(Source: ECI/ABP News/ABP Majha)
Spicejet Special Offers: అయోధ్య వెళ్లే భక్తులకు స్పైస్‌జెట్ స్పెషల్ ఆఫర్స్
Spicejet Discount: అయోధ్య వెళ్లేవారికి విమానయాన కంపెనీలు బంపర్ ఆఫర్లు ప్రకటించాయి. అయోధ్య టికెట్ల మీద భారీ డిస్కౌంట్లు అందిస్తున్నాయి.
SpiceJet offers bookings starting at Rs 1622: ఎన్నో ఏళ్ల కల. ఆ రాముడి ఆగమనం కోసం ఎన్నో ఏళ్లు వేచి చూసిన రోజు రానే వచ్చింది. బాలరాముడు అయోధ్యలో కొలువుదీరాడు. అయోధ్యలో అపూర్వఘట్టం ఆవిష్కృతమైంది. ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం (Ram mandir inauguration) అంగరంగ వైభవంగా జరిగింది. స్వయంగా అయోధ్యలో కార్యక్రమంలో పాల్గొన్న వాళ్లే కాకుండా.. టీవీల ముందు కూర్చుని చూస్తున్న ప్రతి ఒక్కరు తన్మయత్వంలో మునిగిపోయారు. స్వయంగా అయోధ్యకు వెళ్లి ఆ స్వామి వారిని దర్శించుకోవాలని కోరుకుంటున్నారు. అలా అయోధ్య వెళ్లేవారికి విమానయాన కంపెనీలు బంపర్ ఆఫర్లు ప్రకటించాయి. అయోధ్య (Ayodhya) టికెట్ల మీద భారీ డిస్కౌంట్లు అందిస్తున్నాయి.
ఫ్లైట్ టికెట్స్‌పై స్పైస్‌జెట్ డిస్కౌంట్
ప్రముఖ విమాయనయాన సంస్థ స్పైస్‌జెట్ అయోధ్యలోని రామమందిరాన్ని దర్శించుకునే వారికోసం ఫ్లైట్ టికెట్స్‌పై డిస్కౌంట్ ఇస్తోంది. అయోధ్య విమాన టికెట్ ప్రారంభ ధరను 1622గా ప్రకటించింది స్పైస్‌జెట్. రూల్స్‌కి అనుగుణంగా ప్రయాణికులు ప్రయాణ తేదీని మార్చుకోవచ్చని, దానికి ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవని ప్రకటించింది. ఫిబ్రవరి 1 నుంచి చెన్నై, అహ్మదాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, జైపూర్, పాట్నా, దర్బంగా నుంచి అయోధ్యకు డైరెక్ట్ ఫ్లైట్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. ప్రపంచంలోని పలు దేశాల నుంచి దాదాపూ 200 విమానాల్లో అయోధ్యకు చేరుకునే సౌకర్యం ఉంది. భారత్‌లో ప్రారంభ విమాన టికెట్ ధర రూ.5000 ఉండగా.. ఇతర దేశాల నుంచి అయోధ్యకు చేరుకునేందుకు విమానయాన సంస్థను బట్టి టికెట్ ధర మారుతుంది. కానీ, స్పైస్‌జెట్ మాత్రం ప్రత్యేక ఆఫర్ కింద రూ.1622కే అందిస్తుంది. జనవరి 22 నుంచి జనవరి 28 మధ్య బుక్ చేసుకుంటే జనవరి 22 నుంచి సెప్టెంబర్ 30,2024లోపు మీరు ఎప్పుడైనా ప్రయాణించవచ్చు. తేదీలను మార్చుకోవచ్చు అని ప్రకటించింది.
ఇప్పటికే ఆ రాములవారిని దర్శించుకునేందుకు ఎంతోమంది సన్నాహాలు చేసుకుంటున్నారు. రామ్‌లల్లాను చూసేందుకు ఎప్పుడెప్పుడు వెళ్దామా? అని ఉవ్విళూరుతున్నారు. కాగా.. అయోధ్యను చేరుకునేందుకు రోడ్డు, రైలు మార్గాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే ఆయా ప్రధాన రైల్వే స్టేషన్ల ఉంచి అయోధ్యకు రైళ్లను నడుపుతోంది మన ఇండియన్ రైల్వే.
ఇక జనవరి 22న ప్రాణప్రతిష్ఠాపన అనంతరం.. జనవరి 23 నుంచే సామాన్య భక్తులకు రాములవారి దర్శనాన్ని కల్పిస్తోంది శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. ఉచిత దర్శనం, ఉచిత ప్రసాదం కూడా అందిస్తోంది. కాగా.. ప్రతి రోజు ఉదయం 7 నుంచి 11.30 గంటల వరకు, ఆ తర్వాత 2 నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే ఆలయం తెరిచి ఉంటుంది. ఇక రాములవారికి రోజుకి 3 సార్లు హారతులు ఇస్తారు.
Read Also: మన రాముడొచ్చేశాడు, ఇక టెంట్‌లో ఉండాల్సిన ఖర్మ లేదు - ప్రధాని మోదీ భావోద్వేగం