Ghaziabad Blast: సినిమా చూస్తుండగా పేలిపోయిన టీవీ- బాలుడు మృతి, మహిళకు గాయాలు!
Ghaziabad Blast: సినిమా చూస్తుండగా ఒకేసారి టీవీ పేలిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది. ఈ పేలుడులో ఓ బాలుడు మృతి చెందాడు.
Ghaziabad Blast: ఈ మధ్య కాలంలో స్మార్ట్‌ఫోన్‌లు పేలిపోయిన ఘటనలు మనం చూశాం. అయితే ఉత్తర్‌ప్రదేశ్‌లో ఏకంగా ఒక ఎల్‌ఈడీ టీవీ పేలింది. ఈ ప్రమాదంలో ఓ బాలుడు మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయలయ్యాయి.
ఇదీ జరిగింది
ఘజియాబాద్‌లోని ఓ ఇంట్లో ఎల్‌ఈడీ టీవీ పేలిపోయింది. ఈ ఘటనలో 16 ఏళ్ల అమరేందర్ అనే బాలుడు మృతి చెందాడు. మృతుడి తల్లి, సోదరుడు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
తన స్నేహితులతో కలిసి అమరేందర్.. సినిమా చూస్తుండగా ఒక్కసారిగా టీవీ పేలిపోయింది. పేలుడు దాటికి భవనం గోడకు కన్నం పడింది. గోడ మిగిలిన చోట్ల బీటలు వారిందంటే ఏ స్థాయిలో పేలుడు సంభవించిందో ఊహించవచ్చు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. టీవీ ఎందుకు పేలిందనే అంశంపై నిపుణుల అభిప్రాయాన్ని తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
టీవీ ఎక్కువగా వేడెక్కడం సైతం పేలిపోవటానికి దారితీస్తుంది. ఒక్కటికంటే ఎక్కువ డివైజ్‌లతో కనెక్ట్ చేస్తే ఓవర్ హీట్ అవుతుందని నిపుణులు అంటున్నారు. నకిలీ కెపాసిటర్ లాగే ఓవర్ హీట్ కూడా పేలుడుకు కారణమవుతుందని తెలిపారు.
స్మార్ట్ ఫోన్
దిల్లీలో ఇటీవల ఓ స్మార్ట్ ఫోన్ పేలిన ఘటనలో మహిళ మృతి చెందింది. రెడ్‌మీ 6ఏ మొబైల్ వాడుతోన్న మహిళ ఎప్పటిలానే రాత్రిపూట ఫోన్ వాడి దాన్ని తల దగ్గర దిండు పక్కనే పెట్టుకొని పడుకుంది. అర్ధరాత్రి సమయంలో ఆ మొబైల్ పేలిపోయింది. దీంతో తలకు తీవ్రమైన గాయమై విపరీతంగా రక్తం పోయి ఆమె మృతి చెందింది. ఆమె కుమారుడు ఆర్మీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వివరాలను ఎండీ టాక్ అనే యూట్యూబ్ ఛానల్ నడిపే మంజీత్ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపారు.
గతంలో
రెండేళ్ల క్రితం కేరళలో ఇలాంటి ఘటనే జరిగింది. కొల్లాంకి చెందిన ఓ వ్యక్తి తన ఫోనును దిండు కింద పెట్టుకుని నిద్రించాడు. అది ఒక్కసారిగా పేలడంతో అతడి భుజం, ఎడమ చేతికి గాయాలయ్యాయి. డ్యూటీ చేసి ఇంటికి వచ్చిన తాను బాగా అలసిపోవడంతో వెంటనే నిద్రలోకి జారుకున్నానని, ఒక్కసారిగా శబ్దం రావడంతో ఉలిక్కి పడి లేచే సమయంలో భుజం ఒక్కసారిగా నొప్పి చేసిందని, దిండు కాలిపోతూ, ఫోన్ నుండి నిప్పులు చెలరేగాయని బాధితుడు చెప్పాడు.
Also Read: Biden-Ukraine war: పుతిన్ జోక్ చేయడం లేదు- అన్నంత పని చేసేలానే ఉన్నాడు: బైడెన్