RK Resigned: వైఎస్‌ఆర్‌సీపీకి, మంగళగిరి ఎమ్మెల్యే పదవికి ఆళ్ల రామకృష్ణా రెడ్డి రాజీనామా
RK Resigned: వైఎస్‌ఆర్‌సీపీకి ఆళ్ల రామకృష్ణా రెడ్డి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. ఆయన తన రిజైన్ లెటర్‌ను పార్టీ అధ్యక్షుడికి, స్పీకర్ తమ్మినేనికి పంపిచారు.
Alla Ramakrishna Reddy Resigned: అమరావతి వైసీపీ రాజకీయాల్లో మరో మలుపు తీసుకుంది. పార్టీలో కీలక వ్యక్తిగా ఉన్న వైఎస్‌ఆర్‌సీపీ ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు. ఇది ఆ ప్రాంతంలోనే కాకూండా తెలుగు రాష్ట్రాల్లోనే హాట్ ఆఫ్ ది టాపిక్ అయింది. ఉన్నట్టుండి ఆర్కే రాజీనామా చేయడం పార్టీలో ఏం జరుగుతుందనే చర్చ మొదలైంది.
ఆర్కే మొదటి నుంచి జగన్‌కు నమ్మిన బంటు లాంటి నాయకుడు. రెండుసార్లు మంగళగిరి నుంచి విజయం సాధించారు. రెండోసారి టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌ను ఓడించి సంచలనం సృష్టించారు. అతి తక్కువ మెజార్టీతో విజయం సాధించినా లోకేష్‌ను ఓడించడం అప్పట్లో చర్చనీయాంశమైంది.
అలాంటి వ్యక్తి ఇప్పుడు సడెన్‌గా పార్టీకి రాజీనామా చేయడం రాజకీయ సంచలనంగా మారింది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ లెటర్‌ను స్పీకర్ తమ్మినేని సీతారామ్‌కు పంపించారు. పార్టీ పదవికి కూడా రాజీనామా చేస్తూ మరో లెటర్‌ను పార్టీ అధ్యక్షుడు జగన్‌కు పంపించారు.
మంగళగిరిలో అనూహ్య మార్పులు
వైనాట్ 175 అంటున్న వైసీపీ మంగళగిరిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. దీనికి తోడు అక్కడ నారా లోకేష్ టీడీపీ తరఫున పోటీ చేస్తుండటం కూడా ఈ సీటును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకే ఈ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లో చేజారిపోకుండా జాగ్రత్తపడుతోంది. ఇందులో భాగంగానే అక్కడి అభ్యర్థిని వైసీపీ మార్చబోతోందని ఎప్పటి నుంచో చర్చ నడుస్తోంది. ఆర్కే కూడా చాలాసార్లు ఈ విషాయంపై స్పష్టత ఇచ్చారు. అక్కడ ఎవరికి సీటు ఇచ్చినా గెలిపించుకుంటామన్నారు.
వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా
రాజీనామాపై ప్రెస్‌మీట్ పెట్టిన ఆళ్ల రామకృష్ణారెడ్డి చాలా సింపుల్‌గా తేల్చేశారు. తనకు రెండుసార్లు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించిన జగన్‌కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని అన్నారు. వ్యక్తిగత కారణాలతోనే పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్టు పేర్కొన్నారు.