పాకిస్థాన్‌లో భారత్ టార్గెటెడ్ కిల్లింగ్స్ పాల్పడుతోంది - ఓ రిపోర్ట్ సంచలన ఆరోపణలు
Targeted Assassinations: భారత్ ఇతర దేశాల్లో టార్గెటెడ్ కిల్లింగ్స్‌కి పాల్పడుతోందని ఓ రిపోర్ట్ సంచలన ఆరోపణలు చేసింది.
India Targeted Assassinations: పాకిస్థాన్‌లో భారత్ కొంత మంది ఉగ్రవాదులను టార్గెట్ చేసి మరీ చంపుతోందంటూ UK daily The Guardian చేసిన ఆరోపణల్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. ఉగ్రవాదులను ఏరివేసేందుకు ఇండియా టార్గెటెడ్ కిల్లింగ్స్‌కి పాల్పడుతోందని ఆరోపించిన ఆ రిపోర్ట్‌ని వ్యతిరేకించింది. ఇవి ఒట్టి పుకార్లేనని, కేవలం భారత్‌పై విద్వేషంతోనే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని మండి పడింది. ఇటీవలే విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా ఈ ఆరోపణలపై స్పందించారు. వేరే దేశాల్లో ఇలా టార్గెటెడ్ కిల్లింగ్స్‌కి పాల్పడడం భారత్ పాలసీ కాదని తేల్చి చెప్పారు. భారత్‌కి ముప్పు ఉందనుకున్న వాళ్లని లక్ష్యంగా పెట్టుకుని హతమారుస్తున్నారంటూ ఈ రిపోర్ట్ స్పష్టం చేసింది. 2019లో పుల్వామా అటాక్ జరిగిన తరవాత RAW ఏజెన్సీ ఇప్పటి వరకూ 20 మందిని చంపినట్టు వెల్లడించింది. పాకిస్థాన్‌లో కొన్ని ఇంటర్వ్యూలు చేయడంతో పాటు,అక్కడి నిఘా వర్గాల సమాచారం ఆధారంగానే ఈ లెక్కలు చెబుతున్నట్టు వివరించింది ఆ నివేదిక. ఓ భారత అధికారి గురించి ప్రస్తావిస్తూ...రష్యా, ఇజ్రాయేల్ ఇంటిలిజెన్స్ వర్గాల పని తీరుని వివరించింది. ఇజ్రాయేల్ ఇంటిలిజెన్స్ విభాగం మొస్సాద్ (Mossad) రష్యా ఇంటిలిజెన్స్ KGB ఇదే విధంగా వేరే దేశాల్లోని వ్యక్తుల్ని చంపిస్తున్నాయని, ఈ దేశాల నుంచే భారత్ స్ఫూర్తి పొందిందని ఆరోపించింది. అంతే కాదు. పాకిస్థాన్ అధికారులు ఈ హత్యలకు సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ కూడా తమకు అందించినట్టు స్పష్టం చేసింది. అయితే..వీటిని వెరిఫై మాత్రం చేయలేదని వెల్లడించింది.
గతంలోనూ ఇవే ఆరోపణలు..
ఇండియన్ ఇంటిలిజెన్స్‌కి చెందిన స్లీపర్ సెల్స్ ఈ హత్యలకు పాల్పడినట్టు ఈ రిపోర్ట్ తేల్చి చెప్పింది. ఇలా భారత్‌పై ఆరోపణలు రావడం ఇదే తొలిసారి కాదు. గతంలో కెనడా, అమెరికా కూడా ఇలానే ఆరోపించాయి. గత సెప్టెంబర్‌లో కెనడాలోని ఖలిస్థాన్ వేర్పాటువాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ హస్తం ఉందని ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడ్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలతో రెండు దేశాల మధ్య వైరం పెరిగింది. భారత్‌లో వాంటెడ్‌గా ఉన్న హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో తమకు ఎలాంటి సంబంధం లేదని భారత్ తేల్చి చెప్పింది. ఇక అమెరికాలోని మరో ఖలిస్థాన్ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నున్‌ని హత్య చేయాలి చూశారని, ఆ కుట్రను తాము అడ్డుకున్నట్టు అమెరికా వెల్లడించింది. అయితే..ఈ ఆరోపణలపై భారత్ స్పందించింది. వీటిని పరిశీలిస్తామని స్పష్టం చేసింది. భద్రత విషయానికి వచ్చినప్పుడు కచ్చితత్వంతోనే ఉంటామని తెలిపింది. ఆ తరవాత విచారణ చేపట్టగా భారత్‌కి చెందిన ఓ అధికారి గురుపత్వంత్ సింగ్ పన్నున్‌ని హత్య చేసేందుకు ప్రయత్నించినట్టు తేలిందని ఇండియా స్పష్టం చేసింది. ఇప్పుడు ఏకంగా ఓ రిపోర్ట్ భారత్‌పై ఆరోపణలు చేయడం సంచలనమవుతోంది. దీనిని ఇండియా ఖండిస్తున్నప్పటికీ పదేపదే ఇలాంటి ఆరోపణలు రావడమే కీలకంగా మారింది.