Weather Report: తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజులు వర్షాలు.. ఆ ఐదు జిల్లాల వారికి అలెర్ట్..
దక్షిణ ఛత్తీస్‌గఢ్, ఒడిశాలలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రల్లో రానున్న మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రాలు తెలిపాయి.
తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. పలు ప్రాంతాల్లో వర్షం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. ఇదే పరిస్థితి మరో మూడు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
దక్షిణ ఛత్తీస్‌గఢ్, ఒడిశాలలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో మరో నాలుగు రోజుల పాటు కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. శ్రీకాకుళం, తూర్పు గోదావరి, విజయనగరం, విశాఖ, పశ్చిమ గోదావరి జిల్లాలో భారీగా వర్షం కురిసే అవకాశముందని పేర్కొంది. మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఏపీలో మరో నాలుగు రోజులు..
దక్షిణ ఛత్తీస్‌గఢ్, ఒడిశాలలో ఏర్పడిన అల్పపీడనం మరో రెండు రోజుల్లో పశ్చిమ వాయవ్య దిశ వైపు మళ్లే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ప్రభావం వల్ల శ్రీకాకుళం, తూర్పు గోదావరి, విజయనగరం, విశాఖ, పశ్చిమ గోదావరి జిల్లాలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నట్లు వెల్లడించింది. రేపు కోస్తాంధ్రలో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లోనూ అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
తెలంగాణలో మరో మూడు రోజులు..
రానున్న మూడు రోజులు తెలంగాణలోని పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ, రేపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల 11న ఉత్తర, పరిసర మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని చెప్పింది.