Telangana News: 'వేట మొదలైంది.. నా సత్తా ఏంటో చూపిస్తా' - తనకు వెన్నుపోటు పొడిచారంటూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ సంచలన వ్యాఖ్యలు
Shankar Naik Comments: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కార్యకర్తల సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తన జోలికి ఎవరైనా వస్తే సహించేది లేదని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
BRS Ex MLA Shankar Naik Sensational Comments: మహబూబాబాద్ (Mahabubabad) మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత శంకర్ నాయక్ (Shankar Naik) శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎవరి జోలికి వెళ్లనని, తన జోలికి ఎవరన్నా వస్తే సహించేది లేదని, తన సత్తా ఏంటో చూపిస్తానని అన్నారు. గూడూరులో బీఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశం కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఓటమిపై కార్యకర్తలు, అభిమానులు ఆయన ఎదుట కంటతడి పెట్టుకున్నారు. మండల, గ్రామస్థాయి నాయకులు కన్నీటితో ఆయన వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో శంకర్ నాయక్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో ఎక్కడ చూసినా తాను చేసిన అభివృద్ధే కనిపిస్తుందని, కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. 'నాకు 54 ఏళ్లు క్రాస్ అయ్యాయి. బ్రతికిన కాడికి చాలు వేట మొదలైంది. నియోజకవర్గ ప్రజలను కాపాడుకునే సత్తా ఉంది. నా జోలికి వస్తే ఒక్కొక్కరి లెక్క తేలుస్తా. నా ఓటమికి గల కారణాలేంటో నాకు తెలుసు. మన పార్టీలోనే ఉంటూ నాకు వెన్నుపోటు పొడిచారు. బీఆర్ఎస్ లో ఉంటూ కాంగ్రెస్ పార్టీ కోసం పని చేశారు. నేను భూకబ్జాలకు పాల్పడ్డానని తప్పుడు ప్రచారం చేశారు. వాటిని నిరూపించాలని సవాల్ విసిరినా ఒక్కటీ నిరూపించలేకపోయారు. మానుకోటలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధే కనిపిస్తుంది. నేనేంటో ఉమ్మడి వరంగల్ జిల్లాలో అందరికీ తెలుసు. మళ్లీ మీ కోసం వస్తా. ఇప్పుడు నన్ను ఆపేవాడు ఎవరూ లేరు. ఆపే శక్తి కూడా ఎవరికీ లేదు.' అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ తాను అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు
కాంగ్రెస్ నాయకులు చెప్తే పోలీసులు వినరని, బీఆర్ఎస్ నేతలను చూసి పోలీసులు భయపడతారని శంకర్ నాయక్ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ హయాంలో అమలు చేసిన పథకాలనే కాంగ్రెస్ ప్రభుత్వం తమ పథకాల పేరిట పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రతిపాదించిన కల్యాణ లక్ష్మి చెక్కులను వారు పంపిణీ చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిన 6 గ్యారెంటీల పథకాలు ఏ ఒక్కటీ కూడా ముందుకు సాగవని, మళ్లీ అధికారంలోకి వచ్చేది మనమే అని కార్యకర్తలతో వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సైతం
మరోవైపు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు సైతం సొంత పార్టీ నేతలపైనే తీవ్ర విమర్శలు చేశారు. వరంగల్ ఆత్మ గౌరవం ఉన్న జిల్లా అయిన వరంగల్ నుంచి ఎర్రబెల్లి, సత్యవతికి మంత్రి పదవులు ఇస్తే ఉద్యమకారులు బాధ పడ్డారన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ లో జర్నలిస్ట్ లతో చిట్ చాట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వాదం, ఉద్యమం తెలియని వారికి మంత్రి పదవి ఇస్తే ఎట్లా అధినేత వాస్తవాలు వినే అవకాశం ఇస్తే ఎవరైనా చెబుతారు, వాస్తవాలు చెప్పే వారు బయట, జోకుడు గాల్లు లోపల ఉంటే ఎలా వాస్తవాలు తెలుస్తాయి అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
Also Read: BRS MLC Ravinder Rao : సొంత నేతలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఘాటు వ్యాఖ్యలు - దారి మార్చేస్తున్నారా ?