UP Sweeper News: రోడ్లు ఊడ్చే స్వీపర్ ఇంట్లో 9 లగ్జరీ కార్లు! అవాక్కైన అధికారులు
UP Sweeper News: ఓ మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేస్తూ.. రోడ్లు ఉడ్చే పని చేసే వ్యక్తి కోటీశ్వరుడిగా మారాడు. అతని ఇంట్లో మొత్తం తొమ్మిది లగ్జరీ కార్లున్నాయి.
Richest Sweeper in India: అతనో స్వీపర్.. రోజూ ఊళ్లోని చెత్తను ఉడ్చే పని చేస్తుండేవాడు. ఇప్పుడు అతను కోటీశ్వరుడు. అతని ఇంట్లో మొత్తం తొమ్మిది లగ్జరీ కార్లున్నాయి. ఎలా కొన్నాడా అనుకుంటున్నారా..?
ఉత్తర ప్రదేశ్ లోని గోండా జిల్లాకు చెందిన సంతోష్ జైశ్వాల్ అనే స్వీపర్ కోట్లకు పడగలెత్తాడు. ఈ పెద్ద మనిషి మొదట్లో గోండా మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికుడిగా చేరాడు. కొన్నాళ్లు రోడ్లూ ఊడ్చాడు. బాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్ లలో చూపించినట్లుగా.. అనూహ్యంగా సంతోష్ గతి మారిపోయింది. రోడ్లు ఊడ్చేవాడు కాస్తా.. రాయల్ లైఫ్ వెలగబెడుతున్నాడు. అసలిదంతా ఎలా అయ్యిందంటే..
తొలుత.. పారిశుద్ధ్య కార్మికుడుగా ఉండే సంతోష్.. నిబంధనలకు విరుద్ధంగా డివిజనల్ కమిషనర్ కార్యాలయంలో స్వీపర్ ఉద్యోగం తెచ్చుకున్నాడు. ఈ పనితోనే ఆగిపోతే దొరికేవాడు కాదేమో.. ఆశ అక్కడితో ఆగనివ్వదు కదా.. ఆఫీసులోని ప్రభుత్వ ఫైళ్లను, దస్త్రాలను తారుమారు చేశాడు. కోట్లలో ఆస్తులు సంపాదించాాడు. ఈ క్రమంలోనే దొరికిపోయాడు. సంతోష్ చేస్తున్న అక్రమాలపై అప్పటి కమిషనర్ యోగేశ్వర్ రామ్ మిశ్రాకు కొందరు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. సంతోష్ తారుమారు చేస్తోన్న ఫైళ్ల విషయం బయడటడే సరికి.. దీనిపై విచారణ చేయాలని కమిషనర్ ఆదేశించారు.
విచారణలో సంతోష్ జైశ్వాల్ బండారం బయట పడింది. గుట్టు రట్టవడంతో సంతోష్ ను ఉద్యోగం నుంచి సస్పెండు చేశారు. అతనిపై గోండా సిటీ పోెలీసు స్టేషన్లో కేసు కూడా నమోదైంది. ఆ తరువాతే పోలీసులు, అధికారులకు అసలు నిజాలు తెలిశాయి. విచారణలో భాగంగా సంతోష్ ఆస్తులు పరిశీలించిన అధికారులు విస్తుపోయారు. సంతోష్ వద్ద మొత్తం తొమ్మిది లగ్జరీ కార్లు ఉన్నట్లు తేలింది.
తొలుత సంతోష్ ఇాంట్లో ఉన్న ఏడు కార్ల రిజిస్ట్రేషన్ నంబర్ల ఆధారంగా వాటి వివరాలు ఇవ్వాలని అక్కడి ట్రాన్సుపోర్టు అధికారులను పోలీసులు కోరారు. వారిచ్చిన వివరాల ఆధారంగా.. సంతోష్ పేరిట మారుతీ సుజుకీ కంపెనీకి చెందిన స్విఫ్ట్ డిజైర్, ఎర్టిగా కార్లు, మహీంద్రా కంపెనీకి చెందిన స్కార్పియో, క్సైలో కార్లు, టయోటా కంపెనీకి చెందిన లగ్జరీ కారు ఇన్నోవా రిజిష్టరై ఉన్నాయి. సంతోష్ సోదరుడు ఉమా శంకర్ జైశ్వాల్ పేరిట మారుతీ సుజుకీ ఎర్టిగా కారు, అతని భార్య బేబీ జైశ్వాల్ పేరిట టయోటా ఇన్నోవా కార్లు రిజిష్టరై ఉన్నాయి. ఈ కార్లన్నీ సంతోష్ ఇంట్లోనే ఉన్నాయి.
ఇవే కాక.. మరో రెండు కార్లు సైతం సంతోష్ పేరిట రిజిష్టరై ఉన్నాయని, వీటన్నింటినీ సంతోషే కొనుగోలు చేశాడని అసిస్టెంట్ డివిజనల్ ట్రాన్సుపోర్టు అధికారి నివేదిక ఇచ్చారు. దీంతో ఈ విషయం టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. ఓ స్వీపర్ స్థాయి ఉద్యోగి ఈ మేరకు ఆస్తులు కూడబెట్టడం ఎలా సాధ్యమైందనే విషయం అంతుబట్టకుండా ఉంది. సంతోష్ బ్యాంకు ఖాతా వివరాలు కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. విచారణలో అతని నేరాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండటంతో అతనిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.