Ratna Bhandar Reopens: తెరుచుకున్న రత్న భాండాగారం తలుపులు, అధికారికంగా ప్రకటించిన ప్రభుత్వం
Ratna Bhandar: రత్న భాండాగారం తలుపులు తెరిచినట్టు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మొత్తం 11 మంది సిబ్బంది రంగంలోకి దిగి ఈ ప్రక్రియ చేపడుతోంది.
Ratna Bhandar Reopened: దేశమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పూరీ ఆలయంలోని రత్న భాండాగారం తలుపులు తెరుచుకున్నాయి. 1.28 గంటలకు ఈ ప్రక్రియ ప్రారంభం కాగా రహస్య గది తలుపులు తెరిచినట్టు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. 11 మంది సిబ్బంది రంగంలోకి దిగి ఈ ప్రక్రియ చేపట్టింది. 46 ఏళ్ల తరవాత మళ్లీ భాండాగారాన్ని తెరవడం ఆసక్తికరంగా మారింది. ఆలయంలో సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ముందుగానే ఏర్పాట్లు చేశారు అధికారులు. ఆభరణాలను లెక్కింపు ప్రక్రియనంతా డిజిటలైజ్ చేయనున్నారు.
నిధిని మరో చోటకు తరలించేందుకు ఆరు భారీ చెక్క పెట్టెలు తీసుకెళ్లారు.
Odisha | Ratna Bhandar of Sri Jagannath Temple in Puri re-opened today after being closed for 46 years. https://t.co/a5umQ8I7wz pic.twitter.com/BxgT8yDaxD
— ANI (@ANI) July 14, 2024
ఒడిశా హైకోర్టు మాజీ జడ్జ్ బిశ్వనాథ్ రథ్, శ్రీ జగన్నాథ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ అరబింద పాధీతో పాటు ASI సూపరింటెండెంట్ లోపలికి వెళ్లారు. వీళ్లతో పాటు నలుగురు ఆలయ సహాయకులూ వెళ్లినట్టు అధికారులు వెల్లడించారు. ఈ భాండాగారం తలుపులు తెరిచే ముందు "ఆజ్ఞ" పేరుతో ప్రత్యేకంగా ఓ పూజా కార్యక్రమం నిర్వహించారు. డిజిటల్ డాక్యుమెంటేషన్ తరవాత లోపలి నిధిని వేరే చోటకు తరలించనున్నారు. 1978లో తొలిసారి ఈ భాండాగారాన్ని తెరిచారు. ఆ సమయంలో లోపల ఉన్న సంపదను లెక్కించేందుకు 70 రోజుల సమయం పట్టింది. బంగారం, వెండితో పాటు వజ్రాలనూ గుర్తించారు. వీటన్నింటిని లెక్కించి ఓ జాబితా రూపొందించారు. ఈ సారి లోపలి సంపదను లెక్కించేందుకు ఎన్ని రోజుల సమయం పడుతుందోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది. అసలు లోపల ఏమున్నాయన్న ఆసక్తీ పెరుగుతోంది. అయితే..అక్కడి ఆభరణాలన్నింటినీ పెట్టెల్లో భద్రపరిచేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మరమ్మతులు పూర్తయ్యేంత వరకూ వాటిని వేరే చోట ఉంచాలని నిర్ణయించారు.
#WATCH | Odisha | Ratna Bhandar of Sri Jagannath Temple in Puri re-opened today after 46 years.
— ANI (@ANI) July 14, 2024
Visuals from outside Shri Jagannath Temple. pic.twitter.com/BzK3tfJgcA
గదిలో విషనాగులు ఉంటాయని, నాగ బంధనం ఉందని రకరకాల ప్రచారాలు జరిగాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. స్నేక్ క్యాచర్స్‌ని అందుబాటులో ఉంచింది. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరిగినా వెంటనే చికిత్స అందించేందుకు వీలుగా వైద్యులనూ తీసుకెళ్లింది. అంతకు ముందు ఈ తలుపులు తెరిచేందుకు ఓ SOPని అనుసరించాలని తేల్చిచెప్పింది. ఈ SOPపై ఆలయ కమిటీ కూడా ఆమోదం తెలిపింది. ఈ ఆదేశాల మేరకే ప్రక్రియను కొనసాగించారు. అంతకు ముందు ఈ గది తాళం గురించి కూడా పెద్ద ఎత్తున వివాదం తలెత్తింది. ఒరిజినల్ కీ మిస్ అవడంపై బీజేపీ తీవ్రంగా మండి పడింది. అయితే..తమ వద్ద డూప్లికేట్ తాళం ఉందని వెల్లడించింది. అనవసరంగా రాజకీయం చేయొద్దని విమర్శించింది. ఇప్పుడు బీజేపీయే అధికారంలోకి రావడం వల్ల పూరి జగన్నాథ ఆలయంలోని ఈ మిస్టరీని ఛేదించే పనిలో పడింది.