Shiv Sena on Nitish Kumar: నితీష్‌కు తత్వం బోధపడింది, ఇక శిందేకి కూడా అర్థం కావాలి - శివసేన సామ్‌నా పత్రిక సెటైర్లు
Bihar: ఎన్‌డీయేతో జేడీ(యూ) తెగదెంపులు చేసుకోవటంపై శివసేన హర్షం వ్యక్తం చేసింది. సామ్‌నా పత్రికలో ఈ అంశంపై ఎడిటోరియల్ ప్రచురించింది.
Shiv Sena on Nitish Kumar:
జేడీయూని భాజపా నిర్వీర్యం చేయాలని చూసింది: సామ్‌నా
ఎన్‌డీఏతో తెగదెంపులు చేసుకుని, నితీష్ కుమార్ యాదవ్ సంచలనం సృష్టించారని అభిప్రాయపడింది శివసేన. ఈ పరిణామం..2024 లోక్‌సభ ఎన్నికల్లో భాజపాను తప్పకుండా ఇరకాటంలో పెడుతుందని వ్యాఖ్యానించింది. శివసేన పత్రిక సామ్‌నాలో ఈ విషయం వెల్లడించింది. ఇందులోని ఎడిటోరియల్‌లో జేడీ(యూ) అధినేత నితీష్ కుమార్‌ను ప్రశంసించింది. భాజపా..JD(U)ని నిర్వీర్యం చేయాలని కుట్ర పన్నిందని, నితీష్ దాన్ని తిప్పికొట్టి, భాజపాతో మైత్రికి స్వస్తి పలికారని తెలిపింది. మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నికైన ఏక్‌నాథ్ శిందే కూడా దిల్లీ ప్రభుత్వం ముందు తలొంచుకుని కూర్చున్నారని మండి పడింది. "భాజపాతో సంబంధాలు తెంచుకుని కూడా రాజకీయ భవిష్యత్‌ను చూసుకోవచ్చని నితీష్ నిరూపించారు. ఇది ఆయన (ఏక్‌నాథ్ శిందే) అర్థం చేసుకోవాలి" అని చురకలు అంటించింది సామ్‌నా ఎడిటోరియల్. రాష్ట్రీయ జనతా దళ్ (RJD) ఫౌండర్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు, నితీష్ కుమార్‌కు మధ్య ఉన్న విభేదాలు వెంటనే తొలగిపోవాలని ఆకాంక్షించింది.
జాతీయ రాజకీయాలపైనా ప్రభావం..
ఇదే సమయంలో లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్‌పైనా ప్రశంసలు కురింపించిది సామ్‌నా ఎడిటోరియల్. 2020లో ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారని, యువ నాయకుడిగా పేరు సంపాదించుకున్నారని కితాబునిచ్చింది. భాజపా జేడీ(యూ) కూటమిని ఢీకొట్టి ఆ స్థాయిలో సీట్లు రాబట్టుకోవటం సాధారణ విషయం కాదని అభిప్రాయపడింది. 2020లో జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్‌జేడీ, జేడీయూ పోటాపోటీగా బరిలోకి దిగాయి. కొన్ని దశాబ్దాలుగా..లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ మధ్య సంబంధాలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. ప్రస్తుతం భాజపా నేతృత్వంలోని ఎన్‌డీయేను వదిలిపెట్టి మరోసారి ఆర్‌జేడీతో కలిసిపోయింది జేడీ(యూ). మహారాష్ట్రలో ఠాక్రే సేనను భాజపా ఎలాగైతే నిర్వీర్యం చేసిందో, బిహార్‌లో జేడీయూని కూడా అదే విధంగా చేయాలని చూసిందని, అందుకే జేడీయూ ముందుగా మేల్కొని బయటకు వచ్చేసిందని కొందరు విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు శివసేన సామ్‌నా పత్రిక కూడా అదే చెబుతోంది. బిహార్‌లో మారే రాజకీయ పరిణామాలు...జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపిస్తాయని అంటారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ఈ మార్పుతో తప్పకుండా 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రభావం కనిపిస్తుందని అంటున్నారు విశ్లేషకులు. ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ తరవాత బిహార్‌లో అత్యధిక లోక్‌సభ నియోజకవర్గాలున్నాయి.
8 సార్లు ముఖ్యమంత్రిగా..
నితీశ్ కుమార్ 2005 నుంచి ఇప్పటివరకు మొత్తం 8 సార్లు బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే ఇన్ని సార్లు ముఖ్యమంత్రి అయినా ఆయన ఎమ్మెల్యేగా ఎక్కడి నుంచీ ప్రాతినిధ్యం వహించడం లేదు. శాసనమండలి సభ్యుడిగా ఉంటూ ఆయన సీఎంగా సేవలందిస్తూ వస్తున్నారు. బిహార్ అసెంబ్లీలో 243 సీట్లు ఉన్నాయి. అతిపెద్ద పార్టీ ఆర్‌జేడీకి అసెంబ్లీలో 80 స్థానాలు ఉన్నాయి. భాజపా 77, జేడీయూ 45, కాంగ్రెస్ 19 సీట్లతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
Also Read: Khudiram Bose: భరత మాత ముద్దుబిడ్డ 'ఖుదీరాం బోస్' బయోపిక్, ఇదిగో ఫస్ట్ లుక్!
Also Read: తరణ్ ఆదర్శ్ రివ్యూ: ‘లాల్ సింగ్ చడ్డా’ అలా - ‘రక్షాబంధన్’ ఇలా, బాలీవుడ్ ఊపిరి పీల్చుకుంటుందా?