సిద్దరామయ్యతో ఎలాంటి విభేదాల్లేవు, పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేశా - డీకే శివకుమార్ క్లారిటీ
Siddaramaiah vs DK Shivakumar: సిద్దరామయ్యతో తనకు ఎలాంటి విభేదాల్లేవని డీకే శివకుమార్ తేల్చి చెప్పారు.
Siddaramaiah vs DK Shivakumar:
డీకే శివకుమార్ కామెంట్స్..
కర్ణాటక సీఎం రేసులో డీకే శివకుమార్, సిద్దరామయ్య ఉన్నారు. ఇద్దరూ కాంగ్రెస్‌కి కీలక నేతలే. అందుకే ఎవరిని ఆ కుర్చీలో కూర్చోబెట్టాలన్న సందిగ్ధంలో ఉంది హైకమాండ్. ఇది పక్కన పెడితే...ఇద్దరి నేతల మధ్య విభేదాలున్నాయన్న వాదనలూ వినిపించాయి. అందుకే...సీఎం పేరు ప్రకటించడంలో ఆలస్యమవుతోందనీ కొందరు ప్రచారం చేశారు. అయితే...ఈ పుకార్లకు డీకే శివకుమార్ చెక్ పెట్టారు. సిద్దరామయ్యతో విభేదాలున్నాయన్న ప్రచారాన్ని కొట్టి పారేశారు. అలాంటిదేమీ లేదని తేల్చి చెప్పారు. చాలా సందర్భాల్లో సిద్దరామయ్యకు మద్దతుగా నిలిచానని స్పష్టం చేశారు. పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేశానని వెల్లడించారు.
"సిద్దరామయ్యతో నాకు విభేదాలున్నాయని కొందరు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారు. కానీ...ఈ విషయంలో మీకో క్లారిటీ ఇస్తున్నాను. అలాంటి విభేదాలేవీ మా మధ్య లేవు. చాలా సార్లు నేను పార్టీ కోసం త్యాగాలు చేశాను. సిద్దరామయ్యకు నా ఫుల్ సపోర్ట్ ఇచ్చాను. ఆయనకు ఎప్పుడూ మద్దతుగా ఉన్నాను"
- డీకే శివకుమార్, కాంగ్రెస్ నేత
Some people say that I have differences with Siddaramaiah but I want to clear that there is no difference between us. Many times I have sacrificed for the party and stood with Siddaramaiah ji. I have given cooperation to Siddaramaiah: Karnataka Congress president DK Shivakumar pic.twitter.com/yUU3GKsGKQ
— ANI (@ANI) May 14, 2023
పోస్టర్లు..
శివకుమార్, సిద్దరామయ్య సపోర్టర్స్ మాత్రం సీఎం ఎవరు అవ్వాలనే అంశంపై ఎవరి వాదన వినిపిస్తున్నారు. "నెక్స్ట్ సీఎం" అంటూ ఎవరికి వాళ్లు ఇద్దరి నేతల ఫోటోలతో పోస్టర్లు తయారు చేసుకున్నారు. చాలా చోట్ల ఫ్లెక్సీలు కూడా కట్టారు. కొందరు సిద్దరామయ్యకు మద్దతునిస్తుండగా..మరికొందరు శివకుమార్‌కి సపోర్ట్ చేస్తున్నారు. బెంగళూరులోని శివకుమార్ ఇంటి బయట ఈ ఫ్లెక్సీలు, పోస్టర్లు కనిపిస్తుండటం ఆసక్తి కలిగిస్తోంది. ఆయననే సీఎంగా డిక్లేర్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అటు సిద్దరామయ్యకూ అదే స్థాయిలో మద్దతు ఉంది. ఆయన ఇంటి బయటా ఇలాంటి పోస్టర్లే వెలిశాయి.
ఇద్దరూ హేమాహేమీలే..
గత ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలతో.. డీకే శివకుమార్ పీసీసీ చీఫ్ బాధ్యతలు చేపట్టారు. అన్నీ తానై వ్యవహరించారు. పార్టీని నడిపించటంలో.. పార్టీ క్యాడర్ కు ఉత్సాహం నింపటంలో ముందున్నారు. కాంగ్రెస్ నుంచి చేజారిన నేతలను తిరిగి కాంగ్రెస్ వైపు తీసుకొచ్చారు. క్యాంప్ రాజకీయాల ఉచ్చులో చిక్కుకున్న వారిని సైతం ఒప్పించి తీసుకొచ్చారు. ఆయన మనీలాండరింగ్ కేసులు ఎదుర్కొన్నారు. జైలుకు కూడా వెళ్లి వచ్చారు. డీకే శివకుమార్ జైలులో ఉన్నప్పుడు సోనియాగాంధీ స్వయంగా జైలుకు వెళ్లి పరామర్శించి వచ్చారు. రాహుల్ గాంధీ పాదయాత్రను కర్ణాటక రాష్ట్రంలో విజయవంతం చేయటంలో డీకే శివకుమార్ పాత్ర కీలకం. ఇదే సమయంలో మాజీ సీఎం సిద్దరామయ్యను కూడా విస్మరించలేని విషయం. గతంలో ఆయన ఐదేళ్లు సీఎంగా చేసినప్పుడు చేసిన అభివృద్ధి కలిసొచ్చింది. మంచి మాటకారి.. వ్యూహ రచన చేయటంలో దిట్ట. బ్రాహ్మణ – వక్కలింగ – లింగాయత్ సామాజిక వర్గాలను ఒక్కతాటిపైకి తీసుకొచ్చి.. గత ఎన్నికల్లోనే కాదు.. ఈ ఎన్నికల్లోనూ ఆయన చేసిన ప్రయోగం ఫలించింది.
Also Read: Jagadish Shettar: నన్ను టార్గెట్ చేసి ఏం సాధించారు, డబ్బులు పంచి గెలిచారు - ఓటమిపై జగదీష్ షెట్టర్