Bihar Elections : ఎన్నికల్లో పోటీకి ప్రశాంత్ కిషోర్ వెనుకడుగు - పార్టీ అభ్యర్థుల కోసం పని చేస్తానని ప్రకటన- ముందే చేతులెత్తినట్లేనా ?
Prashant Kishor: ప్రశాంత్ కిషోర్ బీహార్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు. తన పార్టీ తరపున నిలబడే అభ్యర్థుల కోసం పనిచేస్తానన్నారు. పార్టీ నిర్ణయమే దీనికి కారణం అని చెప్పుకొచ్చారు.

Prashant Kishor Janasuraj Party: జన సురాజ్ పార్టీ అధ్యక్షుడు , ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించారు. ఈ నిర్ణయం తన పార్టీ సభ్యుల సూచన మేరకు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టలేకపోవచ్చని అన్నారు.
పార్టీ సభ్యులు నేను ఇతర అభ్యర్థుల విజయం కోసం కృషి చేయాలని నిర్ణయించారు. అందుకే నేను ఎన్నికల్లో పోటీ చేయట్లేదు అని ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. . పార్టీ నా పోటీని నిరాకరించింది. అందుకే రఘోపూర్ నియోజకవర్గం నుంచి మరొక అభ్యర్థిని ప్రకటించాం. ఇది పార్టీ పెద్ద లక్ష్యాల కోసం తీసుకున్న నిర్ణయం. నేను పోటీ చేస్తే, సంస్థాగత పనుల నుంచి దృష్టి మళ్లుతుంది అని చెప్పుకొచ్చారు.
ప్రశాంత్ కిషోర్ 2024 అక్టోబర్‌లో జన సురాజ్ పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆయన బీహార్‌లో చురుకైన రాజకీయ కార్యకలాపాలతో అందరి దృష్టిని ఆకర్షించారు. రఘోపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని అనుకున్నారు. ఆ నియోజకవర్గం నుంచి రాష్ట్రీయ జనతా దళ్ (RJD) నాయకుడు తేజస్వీ యాదవ్ పోటీ చేస్తున్నారు. అయితే, ఆయన పేరు అభ్యర్థుల జాబితాలో లేకపోవడంతో, జన సురాజ్ పార్టీ రఘోపూర్ నుంచి స్థానిక వ్యాపారవేత్త చంచల్ సింగ్‌ను నిలబెట్టింది.
ఎన్నికల్లో గెలిస్తే బీహార్‌లో అవినీతికి వ్యతిరేకంగా గట్టి చర్యలు తీసుకుంటామని ప్రశాంత్ కిషోర్ హామీ ఇచ్చారు. భూ మాఫియా, ఇసుక తవ్వకం మాఫియా , ఇతర మాఫియాలను నిర్మూలిస్తాం. మద్యపాన నిషేధ విధానాన్ని రద్దు చేస్తాం అని ఆయన తెలిపారు. అంతేకాక, అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే 100 మంది అవినీతి రాజకీయ నాయకులు , ఉన్నతాధికారుల అక్రమ సంపదను జప్తు చేస్తామని కిషోర్ ప్రతిజ్ఞ చేశారు.
VIDEO | EXCLUSIVE: "No, I won't contest. Party has decided... I will continue to do the work I have been doing in the party. I will continue with the organisational work for the larger interest of the party," Jan Suraaj (@PrashantKishor) founder Prashant Kishor said responding to… pic.twitter.com/aYpbz9mpth
— Press Trust of India (@PTI_News) October 15, 2025
ప్రశాంత్ కిషోర్ గతంలో బీహార్‌లో జేడీ(యూ), బీజేపీ, ఆర్జేడీ వంటి పలు పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశారు. ఆయన ఎన్నికల ఫలితాలను ఖచ్చితంగా అంచనా వేయడంలో మంచిపేరు తెచ్చుకున్నారు. 2024లో జన సురాజ్ పార్టీ స్థాపనతో ఆయన సొంత రాజకీయ గుర్తింపును నిర్మించుకునే ప్రయత్నంలో ఉన్నారు. బీహార్ ఎన్నికల్లో ఆయన పార్టీ ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా ఉంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు రానున్న వారాల్లో జరగనున్నాయి. జన సురాజ్ పార్టీ తమ అభ్యర్థుల ఎంపిక, ప్రచారంలో చురుకుగా పాల్గొంటోంది. కిషోర్ పోటీ నుంచి తప్పుకోవడం ద్వారా పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించి, ఇతర అభ్యర్థుల విజయానికి కృషి చేయనున్నారు.





















