CM Jagan Nellore Tour: సీఎం పర్యటనకు భారీ బందోబస్తు, వామపక్ష నేతల హౌస్ అరెస్ట్
మరికాసేపట్లో సీఎం జగన్ నెల్లూరు జిల్లాకు వస్తారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే జగన్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.
మరికాసేపట్లో సీఎం జగన్ నెల్లూరు జిల్లాకు వస్తారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే జగన్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను జిల్లా ఎస్పీ విజయరావు పర్యవేక్షించారు.
సిబ్బంది కేటాయింపు ఇలా..
ఏఎస్పీలు -4
డీఎస్పీలు -4
సీఐలు - 31
ఎస్సైలు - 96
ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు - 285
కానిస్టేబుళ్లు - 465
మహిళా పోలీస్ స్టాఫ్ -109
హోం గార్డ్ లు – 192
వీరితోపాటు ఏఆర్ కానిస్టేబుళ్లు, స్పెషల్ పార్టీ సిబ్బంది బందోబస్తు విధుల్లో నిమగ్నమయ్యారు. గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమవర్మ భద్రతా ఏర్పాట్లపై ఎస్పీ విజయరావుతో సమీక్షించారు. పర్యటన ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు.
సీఎం జగన్ పర్యటన ఇలా..
ఉదయం 9:30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రయాణం
ఉదయం 10:55 గంటలకు కృష్ణపట్నం వద్ద హెలిప్యాడ్ కి చేరిక
11:10 గంటల నుంచి మధ్యాహ్నం 1:10 గంటల వరకు నేలటూరులో పర్యటన
1.10నుంచి బహిరంగ సభ
సాయంత్రం 3.30 గంటలకు తాడేపల్లి నివాసానికి జగన్ చేరిక
ఏపీ ప్రభుత్వం నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరు గ్రామంలో దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. మొత్తం మూడు యూనిట్లతో ఇది పూర్తి కావాల్సి ఉంది. ఈ ప్రాజెక్టు తొలి యూనిట్ ను 2015లో అప్పటి సీఎం చంద్రబాబు, అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. 20వేల కోట్ల రూపాయల ఖర్చుతో ఈ ప్రాజెక్టు నిర్మించారు. ఇందులో మొత్తం మూడు యూనిట్లు ఉండగా ఒక్కో యూనిట్ 800 మెగావాట్ల చొప్పున విద్యుత్ ఉత్పత్తి చేసే లక్ష్యంతో తయారు చేశారు. ప్రస్తుతం రెండు యూనిట్లు పనిచేస్తున్నాయి. మూడో యూనిట్ పనులు కూడా పూర్తికావడంతో సీఎం జగన్ చేతుల మీదుగా జాతికి అంకితం చేయబోతున్నారు.
అయితే థర్మల్ పవర్ ప్లాంట్ మూడో యూనిట్ ని జాతికి అంకితం చేసిన తర్వాత దాన్ని ప్రైవేటుపరం చేయబోతున్నారు. ఈ ప్లాంట్ ప్రైవేటుపరం చేయొద్దని ఉద్యోగులు కోరుతున్నారు. వీరికి మద్దతుగా వామపక్షాలు ఉద్యమం మొదలు పెట్టాయి. జనసేన, టీడీపీ కూడా వారికి మద్దతిస్తున్నాయి. ఉత్పత్తి వ్యయం పెరుగుతోందన్న కారణంతో ప్రాజెక్ట్ ని లీజుకి ఇచ్చేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదంటున్నారు ఉద్యమ నాయకులు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎన్టీపీఎస్, ఆర్టీపీఎస్, నాగార్జున సాగర్, శ్రీశైలం విద్యుత్ కేంద్రాలు సమర్థంగా నడుస్తున్నా.. దామోదరం సంజీవయ్య పవర్ ప్లాంట్ ని ఎందుకు ప్రైవేటు పరం చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్షాల ఉద్యమ నేపథ్యంలో ఎలాంటి గొడవలు జరగకుండా ఈ కార్యక్రమం ప్రశాంతంగా ముగించాలని అధికారులు హడావిడి పడుతున్నారు. సీఎం జగన్ పర్యటన సందర్భంగా ఈరోజు కొంతమంది వామపక్షాల నేతల్ని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. బందోబస్తు విధుల్లో పోలీసులు అలర్ట్ గా ఉండాలని సూచించారు జిల్లా ఎస్పీ. కేవలం ముఖ్యమైన నేతల్ని మాత్రమే జగన్ సభావేదికపైకి అనుమతిస్తున్నారు. సభకు వచ్చేవారి విషయంలో కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సభలో ఎక్కడా నినాదాలు కానీ, గొడవలు కానీ జరక్కుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.