GenZ Protests Dharmendra Pradhan Resignation: నాడు రైతులు - నేడు జెన్‌జీ - ప్రజాఉద్యమాలకు మోదీ సర్కారైనా తలొగ్గాల్సిందే !
Education Minister Resigns: నీట్ వివాదంలో జెన్‌జీ విద్యార్థుల పోరాటానికి కేంద్ర ప్రభుత్వం తలొగ్గింది. నాడు రైతు చట్టాల ఉపసంహరణ నుంచి నేటి జెన్ జీ వరకూ కేంద్రం ప్రజా ఉద్యమాలకు వెనక్కి తగ్గింది.

GenZ Student Protests NTA NEET: భారత రాజకీయాల్లో నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గరు అనేది ఆ ఇమేజ్. అయితే, ప్రజా వ్యతిరేకత నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఉద్యమాలు మితిమీరినప్పుడు ఎంతటి బలమైన ప్రభుత్వమైనా ప్రజాభిప్రాయానికి తలొగ్గక తప్పదని చరిత్ర మళ్ళీ నిరూపించింది. జాతీయ స్థాయిలో ప్రవేశ పరీక్షల నిర్వహణ వివాదం, ప్రశ్నాపత్రాల లీకేజీల రచ్చతో విసిగిపోయిన దేశంలోని జెన్‌జీ యువత, విద్యార్థి లోకం చేపట్టిన అపూర్వ పోరాటం ముందు కేంద్రం చివరికి మోకాలిల్లింది. ప్రారంభంలో సంస్కరణలు చేస్తాం కానీ మంత్రి రాజీనామా ప్రసక్తే లేదని భీష్మించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, వీధిపోరాటాల తీవ్రత ముందు లొంగిపోతూ తన పదవికి రాజీనామా సమర్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
గతంలో రైతు చట్టాల ఉపసంహరణ
ఈ చారిత్రాత్మక పరిణామం గతంలో దేశ రాజధాని సరిహద్దులను దిగ్బంధించిన సాగు చట్టాల వ్యతిరేక రైతు ఉద్యమాన్ని గుర్తుకు తెస్తోంది. నాడు వ్యవసాయ చట్టాల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎంతగా సమర్థించుకున్నప్పటికీ, అన్నదాతల సుదీర్ఘమైన పట్టుదల, ఆందోళనల తీవ్రత ముందు వెనక్కి తగ్గి, స్వయంగా ప్రధాని మోదీ ప్రసంగిస్తూ ఆ మూడు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అదే శైలిలో నేడు దేశ భవిష్యత్తు అయిన విద్యార్థులు, యువత ఏకమై రోడ్డెక్కడం, ఢిల్లీ వీధుల్లో న్యాయం కోసం నిరసనలు ఉధృతం చేయడంతో కేంద్రం మరోసారి డిఫెన్స్‌లో పడింది. విద్యా వ్యవస్థ పారదర్శకతపై నమ్మకం కోల్పోయిన యువత, కేవలం మాటల హామీలకు సంతృప్తి చెందకుండా బాధ్యుడైన మంత్రి రాజీనామానే లక్ష్మణరేఖగా పెట్టి సాధించుకున్నారు.
ప్రస్తుత జెన్‌జీ ఉద్యమాన్ని లోతుగా విశ్లేషిస్తే, ఇది కేవలం రాజకీయ ప్రేరేపితమైనది కాదని స్పష్టమవుతోంది. లక్షలాది మంది విద్యార్థుల కష్టం, వారి కుటుంబాల భవిష్యత్తుతో ఎన్‌టీఏ పరీక్షల నిర్వహణలో తలెత్తిన లోపాలు ఆడుకున్నాయి. ప్రభుత్వం ఎంతగా ఎన్‌టీఏ ఉన్నతాధికారులను మార్చినా, కొత్త పారదర్శక నిబంధనలు తెచ్చినా.. పరీక్షల నిర్వహణలో జరిగిన ఘోర వైఫల్యానికి నైతిక బాధ్యత ఎవరు వహిస్తారు అనే ఏకైక ప్రశ్నతో జెన్‌జీ యువత సాగించిన డిజిటల్, ఫీల్డ్-లెవల్ పోరాటం విపక్షాలకు సైతం ఒక కొత్త దిశను చూపించింది. పాతతరం రాజకీయాల వ్యూహాలను పక్కనపెట్టి, సోషల్ మీడియా వేదికగా నిరసనను ఉద్యమంగా మార్చడంలో ఈ తరం విజయం సాధించింది.
ప్రజా ఉద్యమాలకు తలొగ్గుతున్న మోదీ ప్రభుత్వం
మోదీ ప్రభుత్వం తన పదేళ్ల కంటే ఎక్కువ పాలనా కాలంలో ఉద్యమాలకు తలొగ్గడం ఇది మొదటిసారి ఏమీ కాదు. భూసేకరణ చట్టం సవరణల విషయంలో భూమి పుత్రుల నిరసనలతో వెనక్కి తగ్గడం నుంచి, తమిళనాడులో జల్లికట్టు నిర్వహణపై పట్టుబట్టిన ప్రజల ఆందోళనల మేరకు చట్టాలు సవరించడం వరకు కేంద్రం పలుమార్లు ప్రజాగ్రహానికి లొంగక తప్పలేదు. అలాగే సిటిజన్‌షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్ , కార్మిక చట్టాల అమలు ఆలస్యం వంటి అంశాల్లోనూ వ్యూహాత్మక వెనకడుగు వేసింది. అయితే, రైతు ఉద్యమం తర్వాత అంతటి భారీ స్థాయిలో ప్రభుత్వాన్ని నిలదీసి, కేంద్ర మంత్రి వర్గంలోని ఒక కీలక నేతతో రాజీనామా చేయించే స్థాయికి వెళ్లడం మాత్రం ఈ జెన్‌జీ సాధించిన అతిపెద్ద రాజకీయ-సామాజిక విజయంగా చరిత్రలో నిలిచిపోతుంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక కేవలం విద్యా వ్యవస్థ సంస్కరణలు మాత్రమే లేవు, పొంచి ఉన్న రాజకీయ ముప్పును తప్పించుకునే వ్యూహం కూడా ఉంది. రాజీనామా అంగీకరిస్తే బలహీనపడ్డామని అనుకుంటారు అనే భావన కంటే, జెన్‌జీ ఆందోళన రాష్ట్రాల సరిహద్దులు దాటి ప్రభుత్వంపై తిరుగుబాటుగా మారితే జరిగే రాజకీయ నష్టమే తీవ్రమైనదని గ్రహించే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు.
భారత రాజకీయాల్లో యువత పవర్
ధర్మేంద్ర ప్రధాన్ నిష్క్రమణ భారత ప్రజాస్వామ్యంలో చైతన్యవంతమైన పౌర సమాజం, యువత శక్తికి నిదర్శనం. నాడు రైతులు, నేడు జెన్‌జీ విద్యార్థులు నిరూపించిన సత్యం ఒకటే.. ప్రజాస్వామ్యంలో ఏ ప్రభుత్వమూ ప్రజాకాంక్ష కంటే పెద్దది కాదు. అధికార బలం, మెజారిటీ స్థానాలు ఎన్ని ఉన్నా.. భావితరాల భవిష్యత్తుతో ఆడుకునే విధాన లోపాలు ఎదురైనప్పుడు, వ్యవస్థలకు నైతిక బాధ్యత, జవాబుదారీతనం నేర్పే శక్తి యువ ఉద్యమాలకు ఉందనే బలమైన సందేశాన్ని ఈ పరిణామం అందించింది.
Before You Go
West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
ట్రెండింగ్ వార్తలు






















