థార్ ఎడారిలోనూ పంటలు పండుతాయ్, ఈ శతాబ్దం చివరి నాటికి అదే జరుగుతుందట!
Thar Desert: ఈ శతాబ్దం చివరి నాటికి థార్ ఎడారి పచ్చదనంతో నిండిపోయే అవకాశముందని సైంటిస్ట్‌లు వెల్లడించారు.
Thar Desert:
థార్ ఎడారిలో పచ్చదనం..
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ఎడారుల విస్తీర్ణం అధికమవుతోంది. కానీ...థార్ ఎడారి (Thar Desert) మాత్రం వాతావరణ మార్పుల కారణంగా పచ్చదనంతో నిండిపోతుందని అంచనా వేస్తున్నారు నిపుణులు. ఈ శతాబ్దపు చివరి నాటికి ఇది కచ్చితంగా జరిగి తీరుతుందని చెబుతున్నారు. పాకిస్థాన్‌లని సింధ్ ప్రావిన్స్‌తో పాటు రాజస్థాన్, పంజాబ్‌లోనూ థార్ ఎడారి విస్తరించి ఉంది. 2 లక్షల కిలోమీటర్ల మేర విస్తీర్ణం కలిగి ఉన్న థార్..ప్రపంచంలోనే 20వ అతి పెద్ద ఎడారిగా చరిత్ర సృష్టించింది. గ్లోబల్ వార్మింగ్ కారణంగా పలు ఎడారుల విస్తీర్ణం పెరుగుతోంది. 2050 నాటికి సహారా ఎడారి 6 వేల చదరపు కిలోమీటర్ల మేర పెరుగుతుందని అంచనా. అయితే...ఇటీవలే Earth’s Future జర్నల్‌లో ఓ ఆసక్తికర అధ్యయనం వెలుగులోకి వచ్చింది. థార్ ఎడారి విషయంలో పూర్తి భిన్నమైన అంచనాలు కనిపించాయి. థార్ ఎడారి పరిసర ప్రాంతాల్లోని వాతావరణాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు...కీలక అంశాలను గుర్తించారు. భారత్,పాకిస్థాన్‌కి వాయువ్య దిశలో ఉన్న ప్రాంతాల్లో వర్షపాతం పెరుగుతోంది. 1901-2015 మధ్య కాలంలో ఇది 10-50% మేర పెరిగినట్టు గుర్తించారు. ఈ ప్రాంతాల్లో గ్రీన్ హౌజ్ గ్యాస్‌ల ప్రభావం తక్కువగానే ఉంటోంది. అందుకే...థార్ ఎడారి పరిసరాల్లో వర్షపాతం 50-200% వరకూ పెరిగే అవకాశముందని అంటున్నారు సైంటిస్ట్‌లు.
కారణమిదే..
రుతుపవనాలు తూర్పు వైపుగా పయనిస్తుండడం వల్ల పడమర, వాయువ్య ప్రాంతాల్లో వర్షపాతం గతంలో తక్కువగా ఉండేది. కానీ...ఈ మధ్య కాలంలో రుతు పవనాల దిశ పడమర వైపుగా మళ్లుతోంది. ఫలితంగానే...వాయువ్య ప్రాంతాల్లోనూ వర్షపాతం నమోదవుతోంది. ఈ మార్పు వల్ల దేశానికి ఆహార భద్రతకూ భరోసా లభిస్తుందని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ మార్పులతో థార్ ఎడారి కూడా పచ్చదనంతో నిండిపోయే అవకాశముందని చెబుతున్నారు. ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య కాలంలో భారీ వర్షాలు కురిస్తే దాన్ని టెక్నికల్‌గా Summer Monsoonగా పిలుస్తారు. థార్ ఎడారి పచ్చగా మారిపోవడంలో ఇదే కీలకం కానుంది. థార్ ఎడారి పచ్చగా మారిపోతే అది దేశ ఆర్థిక, సామాజిక మార్పులకూ కారణమవుతుందన్నది శాస్త్రవేత్తల అంచనా. దాదాపు 50 ఏళ్ల డేటాని కలెక్ట్ చేసిన తరవాతే ఈ నిర్ధరణకు వచ్చారు. ఎడారి ప్రాంతాల్లోనూ వర్షాలు కురిస్తే అక్కడా పంటలు పండించేందుకు అవకాశముంటుంది. తద్వారా ఆహార కొరత తీరిపోతుంది.
పెరుగుతున్న వలసలు..
వాతావరణ మార్పులతో ఎన్ని నష్టాలు జరుగుతున్నాయో కళ్ల ముందు స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. సమయానికి రుతుపవనాలు రావటం లేదు. ఎండల తీవ్రత ఏటా పెరుగుతోంది. చలి కూడా తట్టుకోలేనంత స్థాయిలో ఉంటోంది. కర్బన ఉద్గారాలు మితిమీరి గాల్లో కలుస్తుండటమే ఇందుకు ప్రధాన కారణం. ఈ సమస్య వల్ల ఆర్థికంగానే కాక సామాజికంగానూ నష్టం కలుగుతోంది. వాతావరణ మార్పులు, ప్రకృతి విపత్తుల కారణంగా 2021లో దేశవ్యాప్తంగా 50లక్షల మంది అంతర్గతంగా వలసలు వెళ్లారని తేల్చి చెప్పింది ఐక్యరాజ్య సమితి వెలువరించిన నివేదిక. ఆహార అభద్రత, అశాంతి, వాతావరణ మార్పుల కారణంగా గతేడాది ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల మంది వేరే ప్రాంతాలకు తరలిపోయారని యూఎన్ రెఫ్యుజీ ఏజెన్సీ వెల్లడించింది. ఈ రిపోర్ట్‌లోనే భారత్ గురించి కూడా ప్రస్తావించింది. చైనాలో అత్యధికంగా 60 లక్షల మంది, ఫిలిప్పైన్స్‌లో 57లక్షల మంది, భారత్‌లో 50 లక్షల మంది వలస వెళ్లినట్టు ఈ నివేదిక స్పష్టం చేసింది. సొంత ఊళ్లను, ఇళ్లను వదిలి వేరే ప్రాంతాలకు వలస పోయే వారి సంఖ్య ఏటా పెరుగుతోందని, వారిలో కొద్ది మంది మాత్రమే మళ్లీ తమ స్వస్థలానికి వస్తున్నారని యూఎన్ ఏజెన్సీ వివరిస్తోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధమూ ఈ వలసలకు పరోక్ష కారణమైందని చెబుతోంది.
Also Read: పర్యావరణ పరిరక్షణలో భారత్ ముందడుగు, ఐక్యరాజ్య సమితిలో మిషన్ లైఫ్ ఎగ్జిబిషన్