన్నగా కనిపించే చీరమేను చేపల గురించి వినే ఉంటారు. అయితే ఎప్పుడో రావాల్సిన ఈ చేపలు భారీ వర్షాల కారణంగా ముందగానే వచ్చేసి అందరి నోళ్లలో నీళ్లూరేలా చేస్తున్నాయి.
Cheerameenu Fishes: సాధారణంగా చేపలను కేజీల్లో కొంటుంటారు. అయితే ప్లేటు, చెంబు, బిందెల ప్రకారం అమ్మే చేప ఒకటుంది. అదేంటీ అలా ఎలా అమ్ముతారు అనుకుంటున్నారా.. అవునండి అలాగే అమ్ముతారు. అయితే అదే చీరమీను. చూడడానికి అతి చిన్నగా ఉండే ఈ చేపలను గోదావరి జిల్లాల్లో చిన్న పోగుగా పిలుస్తారు. 100 రూపాయల నుంచి వీటి ధర చెప్తూ అమ్ముతారు. అదే బతికి ఉన్న చేపలు కావాలంటే... ఏ చెంబులోనే, ప్లేటులోనే, బిందెలోనూ కలిపి మరీ విక్రయిస్తారు. గోదావరిలో ఎర్ర నీరు అంటే కొత్త నీరు వచ్చాక పులసలు ఎదురీదుతూ వస్తుంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే పులసల సీజన్ ముగిసాక చీరమీను అనే చేప సీజన్ వస్తుందని చాలా మందికి తెలియదు. గోదావరి జిల్లాల్లో మాత్రం పులస తర్వాత చీరమీను చేపలు చాలా పాపులర్.
వరదల కారణంగా ముందే వచ్చిన చీరమీను..
చీరమీను చేపల సీజన్ శీతకాల గాలులు మొదలయ్యాక వస్తుంది. సముద్రం, నదీ కలిసే ప్రాంతాల్లో నీటి అడుగున ఉండే చీరమీను చేపలు చల్లగా వీచే గాలులకు నీటి అడుగు భాగం నుండి పైకి చేరుకుంటాయి. వాటిని తినడానికి పక్షులు పెద్ద ఎత్తున నీటిపై ఎగురుతూ కనిపిస్తాయి. మత్స్యకారులకు చీరమీను వచ్చింది అనడానికి అదే సిగ్నల్. అయితే వీటిని పట్టుకోవడానికి చీరలనే వాడేవారు. ఎందుకంటే వేళ్ళ సందుల్లో నుండి కూడా జారిపోయేంత చిన్నగా ఈ చేపలు ఉంటాయి. ఇక వలల్లో పడే అవకాశమే లేదు. చీరలను ఉపయోగించి పడతారు కాబట్టే ఈ చేపలకు చీరమీను అనే పేరు వచ్చింది.
దసరా నుండి నాగుల చవితి మధ్యలో మహా అయితే ఓ నెల రోజుల పాటు మాత్రమే దొరికే ఈ చేప కోసం గోదావరి జిల్లాల ప్రజలు ఏడాదంతా ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఈ సారి వరదల కారణంగా వాతావరణం మారడంతో ఎప్పుడో దసరా నాడు రావాల్సిన చీరమీను ఏకంగా జూలై లోనే వచ్చేసింది. దానితో రాజమండ్రి, ధవళేశ్వరం, యానాం లాంటి ప్రాంతాల్లో మత్స్యకార మహిళలు చీరమీను చేపలను పోగుల్లెక్కన, ప్లేట్ల లెక్కన అమ్ముతూ కనిపిస్తున్నారు.
ఒకప్పుడు కొబ్బరి తోటలకు ఎరువుగా వేసే చీరమీను ఇప్పుడు ఫుల్ కాస్ట్లీ అయిపోయింది. నిజానికి చీరమీను అనేది కేవలం ఒక జాతి చేపలు కాదు. సారిడా గ్రాస్ లిన్, టంబిల్, అండో స్క్వామిన్ జాతులకు చెందిన చిన్న చిన్న చేపలు ఇవి. వీటిని ఒకప్పుడు కోనసీమలోని కొబ్బరి చెట్లకు ఎరువుగా వాడేవారు. నెమ్మదిగా వీటి రుచికి అలవాటు పడడంతో గోదావరి జిల్లాల ప్రజలు వీటిని పెద్ద ఖరీదు పెట్టి మరీ కొంటున్నారు. చిన్న ప్లేట్ లోని ఒక పోగు 100 రూపాయలుకు కొంటున్నారు. నలుగురు ఉన్న కుటుంబానికి కనీసం 4 పోగులు కావాలి. అంటే 400 పెట్టాల్సిందే. ఇక సీజన్ ఊపందుకున్నాక బిందె, తవ్వ, చెంబు లెక్కన వీటిని అమ్ముతారు. తాజాగా విదేశాల్లో స్థిరపడిన గోదావరి జిల్లాల ప్రజలు వీటిని ఇక్కడి నుండి విదేశాలకు ఎగుమతి చేయించుకుంటున్నారు. మరి చీరమీను టేస్టు ఆ రేంజులో ఉంటుంది.
చింతచిగురుతో వండి తింటే ఉంటదీ..
చీరమీను చేపను మిగిలిన చేపల్లా బాగు చెయ్యడం అంటూ ఉండదు . వీటి సైజు బాగా చిన్నగా ఉండడంతో చేపను చేపలా తినేయ్యాల్సిందే . అందుకే వీటిని కాస్త రుద్ది, చింత చిగురు, మాసాల ముద్ద, మామిడి కాయ వేసి రకరకాలుగా వండుతారు. ముఖ్యంగా చింతచిగురు వేసి వండే చీరమీను కూర టేస్ట్ కోసం గోదావరి జిల్లాల ప్రజలు పడిగాపులు కాస్తుంటారు. అందుకే సైజులో చిన్నదైనా చీరమీను అంటే టేస్ట్ లో మాత్రం చాలా గొప్పదే.