Biden-Ukraine war: పుతిన్ జోక్ చేయడం లేదు- అన్నంత పని చేసేలానే ఉన్నాడు: బైడెన్
Biden-Ukraine war: అణ్వాయుధాల వినియోగంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ జోక్ చేయడం లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు.
Biden-Ukraine war: రష్యా- ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు జో బైెడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌పై యుద్ధంలో అణ్వాయుధాలను ప్రయోగిస్తామని ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేసిన వ్యాఖ్యలు జోక్ కాదని బైడెన్ అన్నారు. 1962లో క్యూబా మిసైల్ సంక్షోభం తర్వాత అమెరికా ఈ స్థాయిలో తీవ్రమైన అణు ముప్పును చూడలేదని బైడెన్ తెలిపారు.
మాన్‌హట్టన్‌లో గురువారం జరిగిన డెమొక్రాటిక్ పార్టీ విరాళాల సేకరణ కార్యక్రమంలో బైడెన్ ప్రసంగించారు. ఉక్రెయిన్‌ను ఆక్రమించాలనే లక్ష్యం కోసం పుతిన్ చేస్తున్న అణు బెదిరంపులు ఏమాత్రం హాస్యాస్పదం కాదని బైడెన్ ఈ సందర్భంగా అన్నారు. పుతిన్‌ను నిలువరించేందుకు ప్రయత్నిస్తున్నామని బైడెన్ తెలిపారు.
పుతిన్ వార్నింగ్
ఉక్రెయిన్‌లో ఆక్రమించిన భూభాగాలను కాపాడుకొనేందుకు తనకు ఉన్న దారులు మూసుకుపోతే అణుదాడి చేస్తానని పుతిన్ ఇటీవల హెచ్చరించారు.
"ఉక్రెయిన్‌లోని రష్యా నియంత్రణలోని గల భూభాగాల్లోని ప్రజలు.. నియో నాజీల పాలనలో ఉండాలని కోరుకోవడం లేదు. వారికి స్వేచ్ఛ కల్పిస్తాం. పశ్చిమ దేశాలను రష్యాను బ్లాక్ మెయిల్ చేస్తున్నాయి. కానీ ఆ బెదిరింపులకు రష్యా తలొగ్గదు. ఎందుకంటే వారి హెచ్చరికలను ఎదుర్కొనే ఆయుధ సంపత్తి మా సొంతం. హద్దులు దాటిన ఐరోపా దేశాలు ఇది గుర్తు పెట్టుకోవాలి. మా ప్రాదేశిక సమగ్రతకు ముప్పు వాటిల్లితే అణ్వాయుధాలను ప్రయోగించడానికి కూడా మేం వెనుకాడం. "