CBI Caged Parrot : సీబీఐని రాజకీయ పంజరం నుంచి వదిలి పెట్టాలన్న మద్రాస్ హైకోర్ట్..!
ఎఫ్‌బీఐ, స్కాట్లాండ్ యార్డ్ తరహాలో సీబీఐకి స్వతంత్ర ప్రతిపత్తి, వనరులు కల్పించాలని మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ ఆదేశించింది. పంజరం నుంచి వదిలి పెట్టాలని వ్యాఖ్యలు చేసింది.
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ( సీబీఐ )ని పంజరంలో చిలుకగా మద్రాస్ హైకోర్టు ముధురై బెంచ్ వ్యాఖ్యానించింది. ఆ చిలుకను పంజరం నుంచి వదిలి.. నిష్పాక్షికంగా పని చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. కాగ్, ఎన్నికల కమిషన్ తరహా సీబీఐకి కూడా స్వతంత్ర ప్రతిపత్తి కల్పించాలని...ప్రభుత్వ పాలనాపరమైన నియంత్రణ ఉండటం వల్ల నిష్పాక్షికంగా దర్యాప్తు చేయడం లేదన్న అభిప్రాయాన్ని మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. సాధ్యమైనంత త్వరగా సీబీఐకి స్వతంత్ర ప్రతిపత్తి అధికారాలు కల్పించాలని ప్రభుత్వ కార్యదర్శితో సమానమైన అధికారాలను సీబీఐ డైరెక్టర్‌కు కల్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. సీబీఐ డైరెక్టర్ నేరుగా ప్రధాన మంత్రికి జవాబుదారీగా ఉండాలని .. అమెరికాలోని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, యూకేలోని స్కాట్లాండ్ యార్డ్ వంటి వ్యవస్థలతో సమానంగా ఆధునిక సదుపాయాలు కల్పించాలని కూడా సిఫార్సు చేసింది.
ఓ చిట్ ఫండ్ స్కాంను సీబీఐతో దర్యాప్తు చేయించాలన్న దాఖలైన పిల్‌పై హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. సీబీఐతో దర్యాప్తును మొదటి సారి నిరాకరించింది. ఆ స్కాంను ఆర్థిక నేరాల విభాగం దర్యాప్తు చేస్తోంది. సీబీఐకి చాలా పరిమితమైన మ్యాన్ పవర్.. వనరులు ఉన్నాయని ఇలా అన్ని కేసులను సీబీఐకి అప్పగిస్తూ పోతే దర్యాప్తు చేయలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సీబీఐ స్వరూప స్వభావాలను మార్చడానికి మొత్తం పన్నెండు సూచలను తీర్పులో న్యాయమూర్తులు చేశారు. ఆరు వారాల్లోగా కేంద్రానికి ప్రతిపాదన పంపాలని సీబీఐ చీఫ్‌ని కోర్టు ఆదేశించింది. ప్రతిపాదన అందిన మూడు నెలల్లోగా ఈ అంశంపై ఉత్తర్వులు జారీ చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. సీబీఐని "పంజరంలో చిలుక"గా సుప్రీంకోర్టు 2013 మే నెలలో అభివర్ణించింది. బొగ్గు క్షేత్రాలకు లైసెన్సుల కేటాయింపులకు సంబంధించిన కేసులో ఈ వ్యాఖ్యలు చేసింది.
ఇప్పుడు మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ అదే తరహా వ్యాఖ్యలు చేసింది. సీబీఐ అధికారంలో ఉండే పార్టీలకు రాజకీయ పరమైన ఆయుధంగా మారిందన్న ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. ఇటీవల సుప్రీంకోర్టు కూడా న్యాయమూర్తులపై శారరీక, మానసిక దాడులకు పాల్పడుతున్న వారి విషయంలో న్యాయవ్యవస్థకు కూడా సీబీఐ, ఐబీ లాంటి సంస్థలు సహకరించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పుడు మరోసారి మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ ధర్మాసనం వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యే అవకాశం ఉంది. సీబీఐకి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించాలని.. ఆధునిక సౌకర్యాలు సమకూర్చాలనే డిమాండ్లు చాలా కాలంగా ఉన్నాయి. కానీ సీబీఐకి చాలా పరిమితమైన వనరులే ఉంటాయి. అందుకే సీబీఐవద్ద కొన్ని వందల కేసులు పెండింగ్‌లో ఉంటూ ఉంటాయి.