హనుమంత వాహనంపై పద్మావతి అమ్మవారు
పట్టాభిరాముడి అలంకారంలో తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన ఆదివారం రాత్రి హనుమంత వాహనంపై శ్రీ పట్టాభిరాముడి అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు అభయమిచ్చారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7 నుండి వాహనసేవ సాగింది. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు. హనుమంతుడు శ్రీరామచంద్రునికి అనన్యభక్తుడు. త్రేతాయుగంలో శ్రీవారు శ్రీరాముడిగా అవతరించారు. ఆదిలక్ష్మి సీతగా మిథిలానగరంలో అవతరించి, స్వామిని వివాహమాడింది. భూదేవి అంశ అయిన వేదవతి కలియుగంలో పద్మావతిగా అవతరించింది. తన జాడను శ్రీవారికి తెలిపిన మహాభక్తుడైన ఆంజనేయుని కోరికను తీర్చడానికా అన్నట్టు అలమేలుమంగ బ్రహ్మోత్సవాలలో హనుమంతున్ని వాహనంగా చేసుకుంది. టిటిడి ఈవో శ్రీ శ్యామల రావు, జేఈవో శ్రీ వీరబ్రహ్మం కలిసి డిసెంబర్ 6న పద్మ సరోవరంలో జరుగనున్న పంచమి తీర్థం ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులు వచ్చేందుకు, తిరిగి వెళ్లేందుకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.