UK Visa Fee Hike: యూకే వీసా ఫీజు పెంపు విద్యార్థులు, కార్మికులపై ఎలాంటి ప్రభావం చూపనుంది?
UK Visa Fee Hike: నేటి నుంచి యూకే వీసా ఫీజు పెంపు నిర్ణయం అమల్లోకి వస్తుంది. భారతీయులతో సహా విదేశీయులకు వీసా ఫీజు పెంచనున్నారు.
UK Visa Fee Hike: బ్రిటన్ ప్రభుత్వ ప్రకటించిన వీసా ఫీజు పెంపు నేటి నుంచి అమల్లోకి రానుంది. ఇంతకు ముందే యూకే హోం ఆఫీస్ ప్రకటించినట్లు అక్టోబర్ 4వ తేదీ నుంచి ఈ వీసా ఫీజు పెంపు అమల్లోకి రానుంది. దీని ప్రకారం ఆరు నెలల్లోపు విజిట్ వీసా ఫీజు గతంలో 100 పౌండ్లు ఉంటే, ఇప్పుడు దాన్ని 115 పౌండ్లకు పెంచింది బ్రిటన్ సర్కారు. అలాగే స్టూడెంట్ వీసా రుసుము ఇంతకు ముందు 363 పౌండ్లు ఉండగా.. తాజాగా 490 పౌండ్లకు పెరిగింది. ఇక తాజా పెంపుతో విజిటర్ వీసా దరఖాస్తు రుసుము రూ. 11,835కు చేరితే.. స్టూడెంట్ వీసా అప్లికేషన్ ఫీజు రూ.50,428 కి చేరింది.
పార్లమెంటు ఆమోదానికి లోబడి ఇమ్మిగ్రేషన్, జాతీయత రుసుములు అక్టోబర్ 4వ తేదీ నుంచి పెరుగుతాయని హోం ఆఫీస్ ప్రకటించింది. సుస్థిరమైన ఇమ్మిగ్రేషన్, జాతీయత వ్యవస్థను అమలు చేయడానికి వసూలు చేసే వీసా రుసుముల నుంచి వచ్చే ఆదాయం కీలక పాత్ర పోషిస్తుందని హోం ఆఫీస్ పేర్కొంది. ఇక తాజా నిర్ణయంతో వర్క్, పర్యాటక వీసాల ధరల్లో 15 శాతం పెరుగుదల ఉంటే.. ప్రాధాన్యత వీసాలు, స్టడీ వీసాలు, స్పాన్సర్‌షిప్ సర్టిఫికేట్ ల ధరల్లో కనీసం 20 శాతం పెరుగుదల ఉంటుందని హోం ఆఫీస్ పేర్కొంది. కాగా, భారీగా పెరిగిన వీసాల ఫీజు బ్రిటన్ వెళ్లే విద్యార్థులు, పర్యాటకులకు భారం కానుంది.
అక్టోబర్ 4వ తేదీ నుంచి యూకే వీసాల కొత్త ఫీజులు భారతీయులతో పాటు విదేశీయులకు అమల్లోకి వస్తుంది. విద్యార్థులు, నైపుణ్యం కలిగిన కార్మికులు, వలసదారులపై ఈ వీసా ఫీజు పెంపు ప్రభావం ఉంటుంది. ఇమ్మిగ్రేషన్ హెల్త్ సర్‌ఛార్జ్ కూడా సంవత్సరానికి 1035 పౌండ్లకు పెరుగుతుంది. చైల్డ్ స్టూడెంట్స్, డిపెండెంట్స్ తో సహా విద్యార్థుల వీసా ఛార్జీ 490కి పెరుగుతుంది. అయితే, 6 నెలల కంటే ఎక్కువ కాలం విద్యార్థులు ఇంగ్లీష్ చదివే స్వల్పకాలిక కోర్సులకు వీసా ఫీజులో పెరుగుదల ఉండదని యూకే ప్రభుత్వం తెలిపింది.
నైపుణ్యం కలిగిన కార్మికులకు, సర్టిఫికేట్ స్పాన్సర్‌షిప్ మూడు సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ కాలంం జారీ అయితే, వీసా ధర 719 పౌండ్లుగా ఉండనుంది. స్పాన్సర్‌షిప్ సర్టిఫికేట్ మూడు సంవత్సరాల కంటే ఎక్కువ ఇచ్చినట్లయితే, ఇమ్మిగ్రేషన్ రుసుము 1420 పౌండ్లు ఉంటుందని హౌం ఆఫీస్ పేర్కొంది.
2021-2022 సీజన్‌లో భారత్ నుంచి సుమారు లక్షా 20 వేల మంది చదువు కోసం బ్రిటన్ వెళ్లారు. ఆ దేశంలో విద్యను అభ్యసిస్తున్న విదేశీయుల్లో ఇండియన్ల సంఖ్యే ఎక్కువ. కీలకమైన సేవల్ని అందించేందుకు ఉద్దేశంతో ఫీజును పెంచినట్లు ప్రభుత్వం పేర్కొంది.