దేశంలో సగం మందికిపైగా నిద్ర కరవు - అధ్యయనంలో విస్తుగొలిపే వాస్తవాలు
మనం ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల ఆహారం, కంటి నిండా నిద్ర చాలా అవసరం. అలసిన శరీరానికి మళ్లీ శక్తి సమకూరాలంటే నిద్ర తప్పనిసరి. మారిన పరిస్థితుల్లో దేశంలో చాలా మంది కంటి నిండా నిద్ర పోవడం లేదు.
Sleep Deprivation India : అలసిన శరీరానికి మళ్లీ శక్తి సమకూరాలంటే నిద్ర తప్పనిసరి. శరీరానికి విశ్రాంతినిచ్చే ప్రశాంత స్థితి నిద్ర. మానవులకే కాక జంతువులు.. పక్షులతో పాటు ప్రతీ ప్రాణికి నిద్ర చాలా అవసరం. ప్రతీప్రాణి బ్రతకటానికి నిద్ర అత్యంత అవసరం. ముఖ్యంగా మానవుల జీవితంలో నిద్ర ప్రాథమిక అవసరమని..శారీరకపరంగా అత్యంత ముఖ్యమైనదని..నిద్ర ప్రతీ పౌరుని ప్రాథమిక హక్కు అని ఆరోగ్య జీవనానికి నిద్ర చాలా అవసరమైనదని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసింది. మనం ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల్య ఆహారం, కంటి నిండా నిద్ర చాలా అవసరం.
నిద్ర వల్ల ఉపయోగాలు అన్నీ ఇన్నీ కావు..మానవుని శరీరం సూపర్ కంప్యూటర్ లాంటిదని నిపుణులు చెబుతుంటారు. నిద్రలో శరీరం ఆరోజులు జరిగిన చిన్న చిన్న ఇబ్బందులను రిపేర్ చేసుకుంటుంది.సంపూర్ణ నిద్రలోనే మెదడు భావోద్వేగాలూ సమతుల్యతను సాధిస్తాయి.కండరాల పెరుగుదల, జీవకణాల మరమ్మత్తు, హార్మోన్ల విడుదల వంటివన్నీ నిద్రావస్థలోనే జరుగుతాయి.
సాధారణంగా పెద్దలు రోజులో 6-7 గంటల పాటు నిద్రపోవాలి. అయితే మారిన పరిస్థితుల్లో దేశంలో చాలా మంది కంటి నిండా నిద్ర పోవడం లేదు. రాత్రి సమయంలో ప్రశాంతంగా కనీసం ఆరు గంటలు కూడా నిద్రపోలేని పరిస్థితి నెలకొంది. మార్చి 17 ప్రపంచ నిద్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోషల్ నెట్‌వర్క్ సంస్థ లోకల్ సర్కిల్స్ దేశవ్యాప్త సర్వే నిర్వహించింది. ‘భారతదేశం ఎలా నిద్రపోతోంది?’ అనే అంశంపై జాతీయ స్థాయిలో అధ్యయనాన్ని చేపట్టింది.
అందులో భాగంగా దేశవ్యాప్తంగా 309 జిల్లాల నుంచి 39,000 కంటే ఎక్కువ మందిని ఆన్‌లైన్ ద్వారా సంప్రదించింది. వారు నిద్రపోతున్న తీరుతెన్నులను సేకరించింది. నిద్ర పోయే వేళలపై కరోనా ప్రభావం చూపిందా? అన్న అంశాన్నీ అధ్యయనం చేసింది. అందుకు సంబంధించిన వివరాలను ఇటీవలే వెల్లడించింది. చాలా మంది భారతీయులు నిర్దేశించినంత సమయం నిద్రపోవడం లేదని సర్వేలో తేలింది. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది ఆరు గంటల కంటే తక్కువ సమయం నిరాటంకంగా నిద్రపోతున్న వారి సంఖ్య 50 శాతం నుంచి 55 శాతానికి పెరగటం ఆందోళనకు గురిచేస్తోంది. 21 శాతం మంది 4 గంటల పాటే నిద్రపోతున్నారని సర్వే వెల్లడించింది.
భారతీయుల్లో 6 నుంచి 8 గంటలపాటు గాఢ నిద్రపోతున్నవారు 43శాతం ఉంటే.. 6 గంటలపాటు పడుకుంటున్నవారు 34శాతం మంది ఉన్నారు. 21శాతం మంది 4 గంటలపాటే నిద్రిస్తుండగా.. అతి తక్కువగా 2శాతం మంది ప్రజలు మాత్రమే 8 నుంచి 10 గంటలపాటు ఆరోగ్యకరంగా నిద్రపోతున్నారని సర్వేలో తేలింది.
కాగా.. గతంలో పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో జరిగిన పరిశోధనల్లో 8 గంటల కంటే తక్కువ నిద్రపోయిన వారిలో శారీరక సామర్థ్యం తగ్గినట్లుగా గుర్తించారు. నిద్రపై విస్తృతమైన పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతోపాటు ఆస్తులు, అంతస్తులు, సతీ, సుతుల్ అందరూ ఉన్నా, అన్నీ ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా 45శాతం మంది నిద్రాదేవి ఆదరణకు నోచుకోవడం లేదని 2016లో ఓ సర్వేలో వెల్లడయ్యింది. ‘నిద్రలేమి’ అనేది ప్రస్తుతం పెద్ద సమస్యగా తయారయ్యింది.
ప్రాంత, వర్ణ, జాతి, వయోభేదాలు లేకుండా ప్రపంచాన్నంతా పీడిస్తున్న ఏకైక వ్యాధి నిద్రలేమి. మనోవ్యధలూ.. శారీరక బాధలు మరచి మనిషి నిద్రాదేవి ఒడిలోనే సేదతీరాలి. ప్రశాంతమైన నిద్ర దివ్యావౌషధమమని నిపుణులు చెబుతారు. హాయిగా నిద్రపోయినవారు ఆరోగ్యంగా ఉంటారని కూడా పరిశోధనల్లో వెల్లడయ్యింది. ఈ విషయాన్ని ప్రపంచ నిద్రా ఔషధ సమాజంవారు ప్రకటించారు. మరి మారుతున్న పరిస్థితుల్లో నిద్ర కరవై రోగాలు కొనితెచ్చుకుంటున్నవారి సంఖ్య పెరుగుతోంది.