Manipur Fresh Violence: మణిపూర్‌లో మరోసారి భగ్గుమన్న అల్లర్లు, ముగ్గురు మృతి
Manipur Fresh Violence: మణిపూర్‌లో శుక్రవారం అర్థరాత్రి మరో సారి అల్లరి మూకలు చెలరేగి పోయాయి. బిష్ణుపూర్ జిల్లాలో హింసాత్మక సంఘటనలకు తెరతీశాయి.
Manipur Fresh Violence: మణిపూర్‌లో శుక్రవారం అర్థరాత్రి మరో సారి అల్లరి మూకలు చెలరేగి పోయాయి. బిష్ణుపూర్ జిల్లాలో హింసాత్మక సంఘటనలకు తెరతీశాయి. అడ్డుకోవడానికి వచ్చిన భద్రతా బలగాలు, సాయుధ దళాలపై దాడులకు పాల్పడ్డారు. వారు ప్రతిస్పందించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ అల్లర్లలో క్వాక్తా ప్రాంతంలోని మెయిటీ కమ్యూనిటీకి చెందిన ముగ్గురు మరణించారు. ఈ అల్లర్లలో కుకీ వర్గానికి చెందిన అనేక ఇళ్లు కూడా దగ్ధమయ్యాయి.
క్వాక్తా ప్రాంతంలో కుకీ, మెయిటీ వర్గాల మధ్య ఉద్రిక్తతలు చెలరేగాయి. వాటిని అడ్డుకోవడానికి వచ్చిన భద్రతా బలగాలపై దాడులకు తెగబడ్డారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య భారీ కాల్పులు జరిగాయి. స్థానికుల సమాచారం మేరకు మెయిటీ మహిళలు బిష్ణుపూర్ జిల్లాలోని బారికేడ్ జోన్ దాటేందుకు ప్రయత్నిస్తుండగా ఈ ఘటన జరిగింది. వారిని అస్సాం రైఫిల్స్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) అడ్డుకున్నాయి. దీంతో ఆందోళనకారులు సాయుధ దళాలపై రాళ్ల దాడికి దిగారు.
కమాండోకు గాయాలు
శుక్రవారం అర్ధరాత్రి నుంచి చెలరేగుతున్న హింసాత్మక సంఘటనలతో బిష్ణుపూర్‌లో జిల్లా అట్టుడుకుతోంది. బిష్ణుపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అల్లర్లలో మెయిటీ కమ్యూనిటీకి చెందిన ముగ్గురు మరణించారు, కుకీ కమ్యూనిటీకి చెందిన అనేక ఇళ్లకు నిప్పు పెట్టారు. దీంతో మణిపూర్ పోలీసులు, కమాండోలు ఎదురుకాల్పులు జరిపారు. ఈ దాడుల్లో మణిపూర్ కమాండో తలకు గాయమైంది. చికిత్స కోసం కమాండోను బిష్ణుపూర్ ఆసుపత్రిలో చేర్చారు. అనంతరం ఆ ప్రాంతంలో పారామిలటరీ బలగాలను మోహరించారు.
బఫర్ జోన్ దాటి వచ్చి అల్లర్లు
బిష్ణుపూర్ జిల్లాలోని కాక్తా ప్రాంతానికి రెండు కిలోమీటర్ల దూరంలో కేంద్ర బలగాల రక్షణతో ఉన్న బఫర్ జోన్ ఏర్పాటు చేశారు. అయితే కొంతమంది ఆందోళన కారులు బఫర్ జోన్‌ను దాటి మెయిటీ ప్రాంతాలకు వచ్చి భద్రతా దళాలపై కాల్పులు జరిపారని పోలీసు వర్గాలు తెలిపాయి. కంగ్వాయ్, ఫౌగక్చావో ప్రాంతాల్లో నిరసనకారులను చెదరగొట్టేందుకు సాయుధ బలగాలు, మణిపూర్ పోలీసులు టియర్ గ్యాస్, షెల్స్ ప్రయోగించారు.
కర్ఫ్యూ సడలింపు ఉపసంహరణ
ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంఫాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్‌లో కర్ఫ్యూ సడలింపు ఆలోచనలను అధికారులను ఉపసంహరించుకున్నారు. ముందు జాగ్రత్త చర్యగా పలు చోట్ల పగటిపూట ఆంక్షలు విధించారు. గురువారం బిష్ణుపూర్ జిల్లాలో సాయుధ బలగాలు, మెయిటీ కమ్యూనిటీ నిరసనకారుల మధ్య చెలరేగిన ఘర్షణల్లో 17 మంది గాయపడిన రెండు రోజుల తర్వాత తాజాగా శుక్రవారం అల్లర్లు చెలరేగాయి.
దాదాపు మూడు నెలల క్రితం ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో హింస చెలరేగుతోంది. అప్పటి నుంచి 160 మందికి పైగా మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) హోదా కోసం మెయిటీ కమ్యూనిటీ డిమాండ్‌కు వ్యతిరేకంగా మే 3న కొండప్రాంతం జిల్లాల్లో 'గిరిజన సంఘీభావ యాత్ర' నిర్వహించిన తర్వాత హింస చెలరేగింది. మణిపూర్ జనాభాలో మెయిటీలు దాదాపు 53 శాతం ఉన్నారు. ఇంఫాల్ లోయలో ఎక్కువగా నివసిస్తున్నారు, నాగాలు, కుకీలు, గిరిజనులు 40 శాతం ఉన్నారు. వీరంతా ప్రధానంగా కొండ జిల్లాలలో నివసిస్తున్నారు.