Bihar CM : మద్యం తాగేవాళ్లంతా మహా పాపులు - శాపనార్థాలు పెట్టిన సీఎం !
మద్యం తాగేవాళ్లు మహాపాపులని బీహార్ సీఎం తేల్చేశారు. టాక్స్ పేయర్స్‌పై ఇంత కఠినంగా ఎలా అంత మాట అనగలిగారంటే.. ఆ రాష్ట్రంలో మద్య నిషేధం అమల్లో ఉంది మరి.
మద్యం తాగేవాళ్లంతా టాక్స్ పేయర్స్ అని.. వారే ఆర్థిక వ్యవస్థను నడుపుతున్నారని చాలా మంది ముఖ్యమంత్రులు వారిపై ఓ రకమైన అభిమానం చూపిస్తారు. వారే సంక్షేమ పథకాలకు నిధులు సర్దుతున్నారని అంగీకరిస్తారు. అయితే బీహార్ సీఎం నితీష్ కుమార్‌కు ( Bihar CM nitish ) మాత్రం అలాంటి సెంటిమెంట్లేవీ లేవు. మద్యం తాగేవారిని తీవ్‌రంగా విమర్శిస్తున్నారు. మద్యం తీసుకునేవారు మహాపాపులని, వారిని తాను భారతీయులుగా పరిగణించనని తేల్చేశారు. మద్యం.. నాటు సారా తాగేవారు మహాపాపులని, విషపూరితమైన నాటుసారా తాగి మరణించిన వారికి తమ ప్రభుత్వం పరిహారం ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
'ద కశ్మీర్ ఫైల్స్' చిత్రం పూర్తిగా వాస్తవం- ఎందుకీ వివాదం: ఉపరాష్ట్రపతి
మద్యం తీసుకుని మొదటిసారి నేరం చేసిన వారు జరిమానా డిపాజిట్ చేసిన అనంతరం డ్యూటీ మెజిస్ట్రేట్ నుండి బెయిల్ పొందుతారు. జరిమానా చెల్లించలేకపోతే ఒక నెల జైలు శిక్షను విధించే విధంగా బీహార్ ప్రొహిబిషఫన్ అండ్ ఎక్సైజ్ (సవరణ) బిల్లు 2022 ని బుధవారం అసెంబ్లీలో ( Bihar Assembly ) ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఆమోదం పొందిన అనంతరం నితీష్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. మహాత్మాగాంధీ కూడా మద్యం తీసుకోవడాన్ని వ్యతిరేకించారని, ఆ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా వెళ్లేవారు మహాపాపులు, మహా అయోగ్యులని అన్నారు. తాను భారతీయులుగా భావించనని అన్నారు.
లగేజీ మార్చేసిన ఇండిగో - చుక్కలు చూపించిన కస్టమర్ ! మళ్లీ అలా చేయలేరంతే
మద్యాన్ని తీసుకోవడం హానికరమని తెలిసి కూడా ప్రజలు వాటికి బానిసలవుతున్నారని.. దీంతో తరువాతి పరిణామాలకు కూడా వారే బాధ్యులని, రాష్ట్ర ప్రభుత్వం కాదని అన్నారు. ఇటీవల బీహార్‌లో కల్తీ మద్యంతో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రతిపక్షాలు నితీష్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. బీహార్‌లో మద్యం అమ్మడం లేదు. మద్య నిషేధం ( Prohibition ) అమల్లో ఉంది. అయినప్పటికీ చట్టం కళ్లు కప్పి అనేక మంది అక్రమ మద్యం వ్యాపారం చేస్తూనే ఉన్నారు. సారా కూడా వెల్లువగా వస్తోంది. దీంతో మద్యంపై నిషేధం కేవలం కాగితాలపైనే మిగిలిపోయిందని విపక్షాలు విమర్శిస్తున్నాయి.
మద్య నిషేధం ఎత్తేసి.. మద్యం ఆదాయంపైనే ఆధారపడితే.. టాక్స్ పేయర్స్ వాల్యూ తెలిసేదని కొన్ని ఇతర రాష్ట్రాల వాసులు సెటైర్లు వేస్తున్నారు. ఏడాదికి రూ. ఇరవై వేల కోట్ల ఆదాయం తెచ్చుకుంటున్న రాష్ట్రాలు కూడా ఉన్నాయంటున్నారు. అందుకే నితీష్ కుమార్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.