Russia Ukraine Conflict: మరో పదేళ్లలో రష్యా పని ఖతం, సంచలనం సృష్టిస్తున్న సర్వే
Russia Ukraine Conflict: పదేళ్లలో రష్యా పూర్తిగా పతనం అవుతుందని ఓ సర్వే స్పష్టం చేసింది.
Russia Ukraine Conflict:
పతనం తప్పదు..
రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఏడాదిగా కొనసాగుతూనే ఉంది. ఏ దేశమూ వెనక్కి తగ్గడం లేదు. రెండు వైపులా ఆస్తినష్టం వాటిల్లుతోంది. చర్చలకు రెడీ అని పైకి అంటున్నా..ఆ వాతావరణమే కనిపించడం లేదు. అయితే...ఈ యుద్ధం కారణంగా ఎక్కువగా నష్టపోతోంది రష్యానే అని ఇప్పటికే పలు నివేదికలు స్పష్టం చేశాయి. మరో సంచలన రిపోర్ట్ వెలుగులోకి వచ్చింది. యుద్ధం కొనసాగే కొద్ది రష్యా మరింత పతనం అవుతుందని తేల్చి చెప్పింది. Global Strategist and Analyst సర్వే ప్రకారం అంతర్జాతీయ సమాజం ముందు రష్యా ఓ "ఫెయిల్యూర్ నేషన్"గా నిలబడాల్సి వస్తుందని వెల్లడించింది. ఇప్పట్లో ఈ యుద్ధం ఆగే సూచనలు కనిపించడం లేదని స్పష్టం చేసింది. అంతే కాదు. ఇదే పరిస్థితి కొనసాగితే పదేళ్లలో రష్యా పూర్తిగా పతనమైపోతుందని సంచలన విషయం చెప్పింది. అప్పటికి రష్యా వైభవమంతా పోతుందని తెలిపింది. ఉక్రెయిన్‌తో యుద్ధానికి దిగి రష్యా తనకు తానుగా సమస్యలు తెచ్చి పెట్టుకుంటోందనిపేర్కొంది. ఈ వైఖరి మార్చుకోకపోతే మరో పదేళ్లలో పతనం తప్పదని జోస్యం చెప్పింది. అట్లాంటిక్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈ సర్వే జరిగింది. 2033 నాటికి రష్యా పతనం తప్పదని దాదాపు 46% మంది ఈ సర్వేలో అనుకూలంగా ఓటు వేశారు. ఈ యుద్ధం కారణంగా గతేడాదితో పోల్చి చూస్తే...ఉక్రెయిన్ ఆర్థికంగా 30% మేర పతనమైనట్టు తేలింది.
రష్యాను నమ్మం: ఉక్రెయిన్
రష్యాను నమ్మడానికి వీల్లేదు అంటున్నారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ. క్రిస్మస్ సందర్భంగా పుతిన్ కాల్పుల విరమణ నిర్ణయం తీసుకున్నారని రష్యా వెల్లడించింది. ఉక్రెయిన్‌లో ఎక్కడా కాల్పులు జరపడానికి వీల్లేదని పుతిన్ ఆదేశించినట్టు చెప్పింది. జనవరి 6న (నేడు) దాదాపు 12 గంటల పాటు గన్ ఫైరింగ్ చేయకూడదని పుతిన్ చెప్పారని, అందుకే ఈ నిర్ణయం అమలు చేస్తున్నామని రష్యా ప్రతినిధులు స్పష్టం చేశారు. జనవరి 6, 7వ తేదీల్లో రష్యాతో పాటు ఉక్రెయిన్‌లోనూ క్రిస్టియన్లు క్రిస్‌మస్ వేడుకలు చేసుకుంటారు. రష్యన్ ఆర్థోడాక్స్ చర్చ్ హెడ్ విజ్ఞప్తి రష్యా ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై జెలెన్‌స్కీ మండి పడ్డారు. ఇది సానుభూతితో చేసిన పనేమీ కాదని... అదనపు బలగాలను మొహరించేందుకు...విరామం తీసుకున్నారని, దానికి కాల్పుల విరమణ అని పేరు పెట్టారని విమర్శించారు. "తూర్పు డాన్‌బాస్ ప్రాంతంలో మా ఆధిపత్యాన్ని అణిచేందుకు అదనపు బలగాలు, ఆయుధాలు సమకూర్చుకుంటున్నారు. దీనికి కాల్పుల విరమణ అని కవర్ చేస్తున్నారు" అని ఆరోపించారు.
దీని వల్ల కలిగే ప్రయోజనమేమీ లేదని, మళ్లీ రష్యా దాడులు కొనసాగుతాయని..ఎంతో మంది ప్రాణాలు కోల్పోతారని అసహనం వ్యక్తం చేశారు జెలెన్‌స్కీ. రష్యా చెప్పే మాటలు నమ్మలేమని ఉక్రెయిన్ మండి పడుతోంది. దాదాపు 50 వేల మంది సైనికులను యుద్ధ రంగంలో మొహరించినట్టు పుతిన్ ఇప్పటికే ప్రకటించారు. మరో రెండున్నర లక్షల మందిని సిద్ధం చేసి ఎప్పుడైనా ఉక్రెయిన్‌ను ఆక్రమిస్తామన్న సంకేతాలిస్తున్నారు. అయితే...ఇప్పుడు శీతాకాలం కావడం వల్ల యుద్ధరీతిలో ఎన్నో మార్పులు వచ్చే అవకాశముందంటున్నారు నిపుణులు. ఇప్పటికే రష్యన్ సైనికులు చలి కారణంగా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారన్న వార్తలు వస్తున్నాయి.
Also Read: User Names In Twitter: ట్విటర్ యూజర్ నేమ్స్ ఫర్ సేల్, ఆన్‌లైన్‌లో వేలం పెడతారట!