Rabindranath Tagore: ఐన్‌స్టీన్, రవీంద్రనాథ్ ఠాగూర్ మంచి స్నేహితులని మీకు తెలుసా?
Rabindranath Tagore: సాహిత్యంలో చెరగని ముద్ర వేసిన రవీంద్రనాథ్ ఠాగూర్, బెంగాలీలో కథానిక ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. నోబుల్ పురస్కారం అందుకున్న తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించారు.
Rabindranath Tagore:
లా వదిలేసి..సాహిత్యం వైపు ప్రయాణం..
రవీంద్రనాథ్ ఠాగూర్. బెంగాలీ సాహిత్య స్థాయిని పెంచిన రచయిత మాత్రమే కాదు. కవి, మేధావి, సంగీత కళాకారుడు, ఆర్టిస్ట్ కూడా. ఆయన 81 వ వర్ధంతిని పురస్కరించుకుని అందరూ స్మరించుకుంటున్నారు. మనకు జాతీయ గీతం అందించిన ఠాగూర్...సాహిత్య విభాగంలో నోబుల్ అవార్డు పొందిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించారు. 1913లో ఆయనను ఈ అవార్డు వరించింది. బెంగాలీలో రాసిన గీతాంజలి పుస్తకాన్ని ఆంగ్లంలో "Song Offerings"గా అనువదించారు. ఈ బుక్‌కే నోబుల్ పురస్కారం లభించింది. యూనివర్సిటీ ఆఫ్ లండన్‌లో లా స్టూడెంట్‌గా చేరిన ఠాగూర్, కొద్ది కాలానికే భారత్‌కు తిరిగొచ్చారు. తన జీవితాన్ని బెంగాలీ సాహిత్యానికి అంకితమిచ్చారు. బంగ్లాదేశ్‌కు కూడా జాతీయ గీతం రాసిచ్చిన ఘనత ఠాగూర్‌దే. 1941 ఆగస్టు7వ తేదీన తుదిశ్వాస విడిచిన రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి మరి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి ఆసక్తికర విషయాలు
1. తన ఎనిమిదో ఏటనే కవిత్వం రాశారు ఠాగూర్. అయితే ఆయన కవిత్వం తొలిసారి అచ్చైంది మాత్రం 1877లో. భానుసిన్హా అనే కలం పేరుతో అప్పట్లో కవితలు రాసేవారు.
2. బెంగాలీ సాహిత్యానికి "కథానిక" (Short Story)ప్రక్రియను పరిచయం చేసింది రవీంద్ర నాథుడే. 1877లో బికారిణి పేరుతో ఓ చిన్న కథ రాశారు. అప్పటికి ఆయన వయసు పదహారేళ్లు.
3.1883లో పదేళ్ల మృణాళిని దేవిని వివాహం చేసుకున్నారు. వీరికి ఐదుగురు సంతానం. వీరిలో ఇద్దరు పసిప్రాయంలోనే మృతి చెందారు. ఠాగూర్‌కి తన వదిన అంటే ఎంతో ఇష్టం. ఆమె పేరు కదంబినీ దేవి. ఠాగూర్ రచనలపైనా ఆమె ప్రభావం ఉండేదని చెబుతుంటారు.
4.1915లో కింగ్ జార్జ్ వి, ఠాగూర్‌కి "నైట్‌హుడ్" బిరుదు ఇచ్చారు. అయితే 1919లో జలియన్ వాలాబాగ్ ఘటన తరవాత ఠాగూర్ ఆ బిరుదుని తిరస్కరించారు.
5.తరగతి గదిలో పాఠాలు చెప్పే వ్యవస్థను వ్యతిరేకించే రవీంద్రనాథ్ ఠాగూర్..1918లో విశ్వభారతి విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పారు. ప్రకృతిలోనే, చెట్ల కింద పాఠాలు నేర్చుకునే విధానాన్ని ప్రవేశపెట్టారు.
6.మహాత్మా గాంధీ పోరాటంతో ఎంతో ప్రభావితమైన రవీంద్రనాత్ ఠాగూర్, స్వాతంత్య్రోద్యమంలోనూ కీలక పాత్ర పోషించారు.
7. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్‌ను నాలుగు సార్లు కలిశారు ఠాగూర్. ఇద్దరికీ ఒకరిపై ఒకరికి ఎంతో గౌరవం ఉండేది. ఓ సారి తన రచనల్లోనూ ఐన్‌స్టీన్‌పై తనకున్న గౌరవాన్ని వ్యక్తం చేశారు ఠాగూర్. "ఐన్‌స్టీన్ మానవ సంబంధాలకు గౌరవమిచ్చే వ్యక్తి. ఓ విషయాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఆయన దగ్గరి నుంచే నేర్చుకున్నాను" అని చెప్పారు.
Also Read: Copy Cat: కాపీక్యాట్ అని ఎందుకు అంటారు? ఈ పదం ఎప్పుడు పుట్టింది?
Also Read: Azadi Ka Amrit Mahotsav: గాంధీజీ కొల్లాయి కట్టడానికి కారణమేంటి? ఆ సంఘటనే మార్పు తెచ్చిందా?