Conversion Racket: వీడియో గేమ్ ద్వారా మతమార్పిడీలు, పిల్లలే టార్గెట్‌గా డేంజర్ ముఠా పన్నాగం
ఘజియాబాద్‌లో ఓ మత మార్పిడి కేసును పోలీసులు దర్యాప్తు చేస్తే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఓ వీడియో గేమ్‌ను బేస్ చేసుకొని కొందరు వ్యక్తులు మతమార్పిడిలు చేస్తున్న దురాగతం బయటపడింది.
Conversion Racket: యూపీలోని ఘజియాబాద్‌లో అతి పెద్ద మత మార్పిడి రాకెట్ గుట్టు రట్టు అయింది. ఆన్లైన్ గేమింగ్ ద్వారా మైనర్లను లక్ష్యంగా చేసుకుని మతమార్పిడి చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ ముఠా సుమారు 400 మందిని మతమార్పిడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసు ఇప్పుడు ఘజియాబాద్ నుంచి మహారాష్ట్రలోని ముంబయి వరకు వ్యాపించింది. ఈ సీక్రెట్ గేమ్ ఎంత పెద్దదో, వందల మంది దీని వలలో ఎలా చిక్కుకున్నారో తెలుసుకునేందుకు పోలీసులు, ఎన్ఐఏ ప్రయత్నిస్తున్నాయి.
ఘజియాబాద్ నుంచి మొదలైన మతమార్పిడుల కథ ఇప్పుడు మహారాష్ట్రలోని ముంబయికి చేరింది. పెద్ద పెద్ద నగరాల్లో ఉన్న వారిని టార్గెట్ చేసుకొని ముఠా మైండ్‌బ్లాంక్ అయ్యే ప్లాన్ వేసింది. అసలు ఈ మతమార్పిడి గేమ్ ఏంటి, దీనికి సూత్రధారి ఎవరు, ఈ దర్యాప్తులో బయటకు వచ్చిన సమాచారం చూస్తే ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఘజియాబాద్‌లో పిల్లలను మతమార్పిడి చేసేలా ట్యూన్ చేస్తున్న గేమ్ వెనుకున్న ప్లాన్ చూస్తే మతిపోతుంది. ఆన్లైన్ గేమ్స్ ద్వారా పిల్లలను మనసు మార్చడమే వాళ్ల టార్గెట్. వారంతా వేర్వేరు నగరాలకు, ప్రాంతాలకు చెందిన వారే. వాళ్లంతా ఆడే గేమ్ మాత్రం ఒకటే. షానవాజ్ అలియాస్ బడ్డో ఈ మొత్తం రాకెట్ సూత్రధారి అని తేలింది. ఆన్లైన్ గేమింగ్ ద్వారా పిల్లలను ట్రాప్ చేయడమే ఈ ముఠా పని.
ఆన్లైన్ గేమ్స్ ద్వారా పిల్లలను తప్పుదోవ పట్టించే కళలో షానవాజ్ ఎక్స్‌పర్ట్ అని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ గేమ్ ద్వారా షానవాజ్ చాలా మంది పిల్లలను తప్పుదోవ పట్టించినట్లు దర్యాప్తులో తేలింది. దర్యాప్తు ప్రారంభించినప్పుడు ఈ ఆటతో సంబంధం ఉన్న అబ్దుల్ రెహమాన్ అనే మతగురువు కూడా పోలీసులకు చిక్కాడు. అయితే ఈ ఆట సూత్రధారి బడ్డో ఇంకా పరారీలో ఉన్నాడు. అతడిని వెతుక్కుంటూ ముంబై చేరుకున్న ఘజియాబాద్ పోలీసులు థానే, షోలాపూర్‌లలో పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడైన బడ్డో ఫోర్ట్‌నైట్ గేమ్ ఆడుతున్న పిల్లలనే టార్గెట్ చేసుకున్నాడు. ఈ ఆన్లైన్ గేమ్ గురించి చాలా మందికి తెలుసు. కానీ ఈ గేమ్ ద్వారా ఘజియాబాద్‌లో పిల్లలను మతం మార్చేలా ట్రైన్ చేస్తున్నారని చాలా మందికి తెలియదు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం షానవాజ్ ఫోర్ట్‌నైట్ గేమ్‌లో నిపుణుడైన ఆటగాడు. ఈ గేమ్ ప్లే స్టోర్లో అందుబాటులో లేదని, ఇతర యాప్ల ద్వారా డౌన్లోడ్ చేసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.
