Arvind Kejriwal: ‘నేను బిజీగా ఉన్నా, రాలేను’ - ఈడీ విచారణకు కేజ్రీవాల్ ఆరో సారి డుమ్మా
ED Summons: మద్యం కుంభకోణం కేసులో అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఈడీ విచారణకు గైర్హాజరయ్యారు. ఈ మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు కేజ్రీవాల్ గైర్హాజరును ధృవీకరించాయి.
Arvind Kejriwal Skips 6th ED Summons: మద్యం కుంభకోణం కేసులో అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) మరోసారి ఈడీ విచారణకు గైర్హాజరయ్యారు. ఎక్సైజ్ పాలసీకి సంబంధించి కేసులో సోమవారం ఆయన విచారణకు హాజరు కావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు ఆరోసారి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విచారణకు కేజ్రీవాల్ హాజరుకావడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) వర్గాలు వెల్లడించాయి. సమన్లు చట్ట వ్యతిరేకమని, ఈడీ సమన్ల చట్టబద్ధతపై కోర్టులో కేసు నడుస్తోందని ఆప్ వర్గాలు మండిపడ్డాయి.
కేజ్రీవాల్‌ను ఇబ్బంది పెట్టేందుకే ఈడీ పదే పదే సమన్లు పంపుతోందని ఆ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కోర్టు నిర్ణయం వచ్చేవరకు ఈడీ ఆగాల్సిందేనని స్పష్టం చేశారు. ఇప్పటికే ఐదు సార్లు ఈడీ విచారణకు గైర్హాజరైన కేజ్రీవాల్.. ఈ నెల 17న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈడీ కోర్టు విచారణకు హాజరయ్యారు. రాష్ట్ర బడ్జెట్, విశ్వాస తీర్మానం కారణంగా తాను ప్రత్యక్షంగా కోర్టుకు రాలేకపోయానని వివరించారు. మార్చి 16న జరిగే విచారణకు వ్యక్తిగతంగా హాజరవుతానని తెలిపారు.
విచారణకు రండి
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఈ నెల 19 సోమవారం విచారణకు హాజరుకావాలని అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇప్పటివరకు ఐదుసార్లు విచారణకు రావాల్సిందిగా ఆయనను ఈడీ కోరింది. కానీ ఒక్కసారి కూడా కేజ్రీవాల్ విచారణకు హాజరుకాకుండా డుమ్మా కొట్టారు. తనకు వ్యక్తిగత పనులు ఉన్నాయంటూ ఇప్పటివరకు ఆయన విచారణకు హాజరుకాలేదు. ఈడీ మాత్రం నోటీసులు పంపిస్తూనే ఉంది. అయితే విచారణకు రాని కేజ్రీవాల్‌పై ఈడీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
లోక్‌సభ ఎన్నికలు వస్తున్న క్రమంలో కేజ్రీవాల్‌కు ఈడీ నుంచి నోటీసులు వస్తుండటంపై ఆప్ వర్గాలు మండిపడుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం చేయనీయకుండా చేసేందుకు ఇలా పదే పదే నోటీసులు ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. కేజ్రీవాల్‌ను చట్టవిరుద్దంగా అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆప్ వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈడీ నోటీసుల వెనుక కేంద్ర ప్రభుత్వ కుట్ర ఉందని ఆరోపిస్తున్నారు. కేజ్రీవాల్ నోటీసులపై స్పందించకపోవడంతో ఫిబ్రవరి 3న ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. ఉద్దేశపూర్వకంగానే విచారణకు డుమ్మా కొడుతున్నారని పిటిషన్‌లో పేర్కొంది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అనేకమందిని ఇప్పటికే ఈడీ అరెస్ట్ చేసింది. ఈ కేసులో కేజ్రీవాల్‌పై కూడా అనేక ఆరోపణలు రావడంతో.. ఆయనకు నవంబర్ 1వ తేదీన తొలిసారి ఈడీ నోటీసులు ఇచ్చింది. ఆ తర్వాత డిసెంబర్ 21న మళ్లీ సమన్లు జారీ చేసింది. అయినా కేజ్రీవాల్ విచారణకు రాకపోవడంతో ఈ ఏడాది జనవరి 3, జనవరి 18న, ఫిబ్రవరి 2న నోటీసులు జారీ చేసింది. ఎన్నిసార్లు నోటీసులు జారీ చేసినా కేజ్రీవాల్ పట్టించుకోవడం లేదు. కాగా లిక్కర్ స్కాంలో తన పాత్ర లేదని, రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తనను ఇరికిస్తున్నారని కేజ్రీవాల్ కామెంట్ చేశారు. తాను తప్పు చేసినట్లు ఆధారాలు ఉంటే ఈడీ అరెస్ట్ చేసుకోవచ్చని, తాను భయపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. చట్టాన్ని తాను గౌరవిస్తానంటూ కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు.