Jagadish Shettar: నన్ను టార్గెట్ చేసి ఏం సాధించారు, డబ్బులు పంచి గెలిచారు - ఓటమిపై జగదీష్ షెట్టర్
Jagadish Shettar: ఎన్నికల్లో ఓడిపోవడంపై జగదీష్ షెట్టర్ స్పందించారు.
Jagadish Shettar:
షెట్టర్ ఓటమి..
కర్ణాటక ఎన్నికల (Karnataka Election 2023) ముందు బీజేపీకి చెందిన కీలక నేతలు కాంగ్రెస్‌లో చేరడమూ ఆ పార్టీకి షాక్ ఇచ్చింది. అయితే...బీజేపీ నుంచి వచ్చిన వారిలో మాజీ సీఎం జగదీష్ షెట్టర్ (Jagadish Shettar) కూడా ఒకరు. ఒకప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తించారు షెట్టర్. లింగాయత్ వర్గానికి చెందిన నేత అవ్వడం మరింత కీలకంగా మారింది. అయితే...కాంగ్రెస్ తరపున హుబ్బళి ధార్వాడ్ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు జగదీష్. కచ్చితంగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేసినా...ఓడిపోయారు. ఇదే నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిపై పోటీ చేసిన ఆయన...34 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఈ ఫలితాలపై ఆయన స్పందించారు. డబ్బు పంచకపోవడం వల్లే తాను ఓడిపోయానని అన్నారు. అయినా...బీజేపీ నుంచి వచ్చేయడం వల్ల కాంగ్రెస్‌కి లింగాయత్‌ల మద్దతు పెరిగిందని..ఈ కారణంగా అదనంగా 20-25 సీట్లు వచ్చాయని చెప్పారు షెట్టర్. ప్రత్యర్థి ఓటర్లకు భారీగా డబ్బు పంచారని ఆరోపించారు. బిజినెస్‌మేన్‌లు ఎన్నికల ఫలితాల్ని ప్రభావితం చేశారని అన్నారు.
"నేను ఆరు సార్లు ఎన్నికల్లో పోటీ చేశాను. కానీ ఎప్పుడూ డబ్బు పంచలేదు. తొలిసారి బీజేపీ అభ్యర్థి భారీగా డబ్బులు పంచడం చూశాను. ఓటర్లందరికీ రూ.500,1000 నోట్లు పంచారు. ఫలితాలకు వారం రోజులు ముందుగానే చెబుతూ వచ్చాను. కాంగ్రెస్‌కి 130-140 సీట్లు పక్కాగా వస్తాయని చెప్పాను. కన్నడ ఓటర్ల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. హుబ్బళిలో ఎంతో మంది బిజినెస్‌మేన్‌లు, ఇండస్ట్రియలిస్ట్‌లు ఎన్నికల ఫలితాలను శాసించారు"
- జగదీశ్ షెట్టర్, కాంగ్రెస్ నేత
#WATCH | Congress leader and candidate from Hubli-Dharwad-Central, Jagadish Shettar speaks on his defeat in the Karnataka Assembly Elections. Says, "Money power has played a very important role." (13.05) pic.twitter.com/F8bzqyV74m
— ANI (@ANI) May 14, 2023
భారీ మెజార్టీతో గెలుస్తానని ఫలితాల ముందు చాలా ధీమాగా చెప్పారు జగదీష్. కానీ...ఫలితాలు మాత్రం ఊహించనట్టుగా రాలేదు. అయినా..బీజేపీపై విమర్శలు చేయడం మానలేదు షెట్టర్. తనను బయటకు పంపించి ఆ పార్టీ ఏం సాధించిందని ప్రశ్నించారు.
"బీజేపీ నేతలంతా నన్ను టార్గెట్ చేశారు. వాళ్లు అందుకలా చేశారో తెలియదు. కానీ ఇప్పుడు పూర్తిగా రాష్ట్రాన్నే కోల్పోయారు. దీంతో వాళ్లు ఏం సాధించినట్టు..? జగదీష్ షెట్టర్‌ని ఓడించడమే వాళ్ల లక్ష్యమా..?"
- జగదీశ్ షెట్టర్, కాంగ్రెస్ నేత
బీజేపీకి రాజీనామా చేసిన సమయంలో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు షెట్టర్. తనను పార్టీ ఏ మాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు.
"పార్టీని వీడటం మనసుకు భారంగా ఉంది. కర్ణాటకలో బీజేపీ బలం పుంజుకునేలా చేయడంలో కీలక పాత్ర పోషించాను. కానీ వాళ్లు మాత్రం నేను రాజీనామా చేసే పరిస్థితులు తీసుకొచ్చారు. నన్నింకా పూర్తిగా అర్థం చేసుకోలేదు."
- జగదీశ్ షెట్టర్
Also Read: Karnataka Assembly Election 2023: మా ఓటమిని అంగీకరిస్తున్నాం, EVMలపై నిందలు వేయం - హిమంత బిశ్వ శర్మ