Major setback for Maoists:మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ, అగ్రనేత హిడ్మా గ్రామాన్ని స్వాధీనం చేసుకున్న బలగాలు
Hidma village: మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ. అగ్రనేత హిడ్మా గ్రామాన్ని స్వాధీనం చేసుకున్న బలగాలు మావోయి స్టులు పండిస్తున్న పంటలను, వారి నివాసాలను కూడా తమ అధీనంలోకి తీసుకున్నారు.
Major Setback For Maoists: మావోయిస్టుల(Maoists)కు భారీ ఎదురు దెబ్బతగిలింది. ఒక రకంగా చెప్పాలంటే.. వారి కంచుకోట బద్దలైంది. ఛత్తీస్‌గఢ్(Chattisghar)లో గత ఏడాది జరిగిన అసెంబ్లీ(Assembly) ఎన్నికల్లో బీజేపీ(BJP) అధికారంలోకి వచ్చింది. వచ్చీ రావడంతోనే రాష్ట్రానికి సవాలుగా మారిన మావోయిస్టులపై వ్యూహం ప్రకారం ముందుకు కదలింది. మావోయిస్టుల ఆయువుపట్టు, వారికి కంచుకోటగా భావించే బీజాపూర్(Bijapur) జిల్లాలోని పూర్వి(Purvi) గ్రామాన్ని కేంద్ర బలగాలు తాజాగా స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు.. ఇక్కడ జాతీయ పతాకాన్ని(National Flag) కూడా ఎగురవేశారు. ఇది ఒక రికార్డని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ప్రకటించుకుంది. సుమారు 40 ఏళ్లకుపైగానే ఈ గ్రామాన్ని.. స్వాధీనం చేసుకోవాలని కేంద్ర బలగాలు ప్రయత్నిస్తున్నాయి. అయితే.. ఎప్పటకప్పుడు వారికి ఎదురు దాడులు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఒకసారి 70 మంది, తర్వాత 25 మంది మావోయిస్టుల దాడుల్లో చనిపోయారు. గత నెల జనవరిలో కూడా పూర్వి గ్రామాన్నిస్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించిన బలగాలకు తీవ్ర ఎదురుదాడి ఎదురైంది.
హిడ్మా సొంత గ్రామం
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా అంటేనే మావోయిస్టుల ప్రబావిత ప్రాంతం. ఇక్కడి పూర్వి(Purvi) గ్రామాని(Village)కి ఒక ప్రత్యేకత ఉంది. మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా పుట్టిన ప్రాంతం ఇదే. ఆయన తల్లి, ఇతర కుటుంబ సభ్యులు ఇప్పటికీ ఇక్కడే ఉంటున్నారు. అంతేకాదు.. మావోయిస్టులకు ఈ గ్రామం ఒక కార్యాలయంగా మారిపోయింది. ఎటు నుంచి ఎప్పుడైనా.. ఇక్కడకు వచ్చి.. వ్యూహ ప్రతివ్యూహాలు పన్నడంలోనూ.. కొన్ని కొన్ని సార్లు ఇక్కడే సమావేశాలు ఏర్పాటు చేయడంలోను.. విశ్రాంతి తీసుకోవడం.. విందులు చేసుకోవడం వంటివి హిడ్మా సొంత గ్రామంలోనే చేసుకుంటారు. ఇలాంటి గ్రామాన్ని టార్గెట్ చేసుకుని, స్వాధీనం చేసుకోవడం ద్వారా మావోయిస్టుల కదలికలపై దృష్టి పెట్టి నియంత్రించాలని కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే.. ఎప్పటికప్పుడు ఎదురు దాడులతో బలగాలు నిర్వీర్యమయ్యాయి. కానీ, ఇప్పుడు మాత్రం మావోయిస్టుల దుర్భేధ్య కోటను బలగాలు హస్తగతం చేసుకున్నాయి.
చీమ చిటుక్కుమన్నా..
మావోయిస్టు అగ్రనేత హిడ్మా(Hidma) సొంత గ్రామం పూర్వి అంటే..ఆషామాషీ కాదు. భారత పార్లమెంటుకు ఎంత కట్టుదిట్టమైన భద్రత ఉంటుందో అంతకు మించిన భద్రత అది కూడా అధునాతన భద్రత ఇక్కడ మావోయిస్టులు కల్పించారు. పూర్తి సౌర విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడి గ్రామంలో ప్రతి ఒక్కరికీ మ్యాన్ ప్యాక్‌లు ఉన్నాయి. చీమ చిటుక్కుమన్నా.. గ్రామంలో కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చినా.. సెక న్ల వ్యవధిలో సమాచారం కేంద్ర వ్యవస్తకు చేరిపోతుంది. దీంతో మావోయిస్టులు వెంటనే అలెర్ట్ అయిపోతారు. ఆ కొత్త వ్యక్తులు ఎవరనేది సెన్సార్ల ద్వారా తెలుసుకుని.. అవసరమైతే.. దాడులు చేస్తారు. ఇలానే కేంద్ర బలగాలు అనేక సందర్భాల్లో చావు దెబ్బతిన్నాయి. దాదాపు 120 మంది బలగాలను ఇక్కడ కోల్పోయారు.
హిడ్మా తల్లికి ఎస్పీ పరామర్శ
ఇక, తాజాగా పూర్వి(Purvi) గ్రామాన్ని చాలా చాకచక్యంగా కేంద్ర బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. అంతేకాదు.. ఇక్కడ జాతీయ జెండాను కూడా ఎగురవేశాయి. హిడ్మా బంధువులకు నిత్యావసరాలు ఇవ్వడంతోపాటు వారికి వైద్య సేవలు అందించారు. యువతకు విద్యను అందించేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. ఇక, పోలీసులు రావడంతో స్తానిక యువత అడవుల్లోకి పరారయ్యారు. వారిని కూడా నయానో.. భయానో వెనక్కి రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో గ్రామాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత.. సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చౌహాన్ గ్రామంలో కలియదిరిగారు. మావోయిస్టు అగ్రనేత హిడ్మా మాతృమూర్తి బిజ్జును ఆయన పరామర్శించారు. వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి.. స్థానిక గిరిజనులకు వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అయితే.. వాస్తవానికి సమాంతర ప్రభుత్వం నడుపుతున్న మావోయిస్టులు కూడా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. సొంతంగా పాఠశాలలు నిర్వహిస్తుండడం గమనార్హం. పంటలు, వ్యవసాయ ఉత్పత్తులను కూడా ఇక్కడ చేపట్టారు. అయితే, వీటిని తాజాగా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇదిలావుంటే.. 40 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత.. మావోయిస్టుల కంచుకోట భారత పతాకం ఎగరడం రికార్డు!!