వాస్తవానికి ఫోర్ట్‌నైట్ గేమ్‌లో చాలా మంది ఆటగాళ్ళు ఉన్నారు. అందులో ఒక ఆటగాడు షానవాజ్. ఈ గేమ్‌లో బడ్డో పేరుతో షానవాజ్ తన ఐడీని క్రియేట్ చేశాడు. షానవాజ్ ఈ గేమ్‌లో ఛాంపియన్ కావడంతో అతనితో ఆన్ లైన్ గేమ్స్ ఆడటానికి పిల్లలు ఇష్టపడేవారు. డిస్కార్డ్ చాటింగ్ యాప్ పిల్లలతో సంభాషించడానికి ఉపయోగించుకున్నాడు. ఇందులో ఎక్కువగా గేమర్లు ఉంటారు.
ఈ యాప్‌లో షానవాజ్ పిల్లల గ్రూప్ క్రియేట్ చేశాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ చాట్ గ్రూప్‌లో పిల్లలు షానవాజ్‌ను గేమ్ ఆడమని రిక్వస్ట్ చేసేవాడు. వారి ప్రోద్బలంతో షానవాజ్ ఆన్ లైన్ గేమ్ ఆడుతూ పిల్లలతో చాట్ చేసేవాడు. ట్రిక్స్ చెప్పేవాడు. క్రమంగా జకీర్ నాయక్ వీడియోలను ఈ చాటింగ్ ప్లాట్ ఫామ్ లో షేర్ చేయడం స్టార్ట్ చేశాడు. తర్వాత కొన్ని బ్రెయిన్ వాష్ వీడియోలను కూడా షేర్ చేశాడు. ఆ తర్వాత ఆ గ్రూప్‌లో ఉండే పిల్లలు, ఇతర వ్యక్తులను సమీపంలోని మసీదుకు వెళ్లి ప్రాక్టీస్ చేయాలని బలవంతం చేసేవాడు.
ఇలా చాలా మంది వాడి ట్రాప్‌లో పడ్డారు. అలా పడ్డవారిలో ఘజియాబాద్‌తోపాటు చెందిన ఓ వ్యక్తి మతం మార్చుకున్నాడు. మత మారాలని ఇతర ఫ్యామిలీ మెంబర్స్‌పై ఒత్తిడి తీసుకొచ్చాడు. దీంతో భయపడిపోయిన ఆ వ్యక్తి కుమార్తె విషయాన్ని సనాతన సంఘ్ అనే సంస్థకు చెప్పింది. తన తండ్రిలా నాలుగు వందల మందిని మతమార్పిడి చేశారని ఓ వీడియో షూట్ చేసి వాళ్లకు పంపించింది. సనాతన సంఘ్ సంస్థను నడుపుతున్న ఉపదేశ్ రాణా అనే వ్యక్తికి వీడియో పంపించి... మతమార్పిడి ముఠా బారి నుంచి ఎలాగైనా తన తండ్రిని కాపాడాలని కోరింది. దీంతో ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది.
ఈ పెద్ద మతమార్పిడి రాకెట్ పై హోం మంత్రిత్వ శాఖ కూడా నిఘా పెట్టింది. కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ఈ కేసును దర్యాప్తు చేయవచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ కేసు సూత్రధారి కోసం రెండు రాష్ట్రాల పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.