Election Code: ముగిసిన ఎన్నికలు - ఎన్నికల కోడ్ ఎత్తేసిన కేంద్ర ఎన్నికల సంఘం
Election Code Lifted: తెలంగాణ సహా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ ముగియడంతో కేంద్ర ఎన్నికల సంఘం కోడ్ ఎత్తేసింది. ఎన్నికల నియమావళి ఇక వర్తించదని స్పష్టం చేసింది.
EC Lifts Code of Conduct in Telangana: తెలంగాణతో (Telangana) సహా మధ్యప్రదేశ్ (Madhyapradesh), రాజస్థాన్ (Rajasthan), ఛత్తీస్ గఢ్ (Chattishgarh)లో ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఈ నెల 3న ఈ 4 రాష్ట్రాల ఫలితాలు వెలువడి కొత్త ప్రభుత్వాలు ఏర్పాటుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ (Election Code)ను కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) ఎత్తేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఇక వర్తించదని స్పష్టం చేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అక్టోబర్ 9న షెడ్యూల్ విడుదల చేయగా, నవంబర్ 3న ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. నవంబర్ 10 వరకూ నామినేషన్ల స్వీకరణ, 13న వాటి పరిశీలన, 15న ఉపసంహరణకు గడువు ఇచ్చారు. నవంబర్ 30న పోలింగ్ నిర్వహించారు. డిసెంబర్ 3న (ఆదివారం) ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఫలితాలు విడుదల కావడంతో కోడ్ ఎత్తేస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ ఫలితం ఇదే
మరోవైపు, 119 అసెంబ్లీ నియోజకవర్గాలున్న తెలంగాణలో 64 స్థానాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ 39, బీజేపీ 8, ఎంఐఎం 7, సీపీఐ 1 స్థానంలో విజయం సాధించాయి. ఈ క్రమంలో ప్రభుత్వ ఏర్పాటుకు హస్తం పార్టీ సిద్ధమవుతోంది. మంత్రివర్గ సిఫార్సు మేరకు ప్రస్తుత అసెంబ్లీని గవర్నర్ తమిళిసై (Telangana Governor Tamilisai) రద్దు చేశారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం సర్క్యూలర్ జారీ చేశారు. కొత్త అసెంబ్లీ (తెలంగాణలో మూడో శాసనసభ) ఏర్పాటుకు ఎలక్షన్ కమిషన్ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అంతకు ముందు తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ రాజ్ భవన్ కు వెళ్లారు. గవర్నర్ తమిళిసైకి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నివేదికతో పాటు, గెలిచిన అభ్యర్థుల జాబితాను అందించారు. ఇది వరకే కేసీఆర్ సీఎం పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్ కు పంపించగా, ఆమె ఆమోదించారు. మరికొన్ని గంటల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. సీఎం ఎవరన్నది కాంగ్రెస్ కేంద్ర అధిష్టానం ప్రకటించనుంది. దాంతో సీఎం ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.
మిగిలిన 3 రాష్ట్రాల్లో ఫలితం ఇలా
అటు, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బీజేపీ విజయ ఢంకా మోగించింది. తెలంగాణలో విజయం సాధించినా ఉత్తరాదిలో ఫలితాలు హస్తం పార్టీని నిరాశపరిచాయి. వీటిపై ఆత్మ పరిశీలన చేసుకుంటామని కాంగ్రెస్ ప్రకటించింది. ముఖ్యంగా మధ్యప్రదేశ్ లో ఏం జరిగిందో అర్థం కావడం లేదని, తాజా ఫలితాలపై విశ్లేషిస్తామని ఆ పార్టీ నేతలు తెలిపారు.
Also Read: BRS Chief KCR: ఓటమి తరువాత తొలిసారి పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో కేసీఆర్ భేటీ