Ram Mandir: మన రాముడొచ్చేశాడు, ఇక టెంట్‌లో ఉండాల్సిన ఖర్మ లేదు - ప్రధాని మోదీ భావోద్వేగం
Ayodhya Ram Mandir: అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ ముగిసిన తరవాత ప్రధాని మోదీ భావోద్వేగ ప్రసంగం చేశారు.
Ayodhya Ram Mandir Opening: అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ క్రతువు ముగిసిన తరవాత ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై మాట్లాడారు. ఈ సమయంలో భావోద్వేగానికి లోనయ్యారు. ఈ రోజు కోసం ఎన్నో వందల ఏళ్లుగా ఎదురు చూశామని, ఇన్నాళ్లకు ఈ కల సాకారమైందని అన్నారు. ఎన్నో శతాబ్దాల తరవాత అయోధ్యకు రాముడు వచ్చాడని అన్నారు. ఇకపై రాముడు టెంట్‌లో ఉండాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. శ్రీరామ చంద్రమూర్తి జై అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ ఆద్యంతం ఎమోషనల్‌గా మాట్లాడారు. జనవరి 22 అనేది కేవలం క్యాలెండర్‌లో ఓ తేదీ కాదని, నవశకానికి ప్రారంభం అని వెల్లడించారు. ఈ ప్రాణ ప్రతిష్ఠ తనకు అలౌకిక ఆనందాన్నిస్తోందని అన్నారు.
#WATCH | PM Narendra Modi says, "Ram Lalla will not stay in a tent now. He will stay in the grand temple..."#RamMandirPranPrathistha pic.twitter.com/DkbVzUwnsL
— ANI (@ANI) January 22, 2024
రామ భక్తులందరికీ ప్రణామాలు చేశారు. ఎన్నో శతాబ్దాలుగా రామ మందిర నిర్మాణానికి అడ్డంకులు ఎదురయ్యాయని, ఇన్నాళ్లకు అవన్నీ తొలగిపోయాయని అన్నారు. రాముడికి మందిరం నిర్మించాలనుకునే సంకల్పంలో ఎక్కడో లోపం ఉండి ఉండొచ్చని..అందుకే ఇంత ఆలస్యమైందని చెప్పారు.
"ఇవాళ దేశమంతా అలౌకిక ఆనందంలో మునిగిపోయింది. ఇన్నేళ్ల నిరీక్షణ తరవాత మన అయోధ్యకు రాముడు వచ్చేశాడు. ఇకపై మన రామయ్య టెంట్‌లో ఉండాల్సిన ఖర్మ లేదు. ఆయన కోసం ఇవాళ భారీ మందిరం నిర్మించాం. ప్రాణ ప్రతిష్ఠ జరిగిన ఈ రోజు క్యాలెండర్‌లో కేవలం ఓ తేదీ కాదు. ఇది నవశకానికి ప్రారంభం. రామ భక్తులందరికీ ప్రణామాలు"
- ప్రధాని నరేంద్ర మోదీ
ఈ సమయంలో రాముడి గొప్పదనాన్ని ప్రస్తావించారు ప్రధాని మోదీ. రాముడే ఈ దేశ విశ్వాసం అని ఆయన పాఠాలే దేశానికి చట్టంగా మారిందని వెల్లడించారు. ఈ దేశ గర్వం, గౌరవం అన్నీ రాముడే అంటూ కీర్తించారు. అలాంటి రాముడికి తగ్గ స్థానం ఇస్తే ఆ ప్రభావం మన దేశంపై వేల ఏళ్ల పాటు నిలిచి ఉంటుందని తేల్చి చెప్పారు.
"ఈ రామ మందిరం జాతిని మొత్తం మేల్కొల్పుతుంది. భారత దేశ విశ్వాసం, పునాది, గర్వం, గౌరవం..అన్నీ శ్రీరామ చంద్రుడే. మన భరత జాతి కీర్తి వెలుగొందింది ఆయన వల్లే. ఆయన చెప్పిందే మన దేశం అనుసరిస్తున్న చట్టం. ఆయనకు తగిన గౌరవం ఇస్తే ఆ కటాక్షం, ప్రభావం మన దేశంపై శతాబ్దాలు మాత్రమే కాదు..వేలాది సంవత్సరాలు ఉంటుంది"
- ప్రధాని నరేంద్ర మోదీ
#WATCH | Ayodhya: Prime Minister Narendra Modi says, "This is a temple of national consciousness in the form of Ram. Ram is the faith of India, Ram is the foundation of India. Ram is the idea of India, Ram is the law of India...Ram is the prestige of India, Ram is the glory of… pic.twitter.com/kOUeC0h71F
— ANI (@ANI) January 22, 2024
ప్రాణ ప్రతిష్ఠకు ముందు 11 రోజుల పాటు కఠిన దీక్షను చేపట్టినట్టు చెప్పారు ప్రధాని మోదీ. ఈ 11 రోజుల్లో దేశంలోని ప్రముఖ రామాలయాలను సందర్శించానని, అన్ని భాషల్లోనూ రామాయణాన్ని విన్నానని వెల్లడించారు. భాష ఏదైనా రాముడిపై భక్తి మాత్రం ఒకటే అని స్పష్టం చేశారు. రాముడు వివాదం కాదని, ఎన్నో ప్రశ్నలకు సమాధానం అని తేల్చి చెప్పారు. ఎన్నో ఏళ్ల పోరాటాలు, బలిదానాల తరవాత ఈ అపురూప ఘట్టం ఆవిష్కృతమైందని చెప్పారు. రాముడు అయోధ్య వీడినప్పుడు ప్రజలు కేవలం 14 ఏళ్ల పాటు మాత్రమే ఆయనకు దూరమయ్యారని, కానీ ఇప్పుడు భారతీయులు వందల ఏళ్ల పాటు రాముడి దూరమైపోయారని అన్నారు.