Netannaku Cheyutha: నేతన్నకు చేయూతతో 35 వేల మందికి లబ్ధి.. రేపు జమ కానున్న డబ్బు..
నేతన్నకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'నేతన్నకు చేయూత’ పథకంలో భాగంగా అర్హులైన వారి బ్యాంకు ఖాతాల్లో రేపటి నుంచి డబ్బు జమ కానుంది. ఈ కార్యక్రమం ద్వారా 35 వేల మందికి లబ్ధి కలుగుతుంది.
నేతన్నలకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'నేతన్నకు చేయూత’ పథకంలో భాగంగా అర్హులైన వారి బ్యాంకు ఖాతాల్లో రేపటి (సెప్టెంబర్ 1) నుంచి డబ్బు జమ కానుంది. ఈ కార్యక్రమం ద్వారా 35 వేల మంది నేతన్నలకు లబ్ధి కలుగుతుంది. నేతన్నల పొదుపుకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఇప్పటికే పూర్తి అయింది. ఇటీవలే ప్రభుత్వం తమ వాటా కింద రూ.30 కోట్లను సైతం విడుదల చేసింది.
'నేతన్నకు చేయూత’ పథకంలో భాగంగా అర్హులైన నేతన్నల బ్యాంకు ఖాతాల్లో సెప్టెంబర్ 1 నుంచి డబ్బు జమ చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం. 35 వేలమంది నేత కార్మికులకు కలగనున్న ప్రయోజనం. pic.twitter.com/Oqdi9OpYHh
— TRS Party (@trspartyonline) August 31, 2021
ఈ పథకం ద్వారా కార్మికుడు పొదుపు చేసుకున్న సొమ్మును మూడేళ్ల తర్వాత (2024లో) తీసుకునే వీలు కల్పించారు. కార్మికుడు పొదుపు చేసే 8 శాతం వేతన వాటాకు రెట్టింపుగా ప్రభుత్వం సాయం అందిస్తోంది. అంటే 8 శాతానికి అదనంగా 16 శాతం వాటా ఇస్తోంది. తెలంగాణలో 25 వేల మంది చేనేత కార్మికులు, 10 వేల మంది పవర్‌లూమ్ కార్మికులు కలిపి మొత్తం 35000 మందికి ఈ పొదుపు పథకం వర్తిస్తుంది. రాష్ట్ర ఏర్పాటుకు ముందు చేనేత కార్మికులకు మాత్రమే ఈ పథకం వర్తించింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన అనంతరం చేనేత కార్మికులతో పాటు చేనేత రంగానికి అనుబంధంగా పనిచేసే రంగుల అద్దకం కార్మికులు, డిజైనర్లు, వీవర్లు, వైండర్లు వంటి వారికి సైతం పథకం వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది.
2017లో ప్రారంభం..
నేతన్నకు చేయూత పథకాన్ని 2017 జూన్ 24న ప్రభుత్వం ప్రారంభించింది. తొలుత మూడేళ్ల కాలపరిమితితో ఈ పథకాన్ని ఆరంభించింది. అయితే ఈ పథకం తమకు ఎంతో మేలు చేసిందని, పునఃప్రారంభించాలని చేనేత కార్మికులు మంత్రి కేటీఆర్ ను కోరారు. దీంతో దీనిపై సమీక్ష నిర్వహించిన కేటీఆర్.. పథకాన్ని తిరిగి ప్రారంభించేందుకు ప్రతిపాదించారు. దీనికి సీఎం కేసీఆర్ ఆమోదం తెలపడంతో జూన్ 14వ తేదీన దీనిని మళ్లీ ప్రారంభించారు.